English | Telugu
రాయలసీమ లిఫ్ట్‌ను జగన్, కేసీఆర్‌కు తాకట్టు పెట్టారు : సోమిరెడ్డి
Updated : Jan 15, 2026
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో లాలూచీ పడి జగన్‌మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును తాకట్టు పెట్టేశారని ఆరోపించారు.
అక్కడ తెలంగాణలో కేసీఆర్ సీఎం కాగా, ఇక్కడ ఏపీలో జగన్ సీఎం గా ఉన్న సమయంలో ఇద్దరి మధ్య విడదీయలేని అనుబంధం ఉందని వ్యాఖ్యానించారు. 2020లో తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదుతో రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ స్టే విధించిందని గుర్తు చేశారు.
2020 నుంచి 2024 వరకు దాదాపు నాలుగేళ్లపాటు ఇద్దరూ సీఎంలుగా కొనసాగినప్పటికీ ఎన్జీటీ స్టే కొనసాగడమే వీరి కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. ఈ వ్యవహారాన్ని ఏపీ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యారని ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎప్పుడైనా ఎన్జీటీ స్టే విధించిందా? పనులు ఆపిందా? పెనాల్టీ వేసిందా? అని ప్రశ్నించారు.
లిఫ్ట్ పనులే ప్రారంభించకుండా వందల కోట్ల రూపాయలు దోచుకునేందుకు కేవలం మట్టి పనులకే పరిమితమయ్యారని విమర్శించారు. మట్టి పనుల బిల్లులు చేసుకోవడంలో ఎన్జీటీ స్టే అడ్డురాలేదని, కానీ అసలు లిఫ్ట్ నిర్మాణానికే స్టే అడ్డువచ్చినట్లుగా వ్యవహరించారని మండిపడ్డారు.
ఇంత బహిరంగంగా రాయలసీమను కేసీఆర్‌కు తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి చెప్పే సినిమా కథలను ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. ప్రజలంతా నిజాన్ని అర్థం చేసుకున్నారని, వైసీపీ నాయకులు నోర్లు అదుపులో పెట్టుకోవాలని సోమిరెడ్డి హెచ్చరించారు.