English | Telugu
ఎంత పని జరిగింది.. టిక్ టాక్ వీడియో చూసి తట్టుకోలేక ఆత్మహత్య
Updated : Nov 11, 2019
టిక్ టాక్ మరొకరి ప్రాణం తీసుకుంది. చీటీ డబ్బులు తీసుకుని పరారయ్యాడని, కనిపిస్తే సమాచారం ఇవ్వాలని, తన ఫోటోలను టిక్ టాక్ లో వైరల్ చేయడంతో ఓ తెలుగు యువకుడు కువైట్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 2 వేల దినార్లు తీసుకుని పరారయ్యాడు అంటూ ఫ్రెండ్స్ వైరల్ చేసిన వీడియోతో మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు ఆ యువకుడు.
తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం శివకోడు గ్రామానికి చెందిన పుచ్చకాయల మోహనకుమార్ ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. అక్కడే పని చేసుకుంటూ ఊరిలో ఉంటున్న తల్లికి డబ్బులు పంపేవాడు. మోహన్ కువైట్ లో చిట్టీలు వేసి 2 వేల దినార్లు తీసుకుని పరారయ్యాడు అంటూ అతని స్నేహితులు దుర్గారావు , మధు తదితరులు టిక్ టాక్ లో వీడియో పోస్ట్ చేశారు.అది కాస్తా వైరల్ కావడంతో పరువు పోయిందని మోహన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.కువైట్ లోని తన నివాసంలోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 3వ తేదీన కువైట్లో మోహన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు ఇండియన్ ఎంబసీ ద్వారా కువైట్ ఎంబసీని సంప్రదించి మృతదేహాన్ని స్వగ్రామం శివకోటికి తీసుకువచ్చారు.ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన కుమారుడు శవంగా తిరిగి రావడం చూసిన మోహన్ తల్లి తల్లడిల్లింది.. ఇతర కుటుంబ సభ్యులు , స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. తన కుమారుడు చాలా మంచివాడని.. చిట్టీలు పాడే మాట నిజమే కానీ 2 వేల దినార్లు తీసుకుని పరార్ అయిన మాట అబద్ధమని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోహన్ అంటే గిట్టక కావాలనే దుర్గారావు , మధు ఈ పని చేశారని భావిస్తున్నట్లు బంధువులు తెలిపారు. పోలిసులు ఇప్పటికే ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నట్లు సమాచారం.