English | Telugu

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం.. పలు ప్రాంతాల‌లో ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా బంజారాహిల్స్, ఫిలింనగర్, శేరిలింగంపల్లి, చందానగర్ మియాపూర్, ఈసీఐఎల్‌, సైనిక్‌పురి, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌, తిరుమలగిరి, బొల్లారం, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, చిలకలగూడ, బేగంపేట, అల్వాల్‌ ప్రాంతాల్లో వర్షం పడింది.

పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల నుంచి వచ్చే ఉద్యోగులు అసౌకర్యానికి గురయ్యారు. మరోవైపు వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోగా.. పలువురు మెట్రో పిల్లర్ల కింద తలదాచుకున్నారు. కాగా, వర్షం నేపథ్యంలో అధికారులను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. వర్షం తగ్గేంత వరకూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు.