English | Telugu

సూర్య, దుల్కర్ సల్మాన్ మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరంటే?

'కేజీఎఫ్' ఫ్రాంచైజ్ ను నిర్మించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ ఇటీవల ప్రముఖ దర్శకురాలు సుధా కొంగరతో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇది మల్టీస్టారర్ మూవీ అని.. ఇందులో సూర్య, దుల్కర్ సల్మాన్ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది.

'గురు', 'ఆకాశమే నీ హద్దురా' సినిమాలతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుధా కొంగర. ప్రస్తుతం 'ఆకాశమే నీ హద్దురా' హిందీ రీమేక్ తో బిజీగా ఉన్న ఆమె ఆ తర్వాత హోంబలే ఫిల్మ్స్ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇది సూర్య, దుల్కర్ కలయికలో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనున్న భారీ మల్టీస్టారర్ అని టాక్. ఇప్పటికే సూర్యతో కలిసి 'ఆకాశమే నీ హద్దురా' సినిమాకి పనిచేశారు సుధ. సూర్యకు తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. అలాగే మలయాళ హీరో దుల్కర్ ఇప్పటికే తెలుగు, తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. వీరి కాంబినేషన్ లో మూవీ అంటే సౌత్ లో ఖచ్చితంగా క్రేజ్ ఉంటుంది. అలాగే 'కేజీఎఫ్' ప్రొడ్యూసర్స్ నిర్మిస్తున్న సినిమా కావడంతో పాటు నార్త్ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఏర్పడే అవకాశముంది.

ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ తక్కువ సినిమాలతోనే డైరెక్టర్ గా తనదైన ముద్ర వేసిన సుధ.. సూర్య, దుల్కర్ కలయికలో మల్టీస్టారర్ చేస్తే ఆ సినిమాలు సంచలనాలు సృష్టిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.