English | Telugu

శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్.. మరో 'రెడీ' అవుతుందా!

ఎనర్జిటిక్ హీరో రామ్, డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన 'రెడీ'(2008) ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఇప్పటికీ బుల్లితెరపై మంచి ఆదరణ లభిస్తుంటుంది. అలాంటి సూపర్ హిట్ ఎంటర్టైనర్ ని అందించిన ఈ కాంబో 14 తర్వాత మళ్ళీ చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది.

కెరీర్ లో 'ఆనందం', 'సొంతం', 'వెంకీ', 'ఢీ', 'రెడీ', 'దూకుడు', 'బాద్ షా' వంటి ఎన్నో సూపర్ హిట్ ఎంటర్టైనర్స్ ని అందించిన శ్రీను వైట్ల.. సరైన విజయాన్ని అందుకొని తొమ్మిదేళ్లు అయింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన గత చిత్రాలు 'మిస్టర్'(2017), 'అమర్ అక్బర్ ఆంటోని'(2018) దారుణంగా నిరాశపరిచాయి. ఈ నాలుగేళ్లలో ఆయన దర్శకత్వంలో ఒక్క సినిమా కూడా రాలేదు. ఆ మధ్య మంచు విష్ణుతో 'ఢీ' సీక్వెల్ ప్రకటించాడు. కానీ తర్వాత ఆ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. మరోవైపు విష్ణు 'జిన్నా' అనే ప్రాజెక్ట్ తో బిజీ అయిపోయాడు. దీంతో శ్రీను వైట్ల నెక్స్ట్ మూవీ ఎవరితో? అసలు ఉంటుందా లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడు రామ్ తో తన స్టైల్ లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేయడానికి సిద్ధమవున్నట్లు తెలుస్తోంది.

రామ్ ఎనర్జీ గురించి, కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రీను వైట్ల తరహా యాక్షన్ కామెడీ సినిమాలు ఆయనకీ సరిగ్గా సరిపోతాయి. అయితే రామ్ కొంతకాలంగా మాస్ జపం చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్'తో బ్లాక్ బస్టర్ అందుకున్న రామ్ అప్పటి నుంచి వరుస మాస్ సినిమాలు చేస్తున్నాడు. ఆ తర్వాత వచ్చిన 'రెడ్' పర్లేదు అనిపించుకున్నప్పటికీ, రీసెంట్ గా విడుదలైన 'ది వారియర్'తో దారుణంగా నిరాశపరిచాడు. దీని తర్వాత కూడా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఓ పాన్ ఇండియా ఫిల్మ్ చేయబోతున్నాడు. ఇలా వరుసగా మాస్ సినిమాలు చేస్తున్న రామ్.. ఇటీవల శ్రీను వైట్ల చెప్పిన ఓ యాక్షన్ కామెడీ కథకి ఇంప్రెస్ అయ్యాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది అంటున్నారు.

సోషల్ మీడియాలో కనిపించే మీమ్స్ లో ఎక్కువగా శ్రీను వైట్ల సినిమాల్లోని సన్నివేశాలే ఉంటాయి. తన సినిమాలతో అంతలా ఎంటర్టైన్ చేసిన శ్రీను వైట్ల మళ్ళీ తన మార్క్ కామెడీ ఫిల్మ్ తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.