English | Telugu

పవర్ ఫుల్ కింగ్ పాత్రలో రామ్ చరణ్.. 'మగధీర'ను మించి!

'ఆర్ఆర్ఆర్' సినిమాతో నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చేస్తున్న 'RC15'(వర్కింగ్ టైటిల్)తో ఇండియన్ బాక్సాఫీస్ కి మరోసారి తన సత్తా చూపాలనుకుంటున్నాడు. ఇదిలా ఉంటే 'ఆర్ఆర్ఆర్'తో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న చరణ్ పై బాలీవుడ్ చూపు పడింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఓ బాలీవుడ్ మూవీలో పవర్ ఫుల్ కింగ్ రోల్ లో చరణ్ నటించే అవకాశముందని తెలుస్తోంది.

ప్రముఖ రచయిత అమిష్ త్రిపాఠి రాసిన 'సుహేల్ దేవ్: ది కింగ్ హూ సేవ్డ్ ఇండియా' పుస్తకం ఆధారంగా గతంలో ఒక సినిమాని ప్రకటించారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి కానీ కరోనా కారణంగా బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని పట్టాలెక్కించడానికి అమిష్ త్రిపాఠి సన్నాహాలు చేస్తున్నారట. భారతదేశ చరిత్రలో గొప్ప వీరుడుగా పేరు తెచ్చుకున్న ఉత్తరప్రదేశ్ కి చెందిన కింగ్ సుహేల్ దేవ్ పాత్ర కోసం మొదట బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పేరు పరిశీలించగా.. ఇప్పుడు ఆ పాత్రకు చరణ్ అయితే కరెక్ట్ అని అమిష్ భావిస్తున్నారట. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం చరణ్ ని సంప్రదించినట్లు కూడా వార్తలొస్తున్నాయి.

ఇటీవల అక్షయ్ టైటిల్ రోల్ పోషించిన 'పృథ్వీరాజ్' మూవీకి చెప్పుకోదగ్గ కలెక్షన్స్ కూడా రాలేదు. అందుకే అక్షయ్ కి బదులుగా చరణ్ నటిస్తే సినిమాకి పాన్ ఇండియా అప్పీల్ వస్తుందని భావిస్తున్నారట. అదీగాక అలాంటి పవర్ ఫుల్ పాత్రకి చరణే బెస్ట్ ఆప్షన్ అన్న ఆలోచనలో ఉన్నారట. గతంలో 'మగధీర'లో యుద్ధ వీరుడు కాలభైరవగా నటించి మెప్పించాడు చరణ్. ఇప్పుడు ఫుల్ లెన్త్ రోల్ లో పవర్ ఫుల్ కింగ్ గా నటిస్తే ఇక ఆ చిత్రం ఏ స్థాయికి వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.