English | Telugu

రాజమౌళి మ్యూజియం రాబోతుంది

హాలీవుడ్‌లో జురాసిక్‌ పార్క్‌, టైటానిక్‌, అవతార్‌ లాంటి అద్భుత చిత్రాలు చారిత్రక విజయం సాధించిన అనంతరం ఆ సినిమాల షూటింగ్‌లో ఉపయోగించిన వస్తువుల్ని. పరికరాల్ని ఊరికే అలా మూలన పడేయలేదు. ఆ వస్తువులతో ప్రత్యేకంగా మ్యూజియం ఏర్పాటు చేసి వాటి ప్రత్యేకతను అలాగే నిలబెట్టారు. ఐతే మన దగ్గర హీరో వేసుకున్న షర్టో.. విలన్లను తెగనరికిన గొడ్డలినో.. హీరోయిన్‌ వేసుకున్న గౌనునో వేలం వేసి ఛారిటీకి డబ్బులివ్వడం మామూలే కానీ.. అంతకుమించి సినిమాలో వాడిన వస్తువుల్ని, కాస్ట్యూమ్స్‌ను పట్టించుకోరు. ఐతే రాజమౌళి మాత్రం కొత్త సంప్రదాయానికి తెరతీయబోతున్నాడు. ‘బాహుబలి’ సినిమాలో ఉపయోగించిన ప్రతి కాస్ట్యూమ్‌ని, ప్రతి వస్తువునీ భద్రపరుస్తున్నాడు. హాలీవుడ్‌ స్టయిల్లోనే ‘బాహుబలి’ మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నాడు. మేకింగ్‌ పరంగానే కాకుండా ఈ విషయంలోనూ హాలీవుడ్‌ స్థాయిని అందుకోవడానికి జక్కన్న చేస్తున్న ప్రయత్నమిది. మళ్లీ ‘బాహుబలి’ లాంటి సినిమా తీస్తాడో లేదో కానీ.. బాహుబలి జ్ఞాపకాల్ని మాత్రం పదిలంగా ఉంచాలన్నది రాజమౌళి ప్లాన్‌. బాహుబలి రెండు భాగాలు పూర్తయ్యాక షూటింగ్‌ కోసం మొదటి నుంచి ఉపయోగించిన ప్రతి వస్తువునూ, ప్రతి కాస్ట్యూమ్‌నూ ఈ మ్యూజియంలో పెట్టబోతున్నారట.