English | Telugu
'పుష్ప: ది రూల్'లో ప్రియమణి!
Updated : Aug 1, 2022
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప: ది రైజ్'(పార్ట్-1) పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలకు మించి విజయాన్ని సాధించింది. దీంతో పార్ట్-2 గా వస్తున్న 'పుష్ప: ది రూల్'ను మరింత భారీ స్థాయిలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో కీలక పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని తీసుకున్నట్లు ఇప్పటికే వార్తలు రాగా.. తాజాగా మరో కీలక పాత్ర కోసం ప్రియమణి పేరు తెరపైకి వచ్చింది.
'పుష్ప' పార్ట్-1 లో సునీల్, అనసూయ జోడిని నెగటివ్ రోల్స్ లో చూపించిన సుకుమార్.. పార్ట్-2 లో విజయ్ సేతుపతి, ప్రియమణి జోడిని అంతకుమించి చూపించబోతున్నట్లు తెలుస్తోంది. వాళ్లిద్దరూ ఎంత గొప్ప నటులో ప్రత్యేకంగా చెప్పాల్సిన వసరం లేదు. పైగా సేతుపతికి సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా సేతుపతి కారణంగా తమిళ్ మార్కెట్ లో భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశముంది. ఇక ప్రియమణికి సౌత్ తో పాటు 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ తో నార్త్ లోనూ మంచి గుర్తింపు ఉంది. 'పుష్ప: ది రైజ్'పై ఏర్పడిన భారీ అంచనాల నేపథ్యంలో ఇలా స్టార్స్ ని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది.
మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.