English | Telugu
ఫార్ములాకు 'చిక్కిన' ఎన్టీఆర్
Updated : Sep 12, 2015
హీరోలు కొత్త కథలవైపు దృష్టి సారిస్తున్నారు. ప్రయోగాలు చేయడానికి వెనుకంజ వేయడం లేదు. ప్రభాస్ బాహుబలితో తన ప్రతాపం చూపించాడు. మహేష్ బాబు బ్రహ్మోత్సవంతో కొత్త కథలవైపు మళ్లాడు. అల్లు అర్జున్, రామ్‌చరణ్‌లు కూడా.. వీలున్నప్పుడల్లా వైవిధ్య భరితమైన కథల్ని ఎంచుకోవడంలో ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే.. ఎన్టీఆర్ మాత్రం ఇంకా పాత ఫార్ములానే పట్టుకొని వేళాడుతున్నాడు.
గత కొన్నేళ్లలో యమదొంగ, అదుర్స్, బృందావనం... తరవాత ఎన్టీఆర్ వరుస ఫ్లాపులతో డీలా పడ్డాడు. బాద్ షా ఒకే అనిపించుకొన్నా ఎన్టీఆర్‌కి సరైన సంతృప్తి ఇవ్వలేదు. టెంపర్ దీ అదే దారి. శక్తి, రామయ్యా వస్తావయ్యా, రభస.. వీటిలో రొటీన్‌ఫార్ములా స్టోరీలతో బోరు కొట్టించాడు. కొత్త కథలు ఎంచుకొంటే తప్ప వర్కవుట్ కాని పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఇంకా పాత తరహా కథలతో నెట్టుకురావడం అభిమానుల్ని సైతం విస్మయ పరుస్తోంది. ఎన్టీఆర్ మారాల్సిన అవసరం ఉందని, కథలు - దర్శకుల విషయంలో ఇంకా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందేనని ఎన్టీఆర్ సన్నిహితులు అభిప్రాయ పడుతున్నారు.
ఇప్పుడా అవకాశం సుకుమార్ సినిమాతో దక్కింది. సుక్కు కథలు కాస్త డిఫరెంట్ గానే ఉంటాయి. అయితే మహేష్ తో తీసిన 1 - నేనొక్కడినే మాత్రం తీవ్ర నిరాశ పరిచింది. సుక్కు వెరైటీ వదిలి.. కమర్షియల్ సినిమాలవైపు మళ్లితే మాత్రం, ఎన్టీఆర్ మరో సారి ఫార్ములాకి చిక్కినట్టే. మరి ఈ మూసలోంచి ఎన్టీఆర్ ఎప్పుడు బయటకు వస్తాడో, ఎప్పుడు తన అభిమానుల్ని అలరిస్తాడో?