English | Telugu

పూరిది.. అంతా అంబ‌క్కేనా?

ద‌ర్శ‌కుడిగా పూరి జ‌గ‌న్నాథ్ డౌన్ ఫాల్ ఎప్పుడో మొద‌లైంది. లెక్క‌లు తీస్తే.. పోకిరి త‌ర‌వాత ఆయ‌న హిట్టు కొట్టిందే లేదు. క‌థ‌, క‌థ‌నాల విషయంలో పూరి `దిగ‌జారుడు` వైఖ‌రి ఆయ‌న అభిమానుల‌కు కూడా న‌చ్చ‌డం లేదు. టెంప‌ర్‌తో మ‌ళ్లీ ఊపిరి తీసుకొన్నా.. ఆ క‌థ ఆయ‌న‌ది కాదు. ఆ త‌ర‌వాత వ‌చ్చిన జ్యోతిల‌క్ష్మితో పూరి ఇమేజ్ మ‌రింత డామేజ్ అయితే... లోఫ‌ర్ ఇంకాస్త దిగ‌జార్చింది. ఈ ద‌శ‌లో చిరంజీవి సినిమా దూర‌మ‌వ్వ‌డం.. పూరిని బాగా ఇబ్బందుల్లోకి నెట్టేసింది. మ‌రోవైపు రోగ్ సినిమా కూడా ఆగిపోయింది. ప్ర‌స్తుతానికి పూరి ఖాళీ అన్న త‌రుణంలో ఒకేరోజు ఇద్ద‌రు హీరోల‌కు క‌థ‌లు చెప్పి ఒకే చేయించుకొన్న పూరి... అనే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. దాంతో పూరి మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశాడ‌న్న సంగ‌తి అర్థ‌మ‌వుతోంది.

అయితే ఇదంతా అంబ‌క్కేమో అనే అనుమానాలూ వ్య‌క్తం అవుతున్నాయి. క‌ల్యాణ్‌రామ్‌తో పూరి ఓ సినిమా ఓకే చేయించుకోవ‌డం పెద్ద మేట‌రేం కాదు. ఎందుకంటే క‌ల్యాణ్‌రామ్‌తో పెద్ద ద‌ర్శ‌కులు సినిమాలు చేయ‌డానికి రెడీగా లేరు. పూరికి హీరోలు లేరు. దాంతో ఈ కాంబో సెట్ట‌య్యిందంటే ఓకే అనుకోవ‌చ్చు. ఎన్టీఆర్ తో సినిమా ఓకే అయ్యింద‌న్న ప్ర‌చారం బ‌య‌ట‌కు రావ‌డం వెనుక పెద్ద మ‌త‌ల‌బే ఉండొచ్చు. ఎన్టీఆర్ తో సినిమా ఉందీ అన‌గానే.. పూరి చేయ‌బోయే సినిమాల‌పై బ‌య్య‌ర్ల దృష్టి పడుతోంది. దాంతో పాటు ఆయా సినిమాల‌కు క్రేజ్ కూడా వ‌స్తుంది. పైగా పూరి చేసేది అన్న‌య్య క‌ల్యాణ్‌రామ్ తో కాబ‌ట్టి... ఎన్టీఆర్ ఈ పుకారు బ‌య‌ట‌కు రావ‌డానికి త‌న వంతు స‌హాయప‌డి ఉంటాడు. ఎన్టీఆర్ షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది. కొర‌టాల‌తో సినిమా పూర్త‌య్యేనాటికి 2016 అయిపోతుంది. ఆ త‌ర‌వాత వినాయ‌క్‌తో ఓ సినిమా చేయాలి. అప్ప‌టికి పూరి ఎక్క‌డుంటాడో? పూరి ప‌రిస్థితి ఏమిటో చెప్ప‌లేం. టెంప‌ర్‌తో ఓ హిట్టిచ్చాడు కాబట్టి.. పూరిపై గౌర‌వంతో.. క‌థ‌ని ఓకే చేసిన‌ట్టు టాక్‌. సినిమా చేయాలా, వ‌ద్దా అనేది ఎన్టీఆర్ కూడా నిర్ణ‌యించ‌లేదు. పైగా నిర్మాత కూడా లేడాయె. ఎన్టీఆర్‌కి క‌థ న‌చ్చింది అన‌గానే.. నిర్మాత‌లేమైనా వ‌రుస క‌డ‌తారేమో అన్న‌ది పూరి లాజిక్‌. అంతకు మించి.. ఎన్టీఆర్ తో సినిమా విష‌యంలో పూరి స్ట్రాట‌జీ ఏం లేద‌న్న‌ది విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.