English | Telugu
చిరు.. అప్పుడేమయ్యాడో!
Updated : Oct 26, 2015
కంచె సినిమా అద్భుతం అంటూ చిరంజీవి ప్రెస్ మీట్ పెట్టి మరీ చిత్రబృందాన్ని అభినందించాడు. ఈ సినిమా ఓ పాఠం అంటూ కితాబిచ్చాడు. సంభాషణలు అద్భుతం అంటూ పొగిడేశాడు. అంతా బాగానే ఉంది. కంచె సినిమాకి ఆ అర్హత కూడా ఉంది. అయితే... బాహుబలి టైమ్ లో చిరు ఏమయ్యాడు? తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన సినిమా బాహుబలి.
ఇండ్రస్ట్రీ రికార్డులన్నీ తిరగరాసింది. బాలీవుడ్‌కీ చెమటలు పట్టించింది. అలాంటప్పుడు - తెలుగు చిత్రపరిశ్రమకు ఒకానొక పెద్దమనిషిగా చిరు ఇలా ఎందుకు స్పందించలేదు? ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు అభినందించలేదు? రాజమౌళికి సభాముఖంగా ఎందుకు అభినందనలు తెలియజేయలేదు?? అంతెందుకు మొన్నటికి మొన్న రుద్రమదేవి ప్రయత్నాన్నీ... చిత్రసీమ మొత్తం మెచ్చుకొంది. ఆసినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చిన చిరు మాత్రం.. రుద్రమదేవి గురించి మాట్లాడలేకపోయాడు. కారణం... తనయుడు సినిమా బ్రూస్లీ వస్తోందని.
రుద్రమదేవి గురించి గొప్పగా మాట్లాడితే - బ్రూస్లీ వసూళ్లపై దెబ్బపడుతుందని. మగధీర రికార్డులన్నీ మొదటి రెండు రోజుల్లోనే తుడిచిపెట్టుకుపోయిన బాహుబలి గురించి చిరు మాట్లాడకపోవడంపై పెద్దగా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని నాన్ మెగా ఫ్యాన్స్ కౌంటర్లు వేస్తున్నారు. పరిశ్రమకి ఓ మంచి సినిమా వచ్చినప్పుడు అభినందించాల్సిన బాధ్యత `పెద్ద మనుషులు`గా చెప్పుకొంటున్న చిరులాంటివాళ్లకు ఉంది. కంచెలాంటి సొంత సినిమాలకే కాదు, బయట సినిమాలకూ ఇలాంటి పొగడ్తలూ, ప్రెస్ మీట్లూ అవసరమే. ఆ విషయాన్ని చిరులాంటి అనుభవజ్ఞులు ఎప్పుడు తెలుసుకొంటారో?