English | Telugu

బ్ర‌హ్మోత్స‌వానికి బ‌లైంది ఎవ‌రు?

ఓ హిట్ సినిమా వ‌ల్ల ఎంత మంది బాగుప‌డ‌తారో తెలీదుగానీ... ఫ్లాప్ వ‌స్తే, అందులోనూ ఆ సినిమా డిజాస్ట‌ర్ అయితే - ఆ ప్ర‌భావంతో కొట్టుకెళ్లిపోయేవాళ్లు చాలామంది క‌నిపిస్తారు. టాలీవుడ్‌లో లేటెస్ట్ డిజాస్ట‌ర్ బ్ర‌హ్మోత్స‌వం అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా గుర్తు చేయాల్సిన అవ‌స‌రం లేదు. రూ.75 కోట్ల‌తో తీసిన సినిమా ఇది. దాదాపుగా రూ.90 కోట్ల బిజినెస్ జ‌రిగింది. ఇప్పుడు అందులో స‌గం కూడా వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. అంటే.. ముందుగా బ‌లైపోయేది ఈ సినిమా కొన్న బ‌య్య‌ర్లన్న‌మాట‌. ఫ్లాప్ ప్ర‌భావం ఎప్పుడైనా స‌రే.. ద‌ర్శ‌కుడిపై ఎక్కువ ప‌డుతుంది. ఈసారీ అంతే. ఈ సినిమా పోయింది అన‌గానే అంద‌రి వేళ్లూ శ్రీ‌కాంత్ అడ్డాల వైపు చూశాయి. అంత పెద్ద స్టార్‌నీ, చేతిలో ఉన్న వ‌న‌రుల్ని స‌రిగా వాడుకోలేదంటూ.. మ‌హేష్ ఫ్యాన్స్ సైతం శ్రీ‌కాంత్‌పై ఆగ్ర‌హంగా ఉన్నారు. ఈ సినిమాని చాలా ప్రెస్టేజియ‌స్‌గా తీసిన పీవీపీని బ్ర‌హ్మోత్స‌వం కృంగ‌దీస్తోంది. పెట్టుబ‌డి రాక‌పోగా..పీపీపీ ప్రెస్టేజ్‌కి ఇదో మ‌చ్చ‌లా మిగిలిపోనుంది. ఈ సినిమాలో ముగ్గురు క‌థానాయిక‌లున్నారు. అందులో ఎలాంటి ప్రాధాన్యం లేని పాత్ర ప్ర‌ణీత‌దే. ఈ సినిమా హిట్ట‌యితే త‌న‌కూ క్రెడిట్ వ‌స్తుందిలే అనుకొన్న ప్ర‌ణీత కూడా.. ఫ్లాప్‌కి బ‌లైపోయింది. స‌మంత క్యారెక్ట‌ర్ బాగున్నా.. అమె అందంగా లేద‌న్న కామెంట్లు వినిపించాయి. మొహం బాగా పీక్కుపోయింద‌ని, ఆమె కెరీర్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసిందేమో అని అంటున్నారు. సో.. ఆ విధంగా ఈ సినిమా స‌మంత‌కూ పెద్ద దెబ్బే! మిక్కీ జె.మేయ‌ర్ స్వ‌రాలు మ‌రీ స్లోగా సాగాయి. పెద్ద హీరోల సినిమాలకు మిక్కీ ప‌నిచేయ‌డు... అన్న సంకేతం ఈ సినిమా మ‌రోసారి అందించిన‌ట్టైంది. అలా మిక్కీకీ ఈ సినిమా మైన‌స్సే! చివ‌రిగా శ్రీ‌మంతుడు లాంటి సూప‌ర్ హిట్ త‌ర‌వాత‌.. ఇలాంటి డిజాస్ట‌ర్ మ‌హేష్ బాబు ఊహించి ఉండ‌డు. కేవ‌లం శ్రీ‌కాంత్ అడ్డాల ని న‌మ్మి బ‌రిలో దిగినందుకు ఎక్కువగా ప్ర‌శ్చాత్తాప‌డేది ఆయ‌నే. సో... ఈ లిస్టులో మ‌హేష్ పేరు కూడా చేర్చేయాల్సిందే. అలా... బ్ర‌హ్మోత్స‌వం దెబ్బ‌కి ఇన్‌స్టెంట్‌గా వీళ్లంతా బ‌లైపోయారు.. ఆఖ‌రిగా ఈసినిమా చూసిన ప్రేక్ష‌కుడు కూడా.