English | Telugu
'పుష్ప-2'లో 'ఫ్యామిలీ మ్యాన్'!
Updated : Jul 19, 2022
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప: ది రైజ్' ఎంతటి సంచనాలు సృష్టించిందో తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా నార్త్ లోనూ భారీ కలెక్షన్స్ రాబట్టి పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటింది. దీంతో ఈ చిత్రం రెండో భాగం 'పుష్ప: ది రూల్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమాకి మరింత భారీతనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్.
'పుష్ప-2' కోసం వివిధ భాషలకు చెందిన స్టార్ యాక్టర్లను రంగంలోకి దింపబోతున్నారట. ఇప్పటికే మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ పుష్పలో భాగమన్న సంగతి తెలిసిందే. 'పుష్ప-1'లో చివరిలో ఎంట్రీ ఇచ్చిన ఆయన స్క్రీన్ పై తక్కువ సేపే కనిపించినప్పటికీ బలమైన ముద్ర వేశాడు. పార్ట్-2 లో పుష్ప రాజ్ ని ఢీ కొట్టే వ్యక్తిగా ఆయన పాత్రే కీలకం కానుంది. ఇక మరో కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకోబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. ఇటీవల వీరిద్దరూ కమల్ హాసన్ తో కలిసి 'విక్రమ్' మూవీలో నటించి మెప్పించారు. ఇదిలా ఉంటే 'పుష్ప-2' కోసం బాలీవుడ్ నటుడిని కూడా రంగంలోకి దించబోతున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ యాక్టర్ మనోజ్ బాజ్ పాయ్ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఎన్నో సినిమాల్లో నటించిన మెప్పించిన ఆయన.. 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ తో మరింత మందికి చేరువయ్యారు. ఇప్పుడు పుష్ప-2 లో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం ఆయనను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 'పుష్ప: ది రూల్'పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇలా విభిన్న భాషలకు చెందిన స్టార్స్ తోడైతే ఆ అంచనాలు ఆకాశాన్నంటుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.