English | Telugu

బాహుబ‌లి సెట్లో... అనుష్క‌కి ఘోర అవ‌మానం

అనుష్క ప్రొఫెష‌న‌లిజాన్ని శంకించ వ‌ల‌సిన అవ‌స‌రం లేదు. పాత్ర కోసం ఏమైనా చేస్తుంది అనుష్క‌. ఎంత క‌ష్టమైనా ప‌డుతుంది. సెట్లో అంకిత‌భావంతో ప‌నిచేస్తుంది. అనుష్క‌ని చూసి ద‌ర్శ‌క నిర్మాత‌లు పొంగిపోతారు. క‌థానాయిక అంటే అలా ఉండాలి అని చెబుతుంటారు. అలాంటి అనుష్క‌కు సెట్లో ఘోర అవ‌మానం ఎదురైంద‌ని టాక్‌. అదీ బాహుబ‌లి సెట్లో. బాహుబ‌లి 2కి సంబంధించిన షూటింగ్ నిరాటంకంగా కొన‌సాగుతోంది. ప్రస్తుతం అనుష్క‌కి సంబంధించిన సీన్లు తెర‌కెక్కిస్తున్నారు. రాజ‌మౌళి ఎంత క్రియేటీవ్ జీనియ‌స్ అయినా.. సెట్లో ఆయ‌న కాస్త క‌ఠినంగానే ఉంటార‌ట‌. ఎవ‌రు చిన్న తప్పు చేసినా, డిసిప్లెన్ త‌ప్పినా అస్స‌లు క్ష‌మించ‌ర‌ట‌. అనుష్క‌పై ఫైర్ అవ్వ‌డానికి కార‌ణం అదే అని తెలుస్తోంది.

బాహుబ‌లి 2కి ముందు అనుష్క సైజ్ జీరో అనే సినిమా చేసింది. ఆ సినిమా కోసం బాగా బ‌రువు పెరిగింది. బ‌రువు త‌గ్గడానికి మూడు నెల‌ల స‌మ‌యం అడిగింద‌ట అనుష్క‌. రాజ‌మౌళి కూడా స‌రే అని చెప్పి దానికి త‌గ్గ‌ట్టుగానే షెడ్యూల్స్ ప్లాన్ చేసుకొన్నార్ట‌. అనుష్క మూడు కాదు.. ఐదు నెల‌ల స‌మ‌యం తీసుకొన్నా.. బ‌రువు ఏమాత్రం త‌గ్గ‌లేద‌ట‌. దాంతో అనుష్క‌పై రాజ‌మౌళి ఫైర్ అయ్యాడ‌ట‌. అదీ.. సెట్లో అంద‌రి ముందు. అప్ప‌టి నుంచీ అనుష్క ముభావంగా ఉంటోంద‌ని, సెట్లో ఎవ్వ‌రితోనూ పెద్ద‌గా మాట్లాడ‌డం లేద‌ని టాక్‌. త‌న షెడ్యూల్ ఎంత త్వ‌ర‌గా పూర్త‌వుతుందా? అని వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తోంద‌ట‌. బాహుబ‌లి అన‌గానే మ‌న‌సు విప్పి మాట్లాడే అనుష్క‌.. ఇప్పుడు ఈ సినిమా గురించి ఎవ్వ‌రితోనూ మాట్లాడ‌డం లేద‌ని.. అస‌లు ఈ సినిమా ప్ర‌స్తావ‌న తీసుకొస్తే బాధ‌ప‌డిపోతోంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.