English | Telugu

అల్లరోడు హీరోగా సైడయ్యి..డైరెక్టర్‌గా మారతాడా..?

అల్లరి నరేశ్..కామెడి హీరోల్లో రాజేంద్రప్రసాద్ తర్వాత అంతటి క్రేజ్‌ను తెచ్చుకున్న నటుడు. చాలా స్పీడుగా హిట్లు కొడుతూ నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అయితే అప్పుడెప్పుడో 2012లో సుడిగాడు తర్వాత మళ్లీ హిట్టు లేదు. దాని కోసం పడరాని పాట్లు పడుతున్నాడు ఈ బెట్టింగ్ బంగార్రాజు. రీసెంట్‌గా రిలీజైన సెల్ఫీరాజా మీద నరేశ్ గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ సినిమా అటు ఇటైతే నరేశ్ పరిస్థితి ఎంటీ.

పెద్ద కొడుకు రాజేశ్‌ని హీరోగా చేయాలని..చిన్న కొడుకు నరేశ్‌ని డైరెక్టర్‌గా చూడాలని ఈవీవీ సత్యనారాయణ కలగన్నారు. అనుకున్నట్టుగానే నరేశ్‌ని డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేర్చాడు. అయితే అనుకొని విధంగా రవిబాబు కళ్లలో పడి హీరోగా అయిపోయాడు. ఐతే తండ్రి కోరిక నెరవేర్చాలనుకున్నాడో లేక మరేదైనా కారణమో కానీ అల్లరి నరేశ్ త్వరలో డైరెక్టర్‌గా మారాలనుకుంటున్నాడు. తన దర్శకత్వంలో రాబోయే తొలి సినిమా ప్రేమకథ అని కూడా నరేశ్ వెల్లడించాడు. ఇంకో మూడేళ్లలో దానిని పట్టాలెక్కిస్తానని ఖచ్చితంగా చెబుతున్నాడు. ఎలాగూ మనోడి కెరీర్ అంతంత మాత్రంగా ఉంది కాబట్టి..తను డైరెక్టర్‌గా మారడానికి ఇదే కరెక్ట్ టైంగా నరేశ్ ఫిక్స్‌ అయినట్లున్నాడు.