English | Telugu

అక్కినేని వారబ్బాయికి ఎందుకండీ అంత ఇరిటేష‌న్‌..!

సినిమా ప్ర‌పంచానికీ, గాసిప్పుల‌కూ అవినాభావ సంబంధం ఉంది. వీటి బారీన ప‌డ‌న స్టార్ లేడు. క‌థానాయిక‌, నాయ‌కుడు, హాస్య‌న‌టుడు ఎవ‌రైనా స‌రే.. వీటికి అతీతులు కారు. ఫ‌లానా హీరో.. సినిమా ఆగిపోయింద‌ట నుంచి.. ఫ‌లానా హీరో ఫ‌లానా హీరోయిన్ క్లోజ్ గా ఉంటున్నార‌ట అన్నంత వ‌ర‌కూ ఈ గాసిప్పులు రాజ్య‌మేలుతుంటాయి. నెట్ ప్ర‌పంచం విస్తృత‌మ‌య్యాక‌, వెబ్ మీడియా పెరిగిపోయాక‌.. అవి మ‌రింత ఎక్కువ‌య్యాయి. తొలుత స్టార్స్ వీటిని సీరియ‌స్ గా తీసుకొన్నా,.. ఆ త‌ర‌వాత ప‌ట్టించుకోవ‌డం మానేశారు. కొంద‌రు ప‌ట్టించుకొన్నా బ‌య‌ట‌ప‌డ‌రు. ఆ టెక్నిక్ అఖిల్ కి ఇంకా అబ్బ‌లేద‌నిపిస్తోంది. అఖిల్ ఇండ్ర‌స్ట్రీలో అడుగుపెట్టి.. రెండేళ్లు కూడా కాలేదు. అంత‌కు ముందు నాగార్జున త‌న‌యుడిగా అఖిల్‌ని ట్రీట్ చేసిన వెబ్ మీడియా.. ఇప్పుడు అఖిల్‌కీ ప్ర‌త్యేక స్థానం క‌లిపిస్తోంది.

అఖిల్ ఎప్పుడైతే హీరో అయ్యాడో, అప్ప‌టి నుంచీ అఖిల్‌పైనా గాసిప్పులు షికారు చేస్తున్నాయి. అయితే ఈ ఈ గాసిప్పుల‌ను తెగ సీరియ‌స్ గా ప‌ట్టించుకొంటున్నాడు అఖిల్‌. త‌నపై ఎప్పుడు ఏ వార్త వ‌చ్చినా వెంట‌నే స్పందించి క్లారిటీ ఇస్తున్నాడు. వార్త‌ల‌పై స్పందించ‌డం, నిజ‌మేంటో చెప్ప‌డం వ‌ర‌కూ బాగానే ఉంది. కానీ.. వెబ్ రైట‌ర్ల‌పై మాత్రం ప్ర‌తీసారీ విరుచుకు ప‌డుతున్నాడు అఖిల్. త‌న‌పై గాసిప్ వ‌చ్చిన ప్ర‌తీసారీ ఇరిటేట్ అవుతున్న‌ట్టే అనిపిస్తోంది. ఇప్పుడు కూడా అంతే. వంశీ పైడిప‌ల్లి అఖిల్‌తో వేగ‌లేక‌పోతున్నాడ‌ని, ఈ సినిమా ఆగిపోయింద‌ని వార్త‌లొచ్చాయి. దాంతో వెబ్ రైట‌ర్ల‌పై... ట్విట్టర్ తో చెల‌రేగిపోయాడు. మీ విశ్వ‌స‌నీయ‌త‌ను దెబ్బ‌తీసుకోకండి.. నాకో మేనేజ‌ర్ ఉన్నాడు, త‌న‌కి ఫోన్ చేసి తెలుసుకోండి ఫ్రెండ్స్ అంటూ వ్యంగ్యంగా చుర‌క అంటించాడు. అఖిల్ త‌న రెండో సినిమా ఇంకా మొద‌ల‌వ్వ‌లేద‌న్న ఫ‌స్ట్రేష‌న్‌లో ఉన్నాడ‌ని, అందుకే ఇలా ఇరిటేట్ అవుతున్నాడ‌ని అత‌ని స‌న్నిహితులే గుస‌గుస‌లాడుకొంటున్నారు. గాసిప్పుల‌కు అల‌వాటు ప‌డ‌నంత వ‌ర‌కూ ఇలానే ఉంటుంది.. కొంత అనుభవం సంపాదించాక అంతా స‌ర్దుకుపోతుంది అంటూ అఖిల్‌కే స‌ల‌హాలిస్తున్నారు. మ‌రి అఖిల్ కూల్ అవుతాడంటారా?