English | Telugu

వినాయ‌క్‌కు లైఫ్ ఇచ్చిన‌ట్టే

మెగా ఫ్యామిలీకి వినాయ‌క్ చాలా కావాల్సిన వ్య‌క్తి. ఓకే సామాజిక వ‌ర్గానికి చెందిన‌వాడు కావ‌డంతో పాటు.. `అన్న‌య్య‌..` అని పిలుస్తూ... చిరంజీవికిఅత్యంత స‌న్నిహితుడైపోయాడు. వినాయ‌క్ కెరీర్‌కి బూస్ట‌ప్ ఇచ్చిన తొలి చిత్రాల్లో ఠాగూర్ ఒక‌టి కావ‌డం, ఆ సినిమా అంటే వ్య‌క్తిగ‌తంగా చిరంజీవీ ఇష్టప‌డ‌డంతో.. వినాయ‌క్ మ‌రింత ఆప్తుడు అయిపోయాడు. అంతే కాదు..చ‌ర‌ణ్‌కి నాయ‌క్ లాంటి మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్ కూడా అందించాడు. అందుకే చిరంజీవి త‌న 150 వ‌సినిమా అన‌గానే.. వినాయ‌క్ పేరే త‌ల‌చుకొన్నాడు. మ‌ధ్య‌లో కొన్ని కార‌ణాల వ‌ల్ల వినాయ‌క్‌ని సైతం ప‌క్క‌న పెట్టాల్సివచ్చింది.

మ‌రోవైపు వినాయ‌క్ అఖిల్ సినిమా ఫ్లాప్‌తో.. సందిగ్థంలో ప‌డ్డాడు. పెద్ద హీరోల‌తో సినిమా చేసి త‌న‌ని తాను నిరూపించుకోవాల‌న్నా... కుద‌ర‌ని ప‌రిస్థితి. ఈ ద‌శ‌లో చిరంజీవి నుంచి పిలుపు రావ‌డం... వినాయ‌క్‌ని ఆనందోత్సాహంలో నెట్టేసింది. ఒక విధంగా చిరు.. వినాయ‌క్‌కి లైఫ్ ఇచ్చిన‌ట్టే! అఖిల్ సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో ఇక వినాయ‌క్ పేరు చిరు త‌ల‌చుకోరేమో అనిపించింది.

కానీ.. అనూహ్యంగా మ‌ళ్లీ వినాయ‌క్‌కే పగ్గాలు అప్ప‌గించ‌డం ఇటు చిరు అభిమానుల‌నూ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తే విష‌యమే. క‌త్తిని తెలుగులో రీమేక్ చేయ‌డం, దానికి వినాయ‌క్ ద‌ర్శ‌కుడు కావ‌డం ఆల్మోస్ట్ ఖ‌రారు అయిపోయాయి. అతి త్వ‌ర‌లోనే మెగా కాంపౌండ్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది.