English | Telugu

చిరుని కాదంది.. కొత్త‌కుర్రాడికి ఎలా ఇచ్చింది?

త‌మన్నా ఓ సినిమాలో ఐటెమ్ గీతం చేయ‌బోతోంది. ఈ వార్త‌లో ఎలాంటి ప్ర‌త్యేక‌త లేదు. కాక‌పోతే... చిరంజీవి ప‌క్క‌న ఐటెమ్ గీతానికి నో చెప్పిన త‌మ‌న్నా - ఓ కొత్త కుర్రాడికి ఎస్ అన‌డమే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. బ్రూస్లీలో చిరంజీవి ఓ ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించిన సంగతి తెలిసిందే. ఓ ఫైట్ లో చిరు క‌నిపించాడు. అయ‌తే ఫైట్‌తో పాటు పాట కూడా తీయాల‌న్న‌ది చిత్ర‌బృందం ఆలోచ‌న‌. ఆ పాట కోసం త‌మ‌న్నా, ఇలియానాల‌ను సంప్ర‌దిస్తే.. ఇద్ద‌రూ మూకుమ్మడిగా `నో` చెప్పేశారు. చిరంజీవి కూడా ప్ర‌త్యేక గీతంలో క‌నిపించ‌డానికి అనాస‌క్తి చూపించ‌డంతో చిరు పాత్ర ఫైటుకి మాత్ర‌మే ప‌రిమిత‌మైంది.

చిరు అడిగితే.. నో చెప్పిన త‌మ‌న్నా ఇప్పుడు బెల్లంకొండ శ్రీ‌నివాస్ సినిమాలో ప్ర‌త్యేక గీతానికి ఎస్ చెప్ప‌డం మాత్రం మెగా అభిమానుల్ని సైతం క‌ల‌వ‌ర‌పాటుకి గురి చేస్తోంది. త‌మిళంలో హిట్ట‌యిన సుంద‌ర‌పాండ్య‌న్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. భీమ‌నేని శ్రీ‌నివాస‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరో. ఓ ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించ‌డానికి త‌మ‌న్నాని సంప్ర‌దించ‌డం, ఆమె ఎస్ అనేయ‌డం ట‌క‌ట‌క జ‌రిగిపోయాయి.

ఈ పాట‌కోసం త‌మ‌న్నాకు 60 ల‌క్ష‌ల పారితోషికం ఇస్తున్నార‌ట‌. చిరంజీవి సినిమాలో అయితే.. ఇర‌వై ముష్సై ల‌క్ష‌లకే ఐటెమ్ గీతం చేయాల్సివ‌చ్చేద‌ని, త‌న డిమాండ్‌ని త‌గ్గించుకోవ‌డం ఇష్టంలేక త‌మ‌న్నా ఆ పాట చేయ‌లేద‌ని, ఇప్పుడు అర‌వై ల‌క్ష‌లు వ‌స్తుంటే కాద‌న‌లేక‌పోయింద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ స‌మాచారం. అంటే త‌మ‌న్నాకి కావ‌ల్సింది స్టార్ కాద‌న్న‌మాట‌.. డ‌బ్బుల‌న్న‌మాట‌. ఈ మాట తెలిస్తే చిరు కూడా 60 ఇచ్చేవాడేమో..?