English | Telugu

పెద‌నాన్నతో ప్ర‌భాస్‌కి ఇబ్బందే!

ప్ర‌భాస్‌కి పెద‌నాన్న కృష్ణంరాజు అంటే చాలా చాలా గౌర‌వం. నా ఉన్న‌తికి కార‌ణం పెద‌నాన్నే అని చాలా సంద‌ర్భాల్లోచెప్పాడు కూడా. కృష్ణంరాజు కూడా ప్ర‌భాస్ స్టార్ డ‌మ్‌నీ, తాను సాధిస్తున్న విజ‌యాల్ని చూసి పొంగిపోతుంటారు. అయితే ఆ పెద‌నాన్నే ప్ర‌భాస్ కి ఇబ్బంది క‌లిగిస్తున్నారు.. పెద‌నాన్న‌కు అవున‌ని, కాద‌ని చెప్ప‌లేక ప్ర‌బాస్ కూడా.. తెగ ఇదైపోతున్నాడు.కార‌ణం ఏంటంటే.. పెద‌నాన్న కృష్ణం రాజుకి ప్ర‌భాస్ తో ఓ సినిమా చేయాల‌ని కోరిక‌. నిర్మాత‌గా కాదు, ద‌ర్శ‌కుడిగా. అందుకోసం క‌థ‌ల్ని కూడా రెడీ చేసుకొన్నారు.

అయితే ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ప్ర‌భాస్ కి పెద‌నాన్న‌తో సినిమా చేసేంత తీరిక లేకుండా పోయింది. బాహుబ‌లి 2 త‌ర‌వాత ఒప్పుకొన్న క‌మిట్‌మెంట్స్ చాలా ఉన్నాయి. పైగా పెద‌నాన్న‌ది ఎంత‌కాద‌న్నా ఓల్డ్ స్కూల్‌. ఈత‌రం అభిరుచుల‌కు త‌గిన‌ట్టుగా సినిమా తీయ‌క‌పోవ‌చ్చు. ప్ర‌భాస్ ఎదిగే త‌రుణ‌మిది. ఈ ద‌శ‌లో రిస్క్ తీసుకోవ‌డం ప్ర‌భాస్‌కీ ఇష్టం లేదు. కానీ...పెద‌నాన్న అడిగితే కాద‌న‌లేడు. ఈమ‌ధ్య పిల్మ్ చాంబ‌ర్‌లో దందా అనే టైటిల్ రిజిస్ట‌ర్ చేయించారు ప్ర‌భాస్. అంత‌కు ముందు ఒక్క అడుగు అనే టైటిల్ కూడా ప్ర‌భాస్ కోస‌మే న‌మోదు చేయించారు. ఈ రెండు సినిమాల్లో ఏదో ఒక‌టి కృష్ణంరాజు ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ తో తెరకెక్కించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

అయితే బాహుబ‌లి తో వ‌చ్చిన ఇమేజ్‌ని పాడుచేసుకోవ‌డం ప్ర‌భాస్ కి ఏమాత్రం ఇష్టం లేదు. ఈ విష‌యాన్ని పెద‌నాన్న‌తో చెప్ప‌లేక మింగ‌లేక తెగ ఇదైపోతున్నాడ‌ని తెలుస్తోంది. నిర్మాత‌గా అయితే కృష్ణంరాజు ఎప్పుడంటే అప్పుడు సినిమా చేయ‌డానికి ప్ర‌భాస్ రెడీనే. ద‌ర్శ‌కత్వ‌మే డౌటు ప‌డుతున్నాడు. ఈ ఇబ్బందిని కృష్ణంరాజు కూడా అర్థం చేసుకొంటే మంచిద‌ని రెబ‌ల్ స్టార్ అభిమానుల అభిప్రాయం. మ‌రి ఆయ‌న మ‌న‌సులో ఏముందో?