English | Telugu

అట్ట‌ర్ ఫ్లాప్ తో దెబ్బ‌కి దిగొచ్చేశాడు!

ఒక్క ఫ్లాప్ చాలు.. ఎవ్వ‌రికైనా దిమ్మ‌తిరిగి బొమ్మ క‌నిపించ‌డానికి. ఫ్లాప్ వ‌స్తే.. మ‌నిషి చాలా మారిపోతాడు. ఎంత‌లా అంటే... ప్ర‌స్తుతానికి కోన వెంక‌ట్‌లా అని చెప్పొచ్చు. తెలుగునాట భారీ రెమ్యున‌రేష‌న్ తీసుకొనే ర‌చ‌యిత‌గా కోన‌కు మంచి పేరుంది. ఆయ‌న స్ర్కీన్ ప్లే కోసం రంగంలోకి దిగితే చాలు.. క‌థ‌కు కొత్త జోష్ వ‌స్తుంద‌ని న‌మ్ముతారంతా. అందుకే కోన ఆడిందే ఆట‌గా సాగింది. శ్రీ‌నువైట్ల క్యాంప్‌లో ఉన్న‌ప్పుడు కోన‌కు తిరుగులేదు. ఆగ‌డు త‌ర‌వాత సొంత కుంప‌టి పెట్టినా.. కోన యాత్ర దిగ్విజ‌యంగా సాగింది.

బ్రూస్లీ కోసం కోన‌, శ్రీ‌నువైట్ల మ‌ళ్లీ క‌ల‌సి ప‌నిచేశారు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్యా మ‌ళ్లీ విబేధాలు రాజుకొన్నాయి. నేను రాసిచ్చిన 72 స‌న్నివేశాలూ రాసుకొంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేద‌ని శ్రీ‌నువైట్ల‌ను వేలెత్తి చూపించి వెట‌కారం చేశాడు కోన‌. ఈ కామెంట్ చిత్ర‌సీమ‌లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కోన బ‌హిరంగంగానే త‌న గురించి మాట్లాడ‌డం శ్రీ‌నువైట్ల‌కూ కోపం తెప్పించింది. అయితే ఇదంతా శంకరాభ‌ర‌ణం సినిమాకి ముందు. ఆ సినిమా వ‌చ్చి అట్ట‌ర్ ఫ్లాప్ లిస్టులో చేరిపోయింది. ఈ ఒక్క సినిమాతో కోన ప‌ది అడుగులు వెన‌క్కి వేసిన‌ట్టైంది. అటు ర‌చ‌యిత‌గానూ త‌న పెన్ను ప‌వ‌ర్‌, డిమాండ్ రెండూ త‌గ్గాయ‌ని తెలుసుకొన్నాడు. అందుకే వెంట‌నే ఆత్మ‌ర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాడు.

శ్రీ‌నువైట్ల‌తో త‌న‌కేం విబేధాలు లేవ‌ని, త‌న‌తో క‌ల‌సి ప‌నిచేయ‌డానికి తానెప్పుడూ సిద్ధంగానే ఉన్నాన‌ని ఇప్పుడో స్టేట్ మెంట్ ప‌డేశాడు. త‌న‌కీ, శ్రీ‌నుకీ మ‌ధ్య వివాదం డైలీ సీరియ‌ల్‌లా సాగుతుంద‌ని, దానికి తెర దించాల‌ని చూస్తున్నాన‌ని కోన చెప్పుకొచ్చాడు. అంటే.. కోన హ్యాండ్స‌ప్ అయిపోయాడ‌న్న‌మాట‌. తాను ఎప్ప‌టికైనా సొంత గూటికి చేరాల్సిందే అనుకొంటున్నాడ‌న్న‌మాట‌. బ్రూస్లీ, అఖిల్‌, శంక‌రాభ‌ర‌ణం.. ఇలా వ‌రుస ఫ్లాపుల‌తో కోన అంటే న‌మ్మ‌కాలు పోతున్నాయి. ఇప్పుడు దాన్ని కాపాడుకోవాలి.. తాను ఎవ్వ‌రికీ శ‌త్రువు కాద‌ని చెప్పుకోవాలి.. ఇదీ కోన ప్లాను. అందుకే ఇలా మ‌ళ్లీ శ్రీ‌నువైట్ల గూటికి చేర‌డానికి ఆశ ప‌డుతున్నాడ‌ని ఇండ్ర‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ మాటైనా నికార్సేనా?? మ‌ళ్లీ మారే ఉద్దేశం ఉందా???