English | Telugu

బాబాయ్ - అబ్బాయ్‌.. యుద్ధం ఆపేదెవ‌రు?

ఈ సంక్రాంతికి బాక్సాఫీసు ద‌గ్గ‌ర‌ బాబాయ్ - అబ్బాయ్‌ల ర‌గ‌డ చూసే ఛాన్స్ ద‌క్కింది. అటు నాన్న‌కు ప్రేమ‌తో, ఇటు డిక్టేట‌ర్ రెండూ సంక్రాంతి బ‌రిలో నిల‌వ‌డానికి సిద్ధ‌మ‌య్యాయి. ఈ రెండు సినిమాలూ దాదాపు వారం వ్య‌వ‌ధిలో ప్రేక్ష‌కుల ముందుకురానున్నాయి. బాలకృష్ణ‌, ఎన్టీఆర్ ల సినిమాలు వారం వ్య‌వ‌ధిలో చూడ్డం నంద‌మూరి అభిమానుల‌కు పండ‌గే అయినా... మార్కెట్ ప‌రంగా ఈ పోటీ అంత మంచిది కాద‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

ఇందుకు బాహుబ‌లి, శ్రీ‌మంతుడు సినిమాల్ని సినీ విశ్లేష‌కులు ఉదాహ‌ర‌ణ‌లుగా చూపిస్తున్నారు. ఈ రెండు సినిమాలూ వారం వ్య‌వ‌ధిలోనే విడుద‌ల కావాల్సింది.కానీ ఇరు నిర్మాత‌లూ మాట్లాడుకొని ఓ అంగీకారానికి వ‌చ్చారు. దాంతో బాహుబ‌లికీ, శ్రీ‌మంతుడుకీ బాగా విరామం వ‌చ్చింది. ఈ విరామం రెండు సినిమాల‌కూ లాభం క‌లిగిచింది. అటు బాహుబ‌లి, ఇటు శ్రీ‌మంతుడు రెండూ భారీ వ‌సూళ్లు సాధించాయి. టాలీవుడ్‌లో నెంబ‌ర్ వ‌న్‌, టూలుగా నిలిచాయి.

ఇప్పుడు అదే ఫార్ములా ఈ రెండు సినిమాలూ పాటిస్తే.. రెండు సినిమాల‌కూ మంచిద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. క‌నీసం రెండు వారాల గ్యాప్ తీసుకొంటే బెట‌ర్ అని స‌ల‌హా ఇస్తున్నాయి. కానీ.. బాల‌య్య‌, ఎన్టీఆర్‌లు అందుకు సిద్ధంగా లేరు. వెన‌క్కి త‌గ్గేది లేద‌ని ఇద్ద‌రూ మొండి ప‌ట్టుద‌ల ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని వినికిడి. మ‌రి బాబాయ్‌, అబ్బాయ్‌ల మ‌ధ్య స‌యోధ్య కుదిర్చేదెవ‌రో, ఈ యుద్దాన్ని ఆపేదెవ‌రో.. ఒక వేళ యుద్ధం జ‌రిగితే గెలిచేదెవ‌రో కాల‌మే చెప్పాలి.