English | Telugu
పదిహేనేళ్ల వయసులోనే సుమలత అందాల పోటీల్లో గెలిచారని మీకు తెలుసా?
Updated : Sep 25, 2021
సుమలతను చూడగానే మన పక్కింటమ్మాయి అన్నట్లుగా ఉంటారు. ఆమెది నాచురల్ బ్యూటీ. అందం శరణం గచ్ఛామి అనే పాట ఆమె కోసమే పుట్టింది మరి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నాయికగా నటించిన ఘనత ఆమె సొంతం. సుమలత అమ్మానాన్నలు ఇద్దరిదీ గుంటూరు. తండ్రి చెన్నైలో పనిచేస్తూ అక్కడ ఉన్నప్పుడు సుమలత అక్కడే పుట్టారు. ఆమెకు రెండు మూడేళ్ల వయసులో ఆయనకు బొంబాయి ట్రాన్స్‌ఫర్ అవడంతో, అక్కడ కొన్నేళ్లు ఉన్నారు. హఠాత్తుగా తండ్రి మృతి చెందడంతో తల్లి ఆమెను గుంటూరుకు తీసుకొచ్చేశారు. అక్కడ సెయింట్ జోసెఫ్ కాన్వెంట్‌లో చదువుకున్నారు. చిన్నతనం నుంచీ ఆమె గాళ్స్ స్కూల్స్‌లోనూ చదువుకుంటూ వచ్చారు.
టెన్త్ క్లాస్ అయ్యాక బ్యూటీ కాంటెస్ట్ జరుగుతోందని, మన స్కూల్ నుంచి ఈ అమ్మాయిని పంపిస్తే బాగుంటుందని కొంతమంది ఫ్రెండ్స్ బలవంతపెట్టి, వాళ్లమ్మను కన్విన్స్ చేసి, ఒప్పించి, సుమలతను ఆ పోటీలకు పంపించారు. నిజానికి సుమలతకు అలాంటి వాటిమీద అసలేమాత్రమూ ఆసక్తి లేదు. అయిష్టంగానే ఆ పోటీలో పార్టిసిపేట్ చేశారు. అది స్టేట్ లెవల్ థమ్సప్ బ్యూటీ కాంటెస్ట్. ఆ కాంటెస్ట్ కోసం లైఫ్‌లోనే ఫస్ట్ టైమ్ చీర కట్టుకున్నారు సుమలత. నిజం చెప్పాలంటే ఆమె కట్టుకోలేదు. వాళ్లమ్మే ఆమెకు చీర కట్టారు. అదివరకెన్నడూ ఆమె చీర కట్టుకోలేదు. జడ్జిలు స్టేజ్ మీద అటూ ఇటూ ఓసారి నడవమన్నారు. సరేనని నడిచారు.
ఆ తర్వాత తన పనైపోయిందని, ఇక ఇంటికి వెళ్లిపోవచ్చునని, తన సిస్టర్‌తో మాట్లాడుతున్నారు సుమలత. సడన్‌గా నిర్వాహకులు ఎనౌన్స్ చేశారు.. "ది విన్నర్ ఈజ్ సుమలత" అంటూ. సర్‌ప్రైజ్ అయిపోయారామె. ఆ ఈవెంట్‌కు ప్రజానటిగా పేరుపొందిన జమున చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఆమె తన చేతులతో సుమలత తలకు కిరీటం పెట్టి, ఆశీర్వదించారు. ఏవనో తెలుసా.. "నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది, సినిమాల్లోకి రావాలి" అని. అప్పటికి సుమలతకు సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచనే లేదు. జమున ఆశీర్వాద బలమో, ఏమో.. అది జరిగిన కొద్ది రోజులకే ఆమెకు సినిమా ఛాన్స్ లభించింది.
ఆ ఈవెంట్‌ను మేగజైన్స్ కవర్ చేయడం, కొన్ని మేగజైన్స్ కవర్ పేజీపై ఆమె ఫొటోను వేయడం, అది మూవీ మొగల్ డి. రామానాయుడు దృష్టికి వెళ్లడం, ఆయన సినిమా ఆఫర్ చేయడం చకచకా జరిగిపోయాయి. చెన్నైకి వెళ్లి మొట్టమొదట డి. రామానాయుడు సినిమాకు సంతకం చేశారు సుమలత. అప్పుడాయన అడ్వాన్స్‌గా ఆమెకు వెయ్యి రూపాయలిచ్చారు. అయితే ఆమెతో రెండేళ్ల తర్వాత సినిమా తీశారు రామానాయుడు. ఈలోగా ఆమెకు వేరే సినిమాల అవకాశాలు రావడంతో అవి చేస్తూ వచ్చారు. తొలిసారి ఆమె తెరమీద కనిపించిన సినిమా విజయచందర్ 'కరుణామయుడు'. ఆ సినిమా నుంచే ఆమె వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు.