Read more!

English | Telugu

ఇంగ్లీష్‌లో డైలాగ్స్ చెప్ప‌డానికి భ‌య‌ప‌డ్డ ర‌జ‌నీకాంత్‌!

 

సౌతిండియ‌న్ ఫిల్మ్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ త‌న నాలుగు ద‌శాబ్దాల సినిమా కెరీర్‌లో ఒకే ఒక్క అమెరిక‌న్ ఫిల్మ్‌లో న‌టించారు. ఆ సినిమా 'బ్ల‌డ్‌స్టోన్' (1988). ప‌లు హాలీవుడ్ సినిమాలు నిర్మించిన భార‌తీయుడు అశోక్ అమృత‌రాజ్ నిర్మించిన ఈ మూవీని డ్వైట్ హెచ్‌. లిటిల్ డైరెక్ట్ చేశారు. ఆ కాలంలో ఒక ద‌క్షిణాది న‌టుడు ఒక హాలీవుడ్ ఫిల్మ్‌లో, అందునా సినిమాకు ఆయువుప‌ట్టు లాంటి కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌డం చాలా పెద్ద విశేషంగా చెప్పుకున్నారు. ఈ సినిమా షూటింగ్ మైసూర్‌, బెంగ‌ళూరు, ముదువ‌లై వంటి భార‌తీయ లొకేష‌న్ల‌లో జ‌రిగింది.

'బ్ల‌డ్‌స్టోన్‌'లో శ్యామ్ స‌బు అనే టాక్సీ డ్రైవ‌ర్ క్యారెక్ట‌ర్ పోషించారు ర‌జ‌నీ. బ‌య‌టి ప్ర‌పంచానికి అత‌ను ఒక టాక్సీ డ్రైవ‌రే కానీ, అత‌నికంటూ ఒక బల‌గం ఉంటుంది. క‌థానుసారం అమూల్య‌మైన 'బ్ల‌డ్‌స్టోన్' అనే వ‌జ్రం విదేశం నుంచి మ‌న‌దేశానికి త‌ర‌లించ‌బ‌డుతుంది. అది ర‌జ‌నీ టాక్సీలోకి, త‌ద్వారా అత‌ని చేతికి వ‌స్తుంది. ఈ వ‌జ్రం హీరోయిన్ ద‌గ్గ‌ర ఉంద‌ని విల‌న్ ముఠా భ్ర‌మ‌ప‌డి ఆమెను కిడ్నాప్ చేస్తుంది. ఆమె కోసం హీరో శాండీ మెక్‌వే (బ్రెట్ స్టిమ్‌లీ) ఇండియాకు వ‌స్తాడు. ర‌జ‌నీ, అత‌ను స్నేహితుల‌వుతారు. బ్ల‌డ్‌స్టోన్‌ను కాపాడుకోవ‌డం కోసం ఆ ఇద్ద‌రూ ఏం చేశార‌నేది మిగ‌తా క‌థ‌.

ఇప్పుడేమో కానీ, ఆ రోజుల్లో హాలీవుడ్ సినిమాల్లో న‌టించే న‌టులు డ‌బ్బింగ్‌కంటూ విడిగా డేట్స్ ఇవ్వ‌డం అనేది ఉండేది కాదు. షూటింగ్ టైమ్‌లోనే డైలాగ్స్‌ను రికార్డ్ చేసేవాళ్లు. ర‌జ‌నీ సైతం త‌న సొంతు గొంతుతోనే డైలాగ్స్ చెప్పారు. మేక‌ర్స్ "మీ డైలాగ్స్ మీరే చెప్పాలి." అన్న‌ప్పుడు ఆయ‌న భ‌య‌ప‌డ్డారు. ఎందుకంటే ఇంగ్లీష్‌ను ఆయ‌న గ్రామ‌ర్‌కు త‌గ్గ‌ట్లు మాట్లాడ‌లేరు. బెంగ‌ళూరులో కండ‌క్ట‌ర్‌గా బెల్ కొట్టుకొంటూ వ‌చ్చిన ఆయ‌నకు ఇంగ్లీష్ సినిమాలో మాట్లాడేంత‌గా ఆ భాష‌లో ప్రావీణ్యం లేదు. కానీ ప్రొడ్యూస‌ర్స్ ర‌జనీకి ఒక ట్యూట‌ర్‌ను పెట్టి, ధైర్యం చెప్పి చివ‌ర‌కు ఆయ‌న సంభాష‌ణ‌లు ఆయ‌నే మాట్లాడేట్లు చేశారు. ఆ త‌ర్వాతే ఆయ‌న ఇంగ్లీష్‌ను కాస్త బాగా మాట్లాడుతూ వ‌చ్చారు.

విశేష‌మేమంటే ర‌జ‌నీ చెప్పిన‌ డైలాగ్స్‌, ఆయ‌న ప‌ర్ఫార్మెన్స్ హీరో బ్రెట్ స్టిమ్‌లీ, స్టోరీ రైట‌ర్ నికో మాస్టోరాకిస్‌ల‌ను బాగా మెప్పించింది. ఆ ఇద్ద‌రూ ఆయ‌న‌ను తెగ మెచ్చుకున్నారు. దాంతో ర‌జ‌నీ చాలా ఆనంద‌ప‌డ్డారు. 'బ్ల‌డ్‌స్టోన్‌'ను ఒమెగా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా 1988 అక్టోబ‌ర్ 7న రిలీజ్ చేసింది. అయితే వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఈ సినిమా ఆశించిన రీతిలో ఆడ‌క‌పోయినా త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈ సినిమాని జ‌నం బాగానే చూశారు.