Read more!

English | Telugu

'పెద‌రాయుడు' కోసం మోహ‌న్‌బాబుకు డ‌బ్బిచ్చి ఆదుకున్న ర‌జ‌నీకాంత్‌!

 

శ‌ర‌త్‌కుమార్ హీరోగా న‌టించిన త‌మిళ చిత్రం 'నాట్టామై' బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సూప‌ర్ డూప‌ర్ హిట్‌. కె.ఎస్‌. ర‌వికుమార్ డైరెక్ట్ చేసిన ఆ మూవీని చూసి ఎలాగైనా దాన్ని తెలుగులో రీమేక్ చేయాల‌నుకున్నారు మోహ‌న్‌బాబు. ఓ రోజు బొటానిక‌ల్ గార్డెన్స్‌లో బాషా షూటింగ్‌లో ఉన్న త‌న ప్రాణ స్నేహితుడు ర‌జ‌నీకాంత్‌ను క‌లిశారాయాన‌. "నువ్వు మాట్లాడి, 'నాట్టామై" తెలుగు హ‌క్కులు ఏర్పాటు చెయ్యి" అని చెప్పారు. "నువ్వెంత పెట్టాల‌నుకుంటున్నావ్‌?" అని ర‌జ‌నీ అడిగారు. 15 ల‌క్ష‌లు దాట‌కుండా చూడ‌మ‌ని చెప్పారు మోహ‌న్‌బాబు. ఆ రోజు రాత్రికే మోహ‌న్‌బాబుకు ర‌జ‌నీ నుంచి ఫోన్ వ‌చ్చింది. "12 ల‌క్ష‌ల‌కు ఫిక్స్ చేశానురా" అని చెప్పారు.

అలా 'నాట్టామై' తెలుగు రీమేక్ 'పెద‌రాయుడు' షూటింగ్ మొద‌లైంది. ర‌విరాజా పినిశెట్టికి ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గించారు మోహ‌న్‌బాబు. త‌మిళంలో విజ‌య‌కుమార్ చేసిన క్యారెక్ట‌ర్‌ను తెలుగులో ర‌జ‌నీకాంత్ స్వ‌యంగా చేశారు. రెండో షెడ్యూల్ రాజ‌మండ్రిలో జ‌రుగుతున్న‌ప్పుడు మోహ‌న్‌బాబు ముఖంలో ఆందోళ‌న గ‌మ‌నించిన ర‌జ‌నీ ఏం జ‌రిగింద‌ని అడిగారు. మొద‌ట త‌ట‌ప‌టాయించినా, ర‌జ‌నీ గ‌ట్టిగా నిల‌దీయ‌డంతో రావాల్సిన ఫైనాన్స్ రాలేద‌నీ, ప‌దేప‌దే వాయిదా వేస్తున్నార‌నీ మోహ‌న్‌బాబు చెప్పారు. భుజం త‌ట్టి, కంగారు ప‌డ‌వ‌ద్ద‌న్నారు ర‌జ‌నీ. ఆ మ‌రుస‌టి రోజు ఒక పెద్ద బ్యాగ్ ఇచ్చి, అందులో ఎంత అమౌంట్ ఉందో చెప్పి, "స‌రిపోతుందా?" అన‌డిగారు. మోహ‌న్‌బాబు క‌ళ్లు చెమ‌ర్చాయి. భావోద్వేగంతో ర‌జ‌నీని గ‌ట్టిగా కౌగ‌లించుకున్నారు.

ఇక ఎలాంటి అంత‌రాయం లేకుండా షూటింగ్ పూర్త‌యింది. 'పెదరాయుడు' (1995) విడుద‌లైంది. ఏ సెంట‌ర్ చూసినా క‌లెక్ష‌న్ తుఫాన్‌! అదివ‌ర‌క‌టి బాక్సాఫీస్ రికార్డుల‌ను చెరిపేసి, వ‌సూళ్ల ప‌రంగా ఇండ‌స్ట్రీ రికార్డ్ సృష్టించింది ఆ సినిమా. ఏకంగా 63 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. పాపారాయుడుగా ర‌జ‌నీకాంత్ కొద్దిసేపే క‌నిపించినా, జ‌నం నీరాజ‌నం ప‌ట్టారు. పెద‌రాయుడుగా, అత‌ని తమ్ముడు రాజాగా మోహ‌న్‌బాబు చేసిన డ్యూయ‌ల్ రోల్‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. క‌లెక్ష‌న్ కింగ్‌గా ఆయ‌న‌కు ప‌ట్టం క‌ట్టారు. ర‌జ‌నీకాంత్‌, మోహ‌న్‌బాబు అపూర్వ స్నేహానికి 'పెద‌రాయుడు' సినిమా ఒక ద‌ర్ప‌ణంలా నిలిచింది.