Read more!

English | Telugu

మూడు ద‌శాబ్దాల క్రిత‌మే కార్టూన్ క్యారెక్ట‌ర్స్‌తో ర‌జ‌నీ ఆటా పాటా!

 

ఇప్పుడంటే యానిమేష‌న్ మూవీస్ స‌ర్వ‌సాధార‌ణ‌మ‌య్యాయి. ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండ‌స్ట్రీలో యానిమేష‌న్ విభాగం ఒక ప్ర‌ముఖ స్థానాన్ని ఆక్ర‌మించింది. అయితే మూడు ద‌శాబ్దాల క్రితం ద‌క్షిణాది వెండితెర‌పై లైవ్ క్యారెక్ట‌ర్స్‌తో కార్టూన్ క్యారెక్ట‌ర్స్ క‌నిపించ‌డం అనేది ఒక అద్భుతం! అందుకే ర‌జ‌నీకాంత్ హీరోగా ఎస్‌.పి. ముత్తురామ‌న్ డైరెక్ట్ చేసిన 'రాజా చిన్నరోజా' (1989) విడుద‌లైన‌ప్పుడు ఆడియెన్స్ ఆశ్చ‌ర్యంగా చూశారు. ఏవీఎం ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించిన ఈ సినిమాలో ఓ పాట‌లో ర‌జనీకాంత్‌, హీరోయిన్ గౌత‌మితో కొన్ని కార్టూన్ క్యారెక్ట‌ర్స్ ఆడిపాడ‌తాయి. ఆ సీన్ల‌ను ఎలా చిత్రీక‌రించార‌ని చాలామంది బుర్ర‌లు బ‌ద్ద‌లు కొట్టుకున్నారు. ఆ రోజుల్లో అదొక వినూత్న ప్ర‌యోగం. ఎస్‌.పి. ముత్తురామ‌న్ తెలుగులో 'సంసారం ఒక చ‌ద‌రంగం', 'గురుశిష్యులు' లాంటి చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

పిల్ల‌ల‌కు వినోదాన్ని క‌లిగించే ప్ర‌ధాన ఉద్దేశంతో 'రాజా చిన్న‌రోజా' మూవీని తీశారు. ఆ సినిమా నిర్మాణానికి స‌న్నాహాలు చేస్తున్న‌ప్పుడు ముత్తురామ‌న్‌తో నిర్మాత శ‌ర‌వ‌ణ‌న్‌ పిల్ల‌ల‌ను ఎక్కువ‌గా ఎంట‌ర్‌టైన్ చేసే కార్టూన్ బొమ్మ‌లు, హీరో హీరోయిన్ల‌తో పాల్గొన్న‌ట్లుగా ఓ పాట తీస్తే ఎలా ఉంటుందో చూడ‌మ‌న్నారు. బొంబాయిలో కార్టూన్ క్యారెక్ట‌ర్ల‌ రూప‌క‌ల్ప‌న‌లో మంచి పేరున్న రామ్మోహ‌న్‌ను సంప్ర‌దించారు ముత్తురామ‌న్‌. ఆయ‌న ఇచ్చిన స‌ల‌హామేర‌కు మొద‌ట‌, హీరో హీరోయిన్లు, కార్టూన్ బొమ్మ‌లు క‌లుసుకునేలా సీన్లు ప్లాన్ చేసి, పాట రికార్డ్ చేయ‌మ‌న్నారు. అంటే ఫ‌లానా చోట రాబిట్ బొమ్మ వ‌స్తుంద‌నీ, మ‌రోచోట ఎలిఫెంట్ కార్టూన్ వ‌స్తుంద‌నీ.. అప్పుడు ఎలాంటి మ్యూజిక్ రావాలో అనుకొని, దానికి అనుగుణంగా పాట రూపొందించాలి. 

సంగీత ద‌ర్శ‌కుడు చంద్ర‌బోస్ (మ‌న గేయ‌ర‌చ‌యిత చంద్ర‌బోస్ కాదు, త‌మిళ పాపుల‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌), కొరియోగ్రాఫ‌ర్ పులియార్ స‌రోజ‌ను పిలిపించి ఎలాంటి సంగీతం ఎక్క‌డ రావాలో, ఎప్పుడెప్పుడు హీరో హీరోయిన్లు డాన్స్ చేయాలో, ఆ మూవ్‌మెంట్స్ అన్నీ చ‌ర్చించారు. ఆ త‌ర్వాత పాట‌ను రికార్డ్ చేశారు. ఉదాహ‌ర‌ణ‌కు పాట‌లో ఒక‌చోట ర‌జనీకాంత్‌కు కుందేలు ఓ పుష్ప‌గుచ్ఛాన్ని స్తే, అది గౌత‌మి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి అక‌స్మాత్తుగా ఒక ప‌క్షిలా మారిపోయి, ఎగిరిపోతుంది. మ‌న‌కు సినిమాలో అలా క‌నిపిస్తుంది. కానీ చిత్రీక‌ర‌ణ విష‌యానికి వ‌చ్చేస‌రికి, ఒక న‌ల్ల‌ని దారానికి వేలాడుతున్న పుష్ప‌గుచ్ఛాన్ని ర‌జ‌నీకాంత్ అందుకొని, దాన్ని గౌత‌మికి ఇచ్చేలా తీశారు. అప్పుడు కుందేలు లేదు, ప‌క్షీ లేదు!

ఇలా లేనిదాన్ని ఉన్న‌ట్లు చూప‌డం చాలా శ్ర‌మ‌తో కూడుకున్న వ్య‌వ‌హారం. దాన్ని యానిమేట‌ర్ రామ్మోహ‌న్ సుసాధ్యం చేశారు. ఓ రాబిట్ కార్టూన్ న‌డుస్తున్న‌ట్లు తీయ‌డానికి 500 బొమ్మ‌లు వేశారు. ఆ విధంగా ఈ పాట‌లో వివిధ జంతువుల కార్టూన్ల చిత్రీక‌ర‌ణ‌కు 31,000 బొమ్మ‌లు వేసి, వాటిని ఒక్కొక్క‌టే ఎక్స్‌పోజ్ చేశారు. అంటే మొత్తం 31 వేల ఎక్స్‌పోజ‌ర్స్ అన్న‌మాట‌!

ర‌జ‌నీకాంత్‌, గౌత‌మి, బాల‌తార‌ల‌తో పాట‌ను చిత్రీక‌రిస్తున్న‌ప్పుడు ఏయే ఘ‌ట్టాల్లో కార్టూన్ బొమ్మ‌లు వ‌స్తాయో చెప్పి, అప్పుడు ఎలాంటి రియాక్ష‌న్స్ ఇస్తే బావుంటుందో వివ‌రించారు. అంటే బొమ్మ‌ల‌ను ఊహించుకుంటూ, యాక్ట‌ర్లు రియాక్ష‌న్ ఇవ్వాలి. ఈ ప్ర‌యోగం యాక్ట‌ర్ల‌కు థ్రిల్లింగ్‌గా తోచింది. అంద‌రూ ఎంతో ఉత్సాహంగా ఆ పాట చిత్రీక‌ర‌ణ‌లో స‌హ‌క‌రించారు. ఈ పాట తీయ‌డానికి వారం రోజుల టైమ్ ప‌డితే, విడిగా తీసిన కార్టూన్ బొమ్మ‌ల‌ను పాత్ర‌ధారుల‌తో క‌లిపే వ్య‌వ‌హారానికి 3 నెల‌ల స‌మ‌యం ప‌ట్టింది! ద‌క్షిణాది వెండితెర‌పై స‌రికొత్త ప్ర‌యోగంగా పేరు తెచ్చుకున్న ఆ పాట‌ను చూడ్డానికి జ‌నం మ‌ళ్లీ మ‌ళ్లీ వ‌చ్చారు!