English | Telugu
మణిరత్నం కల్ట్ ఫిల్మ్ 'నాయకన్'.. రాధికకు నచ్చలేదు! ఎందుకంటే...
Updated : Jul 29, 2021
కమల్ హాసన్‌ను టైటిల్ రోల్‌లో చూపిస్తూ మణిరత్నం రూపొందించిన 'నాయకన్' (తెలుగులో 'నాయకుడు' పేరుతో రిలీజయ్యింది) సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్టవడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు అమితంగా పొందింది. జాతీయ స్థాయిలోనే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలోనూ అనేక చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై, ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. కమల్‌కు బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డు కూడా సాధించి పెట్టింది. కాలక్రమంలో కల్ట్ ఫిల్మ్‌గా, క్లాసిక్‌గా పేరు తెచ్చుకుంది నాయకన్.
అనేకమంది సినీ సెలబ్రిటీలు కూడా నాయకన్‌ను మణిరత్నం తీసిన విధానానికి సలాం చేశారు. తమకు అత్యంత ఇష్టమైన సినిమాల్లో ఒకటిగా ఆ సినిమాను పేర్కొన్నారు. అయితే ఒక పేరుపొందిన తారకు ఆ సినిమా నచ్చలేదంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆ తార మరెవరో కాదు.. 'స్వాతిముత్యం'లో కమల్ జోడీగా నటించిన రాధిక! అవును. 'నాయకన్' రిలీజై, ఆడుతున్న కాలంలోనే ఆ మూవీపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు రాధిక.
"సినిమాల్లో హీరో పరంగా చూపే కొన్ని అంశాలు ప్రేక్షకులపై, ముఖ్యంగా యువకులపై ఎక్కువ ప్రభావాన్ని చూపే ఆస్కారం ఉంది. అందువల్ల సినిమాల్లో నాయకుల పరంగా వీలైనంత మంచినే చూపాలని నా అభిప్రాయం. కానీ ఇప్పుడొస్తున్న సినిమాల్లో నాయకులను చూపిస్తున్న ధోరణి విపరీతంగా ఉంటోంది. ఇటీవల కమల్ హాసన్ నటించిన 'నాయకన్' చిత్రాన్నే ఉదాహరణగా తీసుకుంటే, అందులో నలుగురికి మంచి జరగడానికి తప్పు చేసినా ఫర్వాలేదు అనే పద్ధతిలో స్మగ్లింగ్ వంటి పనులుచేసే హీరోను ధీరోదాత్తుడిగా చూపారు. ఆ విధంగా తప్పుచేయడం నాయక లక్షణం అని ఎక్కువమంది అనుకోవడానికి, తద్వారా ప్రమాదకరమైన పెడత్రోవలు పట్టడానికీ ఆస్కారం ఉందన్నమాటేగా.. సినిమాల వల్ల మంచి జరగకపోయినా ఫర్వాలేదు కానీ ఇలా జనాన్ని పెడత్రోవలు పట్టించే ధోరణులు చూపకూడదని నా దృఢమైన అభిప్రాయం!" అని చెప్పుకొచ్చారు రాధిక.