English | Telugu

బాల‌కృష్ణ 'క‌థానాయ‌కుడు' క‌థ విని "ఇందులో ఏముంది బ్ర‌ద‌ర్‌?" అనేసిన ఎన్టీఆర్‌!

 

బాల‌కృష్ణ, విజ‌య‌శాంతి జంట‌గా న‌టించిన 'క‌థానాయ‌కుడు' (1984) మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘ‌న‌విజ‌యం సాధించి, 175 రోజులు ఆడింది. కె. ముర‌ళీమోహ‌న‌రావు ద‌ర్శ‌క‌త్వంలో డి. రామానాయుడు ఈ సినిమాని నిర్మించారు. ఇందులో జ‌డ్జిగా శార‌ద న‌టిస్తే, ఆమె ఇద్ద‌రు త‌మ్ముళ్లుగా చంద్ర‌మోహ‌న్‌, బాల‌కృష్ణ న‌టించారు. ఆ రోజుల్లో బాల‌కృష్ణ న‌టించే సినిమాల క‌థ‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా ఎన్టీ రామారావు వినేవారు. ఈ సినిమా టైమ్‌కు ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. త‌ను ఎంత తీరిక‌లేని ప‌నుల‌తో ఉన్న‌ప్ప‌టికీ క‌థ‌లు వినేందుకు స‌మ‌యం కేటాయించేవారు.

'క‌థానాయ‌కుడు' క‌థ‌ను ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ చెప్పిన‌ప్పుడు, "ఇందులో ఏముంది బ్ర‌ద‌ర్‌?" అన్నారు ఎన్టీఆర్‌. "రాజ‌కీయాల‌కూ, న్యాయ‌వ్య‌వ‌స్థ‌కూ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ ఉంది అన్న‌గారూ" అని వివ‌ర‌ణ ఇచ్చారు బ్ర‌ద‌ర్స్‌. "కానీ.. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ లేవు క‌దా" అని మ‌ళ్లీ అడిగారు ఎన్టీఆర్‌. "అన్ని మ‌సాలాలు వేసి వంద రోజులు ఆడేవిధంగా స్క్రిప్టును తీర్చిదిద్దుతాం" అన్న‌గారూ అని మాట ఇచ్చారు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌. "ఇట్సాల్ రైట్‌.. అన్న‌మాట నిల‌బెట్టుకొనే మ‌నిషి నాయుడుగారు.. ఆయ‌న మీద న‌మ్మ‌కంతో ఈ క‌థ ఓకే చేస్తున్నాను. ప్రొసీడ్.." అని చెప్పారు రామారావు. 

బాల‌కృష్ణ‌తో రామానాయుడు నిర్మించిన తొలి సినిమా 'క‌థానాయ‌కుడు'. ఇందులో 'కింగ్ కాంగ్' అనే విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ను ప‌రుచూరి గోపాల‌కృష్ణ చేశారు.  ప్రేక్ష‌కులు అమితంగా ఆద‌రించిన‌ ఈ సినిమా ర‌జ‌తోత్స‌వం 1985 జూలై 28న హైద‌రాబాద్‌లోని ప‌ర‌మేశ్వ‌రి, మ‌హేశ్వ‌రి థియేట‌ర్‌లో జ‌రిగింది. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు అధ్య‌క్ష‌త వ‌హించారు. బాలీవుడ్ తార‌లు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, మీనాక్షి శేషాద్రి, ప్రాణ్‌, ఖాద‌ర్ ఖాన్‌, సారిక లాంటివాళ్లు ఈ వేడుక‌లో పాల్గొన‌డం విశేషం.