Read more!

English | Telugu

ఆ పాట రికార్డింగ్ టైమ్‌లో బాలు వ‌ల్ల జాన‌కి ప్రాణం పోయినంత ప‌నైంది!

 

క్లాసిక‌ల్ అయినా, మాస్ అయినా, ఏడుపుగొట్ట‌యినా, హుషారైనా.. అది ఏ త‌ర‌హా పాటైనా స‌రే య‌స్‌. జాన‌కి కంఠం ముందు దాసోహం అనాల్సిందే. ఐదున్న‌ర‌ ద‌శాబ్దాల కెరీర్‌లో 17 భాష‌ల్లో వేలాది సినిమా పాట‌లు పాడి కోట్లాదిమంది సంగీత ప్రియుల‌ను త‌న గానామృతంలో ఓల‌లాడించారు జాన‌కి. అయితే బ్రీతింగ్ ప్రాబ్ల‌మ్‌తోటే ఆమె నాలుగున్న‌ర‌ ద‌శాబ్దాల కాలం పాట‌లు పాడారంటే న‌మ్మాల‌నిపించ‌దు కానీ, అది నిజం.

1962లో ఆమె శ్వాస స‌మ‌స్య మొద‌లైంది. ఆయాసం కామ‌న్‌గా వ‌చ్చేస్తుంది. ఒక్కోసారి ప్రాణం పోయినంత ప‌న‌వుతుంది కూడా. పాట పాడే స‌మ‌యాల్లోనూ ఆమె ఆ త‌ర‌హా స‌మ‌స్య ఎదుర్కొన్నారు. "అలాంట‌ప్పుడు నాకు న‌రాల్లోకి డెకాడ్ర‌న్ ఇంజ‌క్ష‌న్ వేసేవారు. ఆ కాలంలోనే.. 'పూజాఫ‌లం'లో "శివ‌దీక్షా ప‌రురాల‌నురా" అనే పాటుంది. ఎల్‌. విజ‌య‌ల‌క్ష్మి డాన్స్ చేస్తుంది. ఈ పాట పాడేప్పుడు నాకు ఆయాసం. మీరు న‌మ్మ‌రు.. గుండె బిగిసిపోయిన‌ట్ల‌యింది. బ‌య‌ట‌కు ఎవ‌రికీ తెలీదు. ఎంత బిగించుకొని పాడానో ఆ పాట‌ను. కానీ ఆ పాట వింటే నాకు ఆయాసం ఉంద‌ని మీర‌నుకోరు." అని ఆమె చెప్పారు.

ఇక 'శంక‌రాభ‌ర‌ణం'లో "సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న" పాట పాడేప్పుడు మ‌రింత బాధ‌ప‌డ్డారు జాన‌కి. "ఆ పాట రికార్డింగ్ రోజు నాకు కొంచెం క‌డుపునొప్పిగా ఉండింది. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఏం చేశాడూ.. బెరాల్గ‌న్ టాబ్లెట్‌ ఇచ్చాడు. 'ఇది వేసుకోండి, క‌డుపునొప్పి పోతుంది' అన్నాడు. అంత‌కుముందే మా ఆయ‌న ఇప్పుడే వ‌స్తాన‌ని బ‌య‌ట‌కు వెళ్లాడు. నాకు కొన్ని మందులు ఎల‌ర్జీ. ప‌డ‌వు. ఆ విష‌యం అంటే, 'ఎల‌ర్జీ లేదు, ఏం లేదు, వేసుకోండి' అని ఒక‌టే గొడ‌వ చేశాడు. స‌రే చూద్దామ‌ని ఆ మాత్ర మింగేశా. అంతే! ఐదు నిమిషాల్లో గుండె అణిచేసిన‌ట్ల‌యింది. ఊపిరాడ‌లేదు. క‌ళ్లు ఇంత లావున‌ ఉబ్బిపోయాయ్‌. అట్లాగే బిగించుకొని పాడాను. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం భ‌య‌ప‌డిపోయాడు. ఇంజ‌క్ష‌న్ వేస్తే.. ఓ ప‌దిహేను, ఇర‌వై నిమిషాల్లో ఊపిరొస్తుంది. కానీ క‌ళ్ల ఉబ్బులు మాత్రం నాలుగైదు రోజులు అట్లాగే ఉంటాయ్‌. అట్లా ఎన్ని పాట‌లు పాడానో." అని చెప్పుకొచ్చారు జాన‌కి.

1957లో 'విధియిన్ విలయాట్టు' అనే తమిళ సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించిన ఆ మ‌హాగాయ‌ని 2016 సెప్టెంబ‌ర్‌లో తాను పాడటం ఆపేస్తున్నట్లు ప్రకటించారు. దానికంటే ముందు దక్షిణ భారత కళాకారులకు జాతీయ స్థాయిలో సరియైన గుర్తింపు ఇవ్వ‌డం లేద‌ని 2013లో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ పురస్కారాన్ని తిరస్కరించడం ఆమెకే చెల్లింది.