English | Telugu

250 సినిమాల్లో విలన్‌గా భయపెట్టిన రామిరెడ్డి జీవితం చివరికి అలా ముగిసింది!

‘అనుకున్నామని.. జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని.. జరిగేవన్నీ మంచికని.. అనుకోవడమే మనిషి పని..’ అని ఆత్రేయ చెప్పిన జీవిత సత్యాలు కొందరి విషయంలో అక్షరాలా జరుగుతాయి. అలాంటి వారిలో నటుడు రామిరెడ్డిని ఉదాహరణగా తీసుకోవచ్చు. అతని జీవన విధానం వేరు, జీవితంలో అతని లక్ష్యం వేరు. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన రామిరెడ్డికి సామాజిక స్పృహ ఎక్కువ. సమాజానికి ఏదైనా మంచి చెయ్యాలన్న లక్ష్యంతో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో డిగ్రీ తీసుకున్నాడు. ఆ తర్వాత ‘ది మున్సిఫ్‌ డైలీ’ అనే పత్రికలో విలేకరిగా చేరాడు. ప్రైమరీ స్కూల్‌ నుంచి డిగ్రీ అందుకునే వరకు అతని విద్య అంతా హైదరాబాద్‌లోనే సాగింది. దాంతో అతను ఏ ప్రాంతం నుంచి వచ్చాడో ఆ స్లాంగ్‌ మర్చిపోయాడు. పూర్తిగా తెలంగాణా స్లాంగ్‌లోనే మాట్లాడేవాడు. అంతేకాదు, హిందీ, ఉర్దూ ధారాళంగా మాట్లాడేవాడు. జనరల్‌ న్యూస్‌ కవర్‌ చేస్తూనే ఫ్రీలాన్స్‌గా సినిమా ఈవెంట్స్‌ను కూడా కవర్‌ చేసేవాడు. అందులో భాగంగా కొందరు సినీ ప్రముఖుల్ని కూడా ఇంటర్వ్యూ చేశాడు. ఆ క్రమంలోనే ఓరోజు దర్శకుడు కోడి రామకృష్ణకు ఫోన్‌ చేసి ఇంటర్వ్యూ కావాలని అడిగాడు. ఆయన ఒక టైమ్‌ చెప్పి రమ్మన్నారు. 

డా. రాజశేఖర్‌, కోడి రామకృష్ణ కాంబినేషన్‌లో శ్యాంప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్న ‘అంకుశం’ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఆ సినిమాలో ఒక పవర్‌ఫుల్‌ విలన్‌గా నటించే ఆర్టిస్ట్‌ కోసం చూస్తోంది చిత్ర యూనిట్‌. ఆ టైమ్‌లోనే ఇంటర్వ్యూ కోసం రామిరెడ్డి వెళ్లాడు. లాల్చీ పైజామాతో, నుదుటిన బొట్టుతో అక్కడికి వెళ్ళిన రామిరెడ్డిని చూసి కోడి రామకృష్ణ షాక్‌ అయ్యారు. తను ఎలాంటి విలన్‌ కోసమైతే ఎదురుచూస్తున్నారో సరిగ్గా అలాంటి క్వాలిటీస్‌ రామిరెడ్డిలో ఆయనకు కనిపించాయి. అప్పుడు ఇంటర్వ్యూ విషయం పక్కనపెట్టి ఈ సినిమాలో మెయిన్‌ విలన్‌ వేషం ఉంది చేస్తావా? మంచి పేరు వస్తుంది అని అడిగారు కోడి రామకృష్ణ. ‘నాకు యాక్టింగ్‌ తెలీదు సార్‌’ అని రామిరెడ్డి చెప్పినా.. ‘అదంతా నేను చూసుకుంటాను. చేస్తావా’ అని అడిగారు. డైరెక్టర్‌ ఇచ్చిన భరోసాతో రామిరెడ్డి ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. 

ఆ క్షణం రామిరెడ్డి తీసుకున్న నిర్ణయం అతని జీవితాన్ని మార్చేసింది. మొదటి సినిమా అయినా ఒక క్రూరమైన విలన్‌ నీలకంఠంగా రామిరెడ్డి ప్రదర్శించిన నటన అందర్నీ భయపెట్టింది. విలన్‌ అంటే ఇలాగే ఉండాలి అనేంతగా ఆకట్టుకున్నాడు రామిరెడ్డి. ‘అంకుశం’ చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. డా.రాజశేఖర్‌, రామిరెడ్డి పోటాపోటీగా నటించి సినిమాను ఓ రేంజ్‌కి తీసుకెళ్లారు. 1990లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం. ఈ సినిమా తర్వాత  ఒసేయ్‌ రాములమ్మా, పెద్దరికం, అమ్మోరు, గాయం, అనగనగా ఒక రోజు, అడవిచుక్క, నాగప్రతిష్ట, తెలుగోడు, జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా, వీడు మనవాడే, నాయకుడు వంటి సినిమాల్లో రామిరెడ్డి చేసిన క్యారెక్టర్స్‌కి చాలా మంచి వచ్చింది. 

‘అంకుశం’ చిత్రాన్ని హిందీలో చిరంజీవి హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ‘ప్రతిబంధ్‌’ పేరుతో రీమేక్‌ చేశారు. అందులో రామిరెడ్డి స్పాట్‌నానాగా తన విశ్వరూపాన్ని చూపించాడు. దాంతో బాలీవుడ్‌ ప్రేక్షకులు కూడా రామిరెడ్డి నటన చూసి ఆశ్చర్యపోయారు. స్పాట్‌నానాగా బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు రామిరెడ్డి. ‘ప్రతిబంధ్‌’ తర్వాత బాలీవుడ్‌లో విపరీతమైన ఆఫర్స్‌ వచ్చాయి. ఒక దశలో రెండు సంవత్సరాలు తెలుగు నిర్మాతలకు రామిరెడ్డి అందుబాటులో లేరు. బాలీవుడ్‌లో గ్రేట్‌ విలన్స్‌గా చెప్పబడే అమ్రిష్‌ పూరి, అమ్జాద్‌ ఖాన్‌, డానీ,   గుల్షన్‌ గ్రోవర్‌, ప్రేమ్‌ చోప్రా సరసన రామిరెడ్డి పేరును కూడా చేర్చారంటే అక్కడ అతనికి ఎంత ఫాలోయింగ్‌ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. గుండా, ఖుద్దార్‌, శపథ్‌, వక్త్‌ హుమారా హై, ఆందోళన్‌, దిల్‌వాలే, అంగ్‌రక్షక్‌, ఎలాన్‌ వంటి చిత్రాలలో అతని నటనకు హిందీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అక్షయ్‌ కుమార్‌, సునీల్‌ శెట్టి వంటి హీరోలు తమ సినిమాలో విలన్‌గా రామిరెడ్డి కావాలని అడిగేవారంటే అతనికి అక్కడ ఎంత క్రేజ్‌ వచ్చిందో తెలుస్తుంది. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ, హిందీ, భోజ్‌ఫురి భాషల్లో దాదాపు 250 సినిమాల్లో నటించారు రామిరెడ్డి. 

తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచిందని.. తనకు ఏమాత్రం అనుభవం లేని ఫీల్డ్‌లోకి ఎంటర్‌ అయి బెస్ట్‌ విలన్‌గా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రామిరెడ్డి హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. మొదట లివర్‌ సమస్యగా మొదలై ఆ తర్వాత కిడ్నీ ఫంక్షనింగ్‌పై కూడా ప్రభావం చూపించింది. చివరలో అది క్యాన్సర్‌గా మారి రామిరెడ్డి మరణానికి కారణమైంది. 2011 ఏప్రిల్‌ 14న 52 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు రామిరెడ్డి.