Read more!

English | Telugu

సినిమాల్లో మాదిరిగానే ఉపేంద్ర‌-ప్రియాంక ల‌వ్ స్టోరీ కూడా వెరైటీయే!

 

వెరైటీ సినిమాలు, వెరైటీ క్యారెక్ట‌ర్స్‌తో అటు క‌న్న‌డ‌, ఇటు తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ వ‌స్తున్న న‌టుడు ఉపేంద్ర అలియాస్ ఉప్పి దాదా. క‌న్న‌డంలో సూప‌ర్ స్టార్ ఇమేజ్ ఉన్న ఉపేంద్ర తెలుగులోనూ కొన్ని సినిమాల్లో హీరోగా న‌టించి మ‌న‌వాళ్ల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. ఓం, ఎ, క‌న్యాదానం, ఉపేంద్ర‌, రా.. సినిమాలు అత‌డికి బాగా పేరు తెచ్చాయి. ఆమ‌ధ్య అల్లు అర్జున్ సినిమా 'స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి'లో ఓ కీల‌క పాత్ర చేశాడు. అత‌ను న‌టి ప్రియాంక‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇద్ద‌రూ క‌లిసి 'రా', 'H2O', 'శ్రీ‌మ‌తి' సినిమాలు క‌లిసి చేశారు. 

2001లో 'రా' సినిమా చేసేప్పుడు తొలిసారి ఉపేంద్ర‌, ప్రియాంక క‌లుసుకున్నారు. అప్ప‌టికే ప్రియాంక బెంగాలీ, హిందీ సినిమాల్లో అప్‌క‌మింగ్ యాక్ట్రెస్‌. కోల్‌క‌తాలో అందాల పోటీ విజేత‌. త‌న‌కు కాబోయే భ‌ర్త ఒక సూప‌ర్‌స్టార్ అని అప్ప‌టికి ఆమెకు తెలీదు. ఆమె తండ్రి ఒక ఇంజ‌నీర్‌. కొంత‌కాలం ఆమె కుటుంబం అమెరికాలోనూ, త‌ర్వాత సింగ‌పూర్‌లోనూ పెరిగింది. అందువ‌ల్ల ఆమెకు ద‌క్షిణ భార‌త సినిమాల గురించి ఏమీ తెలీదు.

బ‌సు చ‌ట‌ర్జీ డైరెక్ట్ చేసిన బెంగాలీ చిత్రం 'హ‌త బ్రిష్టి '(1999) ద్వారా ఆమె సినిమాల్లో అడుగుపెట్టింది. త‌మిళ‌, తెలుగు సినిమాల్లో న‌టించ‌డానికి ముందు కొన్ని బెంగాలీ సినిమాలు, ఓ రెండు హిందీ సినిమాలు చేసిందామె. ఆ త‌ర్వాత ఆమె తెలుగు మూవీ 'రా' సెట్స్ మీద ఉపేంద్ర‌ను క‌లుసుకుంది. తెర‌పై య‌మ ఎన‌ర్జిటిగ్గా క‌నిపించే ఉపేంద్ర నిజ జీవితంలో ఇంట్రావ‌ర్ట్‌. ప్రియాంక అందుకు భిన్నం. ప‌రిచ‌య పెరిగినా, ఇద్ద‌రూ డేటింగ్‌కు వెళ్లిన సంద‌ర్భం లేదంటే ఆశ్చ‌ర్య‌మేస్తుంది కానీ.. అది నిజం.

"డిన్న‌ర్ డేట్స్ కానీ, లాంగ్ డ్రైవ్స్ కానీ, చేయీ చేయీ క‌లిపి తిర‌గ‌డం కానీ ఏమీ చేయ‌లేదు మేం. అలాంటివి జ‌ర‌గ‌లేదు. అత‌ను ముంబైలో ఉన్న‌ప్పుడు మా ఇంటికి వ‌చ్చేవాడు. గంట‌ల కొద్దీ మా అమ్మానాన్న‌ల‌తో మాట్లాడేవాడు. అయితే అత‌ను ఆస్ట్రేలియాలో ఉన్న‌ప్పుడు కూడా రోజూ ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్లం. దాంతో ఫోన్ బిల్లు త‌డిసి మోపెడ‌య్యేది. అది గ‌మ‌నించిన మా అమ్మ‌, ఫోన్‌లో మాట్లాడుకునే బ‌దులు, ఒకే సిటీలో ఉంటున్న‌ప్పుడు క‌లిసి మాట్లాడుకోవ‌డం మంచిద‌ని సూచించింది." అని చెప్పింది ప్రియాంక‌.

అలా 2003లో 'H2O' సినిమా చేస్తున్న‌ప్పుడు పెద్ద‌ల అంగీకారంతో ఇద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. ఆ త‌ర్వాత సంవ‌త్స‌ర‌మే కొడుకు ఆయుష్‌, 2005లో కూతురు ఐశ్వ‌ర్య పుట్టారు. అమెరికా, సింగ‌పూర్‌లో పెరిగిన ప్రియాంక‌ చాలా త్వ‌ర‌గానే క‌న్న‌డ సంప్ర‌దాయాల‌ను వంట‌బ‌ట్టించుకొని, అత్తామామ‌ల‌కు ఇష్టురాలైన కోడ‌లిగా మారింది. కొత్త‌లో క‌న్న‌డంతో అడ్జ‌స్ట్ అవ‌డానికి ఇబ్బంది ప‌డినా, ఆ త‌ర్వాత దాన్ని చ‌క్క‌గా మాట్లాడ్డం అల‌వ‌డింది. ఇప్పుడామెకు బెంగ‌ళూరే లోకం. 

ఒక సూప‌ర్‌స్టార్‌కు భార్య కావ‌డం ఎంత ఆనంద‌క‌ర విష‌య‌మో, అత‌నికి సంబంధించిన విష‌యాల‌ను డీల్ చేయ‌డం అంత క్లిష్ట‌మైన వ్య‌వ‌హారం. ఉపేంద్ర‌ను క‌లుసుకోవ‌డానికి ఎప్పుడూ అభిమానులు వ‌స్తూ ఉంటారు. వాళ్ల‌తో టైమ్ గ‌డ‌ప‌డం ఉపేంద్ర‌కు త‌ప్ప‌నిస‌రి వ్య‌వ‌హారం. దాన్ని కూడా త‌న జీవితంలో ఒక భాగంగా చేసుకుంది ప్రియాంక‌. "అనేక‌మంది ప్రేమ‌ను పొంద‌డం చిన్న విష‌యం కాదు. అది చూసి నాకు ఆనంద వేస్తుంటుంది. అయితే బ‌ర్త్‌డేకి ఉప్పికి విషెస్ చెప్ప‌డానిక్కూడా నాకు క‌ష్ట‌మైపోతుంటుంది. ఫ్యాన్స్‌తో అత‌ని బ‌ర్త్‌డేని సెల‌బ్రేట్ చేస్తుంటాం. ప్ర‌తి ఐదు నిమిషాల‌కొక‌రు మా నోట్లో కేక్ పెట్టి, ఫొటోలు దిగుతుంటారు." అని చెబుతుందామె.

పెళ్లి త‌ర్వాత కూడా ఆమె న‌టించ‌డానికి ఎలాంటి అభ్యంత‌రం తెలుప‌లేదు ఉపేంద్ర‌. ఆ త‌ర్వాత కూడా ఆమె క‌న్న‌డ‌, త‌మిళ‌, బెంగాలీ, హిందీ సినిమాల్లో న‌టిస్తూ వ‌స్తోంది. ప్ర‌స్తుతం ఆమె చేతిలో నాలుగు క‌న్న‌డ సినిమాలు, ఒక హిందీ సినిమా ఉంది.