English | Telugu
75 సంవత్సరాలుగా ఆ పేరు పెట్టే ధైర్యం ఏ తల్లిదండ్రులూ చెయ్యలేకపోయారు!
Updated : Oct 8, 2024
సినిమా రంగంలో నటుడుగా, నటిగా పేరు తెచ్చుకోవడం, తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకొని రాణించడం అనేది మామూలు విషయం కాదు. తను తప్ప ఆ క్యారెక్టర్ మరొకరు చెయ్యలేరు అనేంతగా ప్రేక్షకుల మనసుల్లో ముద్ర పడిపోవాలంటే వారు ఎంతో ప్రతిభగల వారై ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో అలాంటి నటీనటులు ఎంతో మంది ఉన్నారు. కొన్ని రకాల పాత్రల్లో వారిని తప్ప మరొకరిని ఊహించుకోలేం. అలా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుక్ను నటి సూర్యకాంతం. ఆ పేరులో ఓ విశిష్టత ఉంది. ఆమె మొట్ట మొదట గయ్యాళి అత్తగా నటించిన సినిమా ‘సంసారం’. ఈ సినిమా తర్వాత అన్ని సినిమాల్లోనూ గయ్యాళి అత్తగానే నటించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు సూర్యకాంతం అనే పేరు కలిగిన ఏకైక వ్యక్తి ఆమే. ఆ సినిమాకి ముందు రాష్ట్రంలో ఎంతో మంది సూర్యకాంతం పేరు కలిగి ఉండవచ్చు. కానీ, అప్పటి నుంచి అంటే దాదాపు 75 సంవత్సరాలుగా ఆ పేరు తమ పిల్లలకు పెట్టే ధైర్యం ఏ తల్లిదండ్రులూ చెయ్యలేకపోయారు.
సినిమాల్లో గయ్యాళి అత్తగా తన నటనతో ప్రేక్షకులకు ఆగ్రహాన్ని కలిగించేవారు సూర్యకాంతం. ఎందుకంటే ప్రతి సినిమాలోనూ కోడల్ని రాచి రంపాన పెట్టడం, ఇతరులను బాధపెట్టడం వంటి క్యారెక్టర్లే చేసేవారు. ఏ పెళ్లికి వెళ్లినా లేదా ఏదైనా ఫంక్షన్‌కి వెళ్లినా ఆమె దగ్గరికి వెళ్ళడానికి అందరూ భయపడేవారు. కనీసం ఆటోగ్రాఫ్ కావాలని కూడా అడిగేవారు కాదు. సూర్యకాంతం చేసిన పాత్రలు వారిపై అంతటి ప్రభావాన్ని చూపాయి. ఓసారి ఆమె ఇంటి పనిమనిషి ఏదో కారణం వల్ల కొన్నాళ్ళు రాలేనని చెప్పింది. ఆ సమయంలో తన ఇంట్లో పనిచేసేందుకు ఓ మనిషి కావాలి అని కాకినాడలో ఉన్న స్నేహితురాలికి ఉత్తరం రాశారు సూర్యకాంతం. చెప్పినట్టుగానే ఆమె స్నేహితురాలు ఒక పనిమనిషిని వెంటబెట్టుకొని మద్రాస్ వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కి వచ్చారు. ఎవరింటికి పనిమనిషిగా వెళ్తోందో ఆ మహిళకు తెలీదు. మాటల సందర్భంలో విషయం తెలుసుకున్న ఆమె ఒక్కసారిగా భయపడిపోయి ‘బాబోయ్.. సూర్యకాంతం ఇంట్లో పనిచెయ్యాలా..’ అంటూ బ్యాగ్ తీసుకొని రైల్వేస్టేషన్ నుంచి బయటకు పరుగులు తీసిందట. ఇలాంటి సంఘటనలు సూర్యకాంతం జీవితంలో ఎన్నో జరిగాయి.
ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరో వైపు సినిమాల్లో కనిపించేదానికి పూర్తి విరుద్ధమైన మనస్తత్వం ఆమెది. నిజజీవితంలో ఆమె ఎంతో సౌమ్యురాలు. ఎంతో సున్నితమైన మనసు గలవారు. ఈ విషయం ఆమెను దగ్గరగా చూసిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఒక సినిమాలో నాగయ్యను ఎంతో కోపంగా తిట్టే సన్నివేశంలో నటించారు సూర్యకాంతం. షాట్ అయి పోయిన వెంటనే ఆయన కాళ్ళకు నమస్కారం చేసి కన్నీళ్ళతో క్షమించమని అడిగారు. దానికి నాగయ్య ‘నన్ను తిట్టింది నువ్వు కాదు, నువ్వు పోషిస్తున్న పాత్ర. బాధపడకమ్మా’ అంటూ ఆమెను ఓదార్చారు. ‘సంసారం’ చిత్రం తర్వాత ఓ హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం సూర్యకాంతంకి వచ్చింది. అయితే అంతకుముందు ఆ సినిమా కోసం ఓ అమ్మాయిని తీసుకొని ఆ తర్వాత ఆమెను తీసేశారట. అది తెలుసుకున్న సూర్యకాంతం ఒకరి బాధ తన సంతోషం కాకూడదు అని ఆ సినిమా చెయ్యనని దర్శకనిర్మాతలతో చెప్పేశారు. ఆమె మనసు ఎంత సున్నితమైందో ఈ సంఘటనలను బట్టి తెలుస్తుంది. ఆమె సినిమాలు చేస్తున్న సమయంలో ప్రతిరోజూ ఆమె ఇంటి నుంచి రకరకాల వంటకాలతో కూడిన క్యారేజ్ వచ్చేది. అందరికీ ఎంతో ప్రేమగా ఆమె వడ్డించేవారు. అలాగే ఇంటికి ఎవరైనా వస్తే తప్పనిసరిగా భోజనం చేసి వెళ్లాల్సిందే. ఆరోజుల్లో సావిత్రి, షావుకారు జానకి, కృష్ణకుమారి వంటి నటీమణులు కూడా ఈ తరహా మర్యాదలు చేసేవారు. అంతేకాదు, సూర్యకాంతంకి దయాగుణం ఎక్కువ. తన సహాయం కోరి వచ్చేవారిని ఎప్పుడూ నిరాశపరిచేవారు కాదు. తన స్థాయికి తగ్గట్టుగా వారిని ఆదుకునేవారు.