English | Telugu

ఆ సంఘటనతో రఘువరన్‌కి హీరో అంటేనే విరక్తి కలిగింది.. అప్పుడేం చేశారో తెలుసా?

భారతీయ నటుల్లో రఘువరన్‌కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రేక్షకులకు ఒక కొత్త తరహా విలన్‌ని పరిచయం చేసిన ఘనత రఘువరన్‌కి దక్కుతుంది. అప్పటివరకు ఉన్న విలన్స్‌ విచిత్రమైన వేషధారణ, గంభీర స్వరంతో డైలాగులు చెప్పడం, గట్టి గట్టిగా అరవడం వంటి లక్షణాలు కలిగి ఉండేవారు. కానీ, రఘువరన్‌ తన నటనా చాతుర్యంతో విలనీకి కొత్త అర్థం చెప్పారు. ఒక సాధారణమైన మనిషిగా కనిపించే విలన్‌ పాత్రలతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. 1982లో వలవత్తు మణితన్‌ పేరుతో వచ్చిన సినిమాతో కోలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత దాదాపు 30 సినిమాలు తమిళ్‌, తెలుగు, మలయాళ భాషల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 1989లో వచ్చిన శివ చిత్రంలోని తన నటనతో దేశవ్యాప్తంగా పాపులర్‌ అయిపోయారు రఘువరన్‌. కేవలం 26 సంవత్సరాలు మాత్రమే తన కెరీర్‌ను కొనసాగించిన రఘువరన్‌ నటుడుగా పీక్స్‌లో ఉన్న సమయంలో 49 సంవత్సరాల చిన్న వయసులో కన్నుమూశారు. ప్రేక్షకులకు కొత్త తరహా విలన్‌ని పరిచయం చేసిన రఘువరన్‌ నేపథ్యం ఏమిటి, సినిమా కెరీర్‌ ఎలా ప్రారంభమైంది. చిన్న వయసులోనే అతని జీవితం ముగిసిపోవడానికి కారణాలు ఏమిటి? అనేది తెలుసుకుందాం.

1958 డిసెంబర్‌ 11న కేరళలోని కొలెన్‌గోడెలో జన్మించారు రఘువరన్‌. అతని పూర్తి పేరు రఘువరన్‌ వేలాయుథన్‌ నాయర్‌. ఆయన తండ్రి హోటల్‌ బిజినెస్‌ ప్రారంభించడంతో కుటుంబమంతా కోయంబత్తూర్‌ షిఫ్ట్‌ అయ్యింది. డిగ్రీ మధ్యలోనే ఆపేసిన రఘువరన్‌ ట్రినిటీ కాలేజ్‌ లండన్‌లో పియానో కూడా నేర్చుకున్నారు. 1979 నుంచి 1983 వరకు చెన్నయ్‌లోని ఒక డ్రామా ట్రూప్‌లో మెంబర్‌గా ఉన్నారు. వలవత్తు మణితన్‌ చిత్రంతో హీరోగా పరిచయమైన రఘువరన్‌కి నటుడుగా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఒక సినిమాలో హీరోగా అవకాశం ఇస్తూ ఒక దర్శకుడు అతన్ని పిలిపించారు. ఆ సమయంలో సినిమా కథ ఏమిటి అని అడిగారు రఘువరన్‌. దానికి సీరియస్‌ అయిన ఆ డైరెక్టర్‌ ‘నువ్వు చేసింది ఒకే ఒక సినిమా. ఇప్పుడు కథ చెబితేనే మా సినిమా చేస్తావా?’ అంటూ అవమానించారు. ఆ మాటతో ఎంతో మనస్తాపం చెందిన రఘువరన్‌కి హీరో అంటేనే విరక్తి కలిగింది. ఇక తను ఏ సినిమాలోనూ హీరోగా నటించకూడదని నిర్ణయించుకున్నారు. విలన్‌గా చేయడమే కరెక్ట్‌ అనుకున్నారు. అలా విలన్‌ క్యారెక్టర్లు చేసేందుకు మొగ్గు చూపించారు. 

రఘువరన్‌ తెలుగులో నటించిన తొలి సినిమా కాంచనసీత. దాసరి నారాయణరావు ఆయన్ని తెలుగు తెరకు పరిచయం చేశారు. ఈ చిత్రాన్ని జయసుధ నిర్మించారు. అయితే ఈ సినిమా కంటే ముందే పసివాడి ప్రాణం రిలీజ్‌ అయింది. ఈ సినిమాలో దివ్యాంగుడైన విలన్‌గా నటించారు. ఈ సినిమా విలన్‌గా అతనికి మంచి పేరు తెచ్చింది. ఈ సినిమా తర్వాత మరో అరడజను తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో రామ్‌గోపాల్‌వర్మ దృష్టిలో పడ్డారు రఘువరన్‌. శివ చిత్రంలోని భవాని క్యారెక్టర్‌కి అతన్ని తీసుకున్నారు వర్మ. ఆ క్యారెక్టర్‌ను అత్యద్భుతంగా పోషించి అందరిచేత శభాష్‌ అనిపించుకున్నారు. ఈ సినిమా అతని కెరీర్‌ని ఒక్కసారిగా టర్న్‌ చేసింది. దీంతో తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 200కి పైగా సినిమాల్లో నటించారు. విలన్‌గానే కాకుండా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. 

రజినీకాంత్‌కి మంచి మిత్రుడైన రఘువరన్‌ ఆయన చేసిన చాలా సినిమాల్లో విలన్‌గా నటించారు. శంకర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ప్రేమికుడు, ఒకేఒక్కడు చిత్రాల్లో చేసిన పాత్రలు ఆయనకు చాలా మంచి పేరు తెచ్చాయి. ఒకేఒక్కడు చిత్రంలోని ముఖ్యమంత్రి పాత్రను ఎంతో సమర్థవంతంగా పోషించిన రఘువరన్‌కు తమిళనాడు స్టేట్‌ గవర్నమెంట్‌ ఉత్తమ విలన్‌ అవార్డును అందించింది. నటుడుగా రఘువరన్‌లో ఇది ఒక కోణమైతే.. అతని వ్యక్తిగత జీవితం మరోలా ఉండేది. అతనికి ఎన్నో దురలవాట్లు ఉండేవి. చీప్‌గా దొరికే సారా ప్యాకెట్‌ నుంచి స్టార్‌ హోటల్స్‌లో లభించే ఫారిన్‌ మద్యం వరకు అన్నీ తాగేవారు, సిగరెట్లు తాగేవారు, అమ్మాయిల వెంట తిరిగేవారు. తన మనసుకు ఎలా తోస్తే అలా చేసేవారు. ఎవ్వరికీ భయపడేవారు కాదు. ఈ విషయాలన్నీ తనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు రఘువరన్‌. అలాంటి విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిన రఘువరన్‌ ఒక్కసారిగా మారిపోయారు. తనకు ఉన్న దురలవాట్లన్నింటినీ దూరంగా పెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. దానికి కారణం నటి రోహిణి. రఘువరన్‌, రోహిణిల మధ్య ప్రేమాయణం నడిచింది. ఆ క్రమంలోనే తన అలవాట్లను మార్చుకున్నారు రఘువరన్‌. 

ప్రేమలో ఉన్న రఘువరన్‌, రోహిణి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకున్నారు. అందరికీ తెలిసేలా పెళ్లి చేసుకుంటే ఏవైనా సమస్యలు వస్తాయేమోనని భయపడి 1996 ఆగస్ట్‌ 23న తిరుపతిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు. పేరు రిషివరన్‌. ఇదిలా ఉంటే.. అప్పటివరకు సవ్యంగా ఉన్న రఘువరన్‌ పెళ్ళయిన కొంత కాలానికి మళ్ళీ మద్యానికి, మత్తు పదార్థాలకు బానిస అయిపోయారు. పరిస్థితి తన చేయి దాటిపోయిందని గ్రహించిన రోహిణి అతనికి 2004లో విడాకులు ఇచ్చేసింది. విడాకుల తర్వాత కర్ణాటకలోని ఓ ప్రకృతి ఆశ్రమంలో చేరి చికిత్స తీసుకున్నారు రఘువరన్‌. ఈ క్రమంలోనే 2008 మార్చి 19న 49 ఏళ్ళ వయసులో కన్నుమూశారు రఘువరన్‌. చనిపోయే సమయానికి చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అతనికి ఉన్న దురలవాట్లు అతని సినీ కెరీర్‌కి ఏమాత్రం అడ్డంకి కాలేదు. రఘువరన్‌ తర్వాత ఆ తరహా విలన్‌ మరొకరు రాలేదు అంటే అతిశయోక్తి కాదు.