English | Telugu

ఎన్నో విమర్శల మధ్య రిలీజైన ‘సంపూర్ణ రామాయణం’.. వారం రోజులు బయటకు రాని శోభన్‌బాబు!

తెలుగు చలన చిత్ర దర్శకుల్లో బాపుకి ఒక విశిష్టమైన స్థానం ఉంది. రొటీన్‌ చిత్రాలకు భిన్నంగా ఉండే ఆయన సినిమాలకు ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు.  చిత్రకారుడిగా, కార్టూనిస్ట్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న బాపు ‘సాక్షి’ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత మరో నాలుగు సినిమాలు చేసి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలో రామాయణ గాధను తెరకెక్కించాలనే ఆలోచన వచ్చింది బాపుకి. అనుకున్నదే తడవుగా అన్నీ సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. శోభన్‌బాబు రాముడిగా ‘సంపూర్ణ రామాయణం’ చిత్ర నిర్మాణం ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. ఇది చూసి అందరూ నవ్వుకున్నారు. ఈ సినిమాకి రచన చేస్తున్న ఆరుద్ర కమ్యూనిస్టు భావాలున్న రచయిత, ముళ్ళపూడి వెంకటరమణ కామెడీ కథలు రాస్తారు, ఇక బాపు కార్టూన్లు వేస్తారు. వీళ్ళంతా కలిసి రామయణాన్ని సినిమాగా తీయడమేంటి? పైగా శోభన్‌బాబు రాముడిగా నటిస్తారట. అసలు జనం ఈ సినిమాని చూస్తారా? ప్రేక్షకుల దృష్టిలో రాముడంటే ఎన్‌.టి.రామారావే. మరో నటుడ్ని ఊహించుకోలేరు, సినిమా ఖచ్చితంగా ఆడదు.. ఇలా రకరకాల విమర్శల మధ్య సినిమాను ప్రారంభించారు. 

ఈ సినిమా ప్రారంభించే సమయానికి ‘శ్రీరామపట్టాభిషేకం’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు ఎన్‌.టి.రామారావు. స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తి చేసేశారు. ‘సంపూర్ణ రామాయణం’ చిత్రాన్ని ప్రారంభించే ముందు ఎన్టీఆర్‌ను కలిసి స్టోరీలైన్‌ చెప్పారు బాపు, రమణ. అది విన్న ఎన్టీఆర్‌ ‘మేం శ్రీరామట్టాభిషేకం సినిమా చేయబోతున్నాం. స్క్రీప్ట్‌ కూడా రెడీ అయింది. మీరు వినే ఉంటారు’ అన్నారు. ‘మీరు చేయబోతున్న సినిమా గురించి విన్నాం. మీరు సినిమా ప్రారంభించడానికి ఇంకా సమయం ఉంది కదా. ఈలోగా మా సినిమా తీస్తాం’ అని చెప్పారు బాపు, రమణ. ‘అలాగే కానివ్వండి. నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి’ అన్నారు ఎన్టీఆర్‌. సాధారణంగా పౌరాణిక చిత్రాలు స్టూడియోల్లోనే తీసేవారు. కానీ, మొదటిసారి ఔట్‌డోర్‌లో సెట్స్‌ వేసి ఈ సినిమాను నిర్మించారు. రూ.7 లక్షల్లో పౌరాణిక చిత్రాలు నిర్మాణం జరుపుకుంటున్న ఆరోజుల్లో ‘సంపూర్ణ రామాయణం’ చిత్రానికి రూ.17 లక్షలకుపైగా బడ్జెట్‌ అయింది. 

పక్కా ప్లానింగ్‌తో షూటింగ్‌ను పూర్తి చేశారు బాపు. రచయితలు రమణ, ఆరుద్ర, సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్‌, సినిమాటోగ్రాఫర్‌ రవికాంత్‌ నగాయిచ్‌ల సహకారంతో వాల్మీకి రామాయణాన్ని ఓ దృశ్యకావ్యంలా తీర్చిదిద్దారు బాపు. సినిమా రిలీజ్‌ అయ్యే ముందు రోజు శోభన్‌బాబు ఒక్కరే ఎన్టీఆర్‌ను కలిసేందుకు వెళ్లారు. తను చేసిన ‘సంపూర్ణ రామాయణం’ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తూ రేపే సినిమాను విడుదల చేస్తున్నామని చెప్పారు శోభన్‌బాబు. ‘సినిమా ఎలా వచ్చింది?’ అని అడిగారు ఎన్టీఆర్‌. ‘బాగానే వచ్చింది సర్‌’ అని చెప్పారు శోభన్‌. ‘ఇదే విషయాన్ని మీరు ఎల్లుండి వచ్చి చెప్పండి’ అన్నారట ఎన్టీఆర్‌. సినిమా రిలీజ్‌ అయింది. ఆశించిన స్పందన రాలేదు. కలెక్షన్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో అప్పటివరకు సినిమా గురించి విమర్శించిన వారంతా మరోసారి రకరకాల కామెంట్స్‌ చేయడం మొదలు పెట్టారు. ఎన్టీఆర్‌ను కలిసేందుకు శోభన్‌బాబుకి మొహం చెల్లలేదు. వారం రోజుల పాటు ఇంటి నుంచి బయటికి రాలేదాయన. 

రెండో వారం కాస్త కలెక్షన్లు పెరిగాయి. మూడో వారం ఒక్కసారిగా కలెక్షన్లు పుంజుకున్నాయి. ‘సంపూర్ణ రామాయణం’ చిత్రాన్ని చూసేందుకు జనాలు బళ్ళు కట్టుకొని మరీ వచ్చారు. థియేటర్‌లో హారతులు, పూజలు మొదలయ్యాయి. ‘లవకుశ’ తర్వాత మళ్ళీ అంతటి ప్రభంజనం ‘సంపూర్ణ రామాయణం’ చిత్రానికే దక్కింది. అప్పట్లో శోభన్‌బాబుకి థియేటర్‌ ఉండేది. ఒకరోజు ఎన్టీఆర్‌ సినిమాని చూపించమని శోభన్‌బాబుని అడిగారు. ఎన్టీఆర్‌ కోసం ప్రత్యేకంగా ప్రదర్శన ఏర్పాటు చేసి పక్కనే కూర్చున్నారు శోభన్‌బాబు. సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్‌ ఎంతో ఆనందంగా శోభన్‌బాబుని కౌగిలించుకొని అభినందించారు. 

ఈ సినిమా 10 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమైంది. పదిహేళ్ళ తర్వాత అంటే 1987లో మళ్ళీ ఈ సినిమా రిలీజ్‌ చేస్తే కొన్ని థియేటర్లలో 100 రోజులు, మరికొన్ని థియేటర్లలో 50 రోజులు రన్‌ అయింది. ఈ సినిమాను హిందీలోకి డబ్‌ చేయగా 1973లో హయ్యస్ట్‌ కలెక్షన్స్‌ సాధించిన టాప్‌ 5 సినిమాల్లో ‘సంపూర్ణ రామాయణం’ చోటు దక్కించుకుంది. అలాగే ఈ సినిమాను బెంగాలీలో రీమేక్‌ చేశారు. అప్పటికే వరస హిట్‌ సినిమాలతో మంచి జోరు మీద ఉన్న శోభన్‌బాబు ఇమేజ్‌ ఈ సినిమా విజయంతో మరింత పెరిగింది.