Read more!

English | Telugu

ఒకే కథతో ఒకేరోజు రెండు సినిమాలు.. ఎన్టీఆర్‌ ముందు నిలబడలేకపోయిన కృష్ణ!

ఒకే కథతో ఒకటికి మించి సినిమాలు రూపొందిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే కొంత గ్యాప్‌తో తీస్తారు కాబట్టి వాటిని మనం రీమేక్స్‌ అంటుంటాం. అలా కాకుండా ఒకే కథతో ఒకే సమయంలో రెండు సినిమాలు రూపొందితే ఎలా ఉంటుంది? అలా టాలీవుడ్‌లో చాలా సార్లు జరిగింది. 1933లో కృష్ణ ఫిలింస్‌ ‘సావిత్రి’, ఈస్ట్‌ ఇండియా ‘సతీ సావిత్రి’, 1933లోనే ఇంపీరియల్‌ ‘రామదాసు’, ఈస్ట్‌ ఇండియా ‘రామదాసు’ , 1938లో ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’, ‘ద్రౌపది మానసంరక్షణం’, 1942లో జెమిని వారి ‘బాలనాగమ్మ’, శాంత వారి ‘బాలనాగమ్మ’,   1950లో ‘లక్ష్మమ్మ’, ‘శ్రీలక్ష్మమ్మ కథ’.. ఇలా ఒకే కథతో పోటాపోటీగా సినిమాలు నిర్మించారు. తెలుగు సినిమా పుట్టిన తొలినాళ్ళలో నిర్మాణం జరుపుకున్న ఈ సినిమాల గురించి అప్పట్లో పెద్ద చర్చలే జరిగాయి. ఆ తర్వాత అంటే 26 సంవత్సరాల తర్వాత అదే పరిస్థితి వచ్చింది. నటరత్న ఎన్‌.టి.రామారావు స్వీయ దర్శకత్వంలో ‘దానవీరశూర కర్ణ’ చిత్రాన్ని ప్రారంభించే సమయంలోనే సూపర్‌స్టార్‌ కృష్ణ ‘కురుక్షేత్రం’ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ రెండు సినిమాలూ మహాభారత యుద్ధం నేపథ్యంలోనే రూపొందడం విశేషం. ఈ రెండు సినిమాల తీరుతెన్నులు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే..

‘దానవీరశూర కర్ణ’ చిత్రంలో ఎన్టీఆర్‌ కృష్ణుడుగా, దుర్యోధనుడుగా, కర్ణుడుగా మూడు విభిన్నమైన పాత్రలు పోషించారు. అంతేకాదు, ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. నందమూరి హరికృష్ణ అర్జునుడుగా, నందమూరి బాలకృష్ణ అభిమన్యుడుగా నటించారు. ఈ సినిమాకి సంబంధించిన కథా విస్తరణలో సహకరించడానికి, సంభాషణలు రాయడానికి కొండవీటి వేంకటకవిని ఎంచుకున్నారు ఎన్టీఆర్‌. అయితే ఆ బాధ్యతను నిర్వహించేందుకు ఆయన అంగీకరించలేదు. అప్పుడు ఎన్టీఆరే స్వయంగా ఆయన్ని కలిసి సినిమా చేయడానికి ఒప్పించారు. 1976 జూన్‌ 7న ఈ సినిమా షూటింగ్‌తోనే హైదరాబాద్‌లోని రామకృష్ణా స్టూడియోస్‌ ప్రారంభమైంది. తమిళ్‌ సూపర్‌స్టార్‌ ఎం.జి.రామచంద్రన్‌ ‘దానవీరశూర కర్ణ’ ముహూర్తపు షాట్‌కు క్లాప్‌నిచ్చారు. ఈ చిత్రానికి మొదట ఎస్‌.రాజేశ్వరరావు సంగీత దర్శకుడు అనుకున్నారు. ఈ సినిమాలో మొదట వచ్చే ‘ఏ తల్లి నిను కన్నదో..’ పాటను కంపోజ్‌ చేసింది ఎస్‌.రాజేశ్వరరావే. ఆ తర్వాత ఆయన స్థానంలోకి పెండ్యాల నాగేశ్వరరావు వచ్చారు.  

‘పాండవవనవాసము’ చిత్రాన్ని నిర్మించిన ఎ.ఎస్‌.ఆర్‌.ఆంజనేయులు నిర్మాణ భాగస్వామిగా ‘కురుక్షేత్రం’ చిత్రాన్ని నిర్మించారు కృష్ణ. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించగా, ఎస్‌.రాజేశ్వరరావు సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో కృష్ణతోపాటు, శోభన్‌బాబు, కృష్ణంరాజు, చంద్రమోహన్‌,  కైకాల సత్యనారాయణ, విజయనిర్మల, జయలలిత, జయప్రద ఇంకా ఎంతోమంది ప్రముఖ నటీనటులు వివిధ పాత్రలు పోషించారు. 

ఈ రెండు సినిమాలు పోటాపోటీగా షూటింగ్‌ జరుపుకున్నాయి. ఇలా ఇద్దరు టాప్‌ హీరోల సినిమాలు ఒకే కథతో ఒకే సమయంలో రూపొందడం, చివరికి  ఒకేరోజు అంటే 1977 జనవరి 14న రిలీజ్‌ అవ్వడం అనేది తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇదే తొలిసారి, చివరిసారి కూడా. ఈ సినిమా నిర్మాణం జరుగుతున్నన్ని రోజులూ ఎక్కడ చూసినా ఈ రెండు సినిమాల గురించే మాట్లాడుకునేవారు. ఇక పత్రికల్లో ఈ రెండు సినిమాల గురించే వార్తలు వచ్చేవి. ఇక వారపత్రికల్లో ఒకవారం ‘దానవీరశూర కర్ణ’ కవర్‌పేజీ వేస్తే, మరోవారం ‘కురుక్షేత్రం’ కవర్‌పేజీ వేసేవారు. రెండోది బ్యాక్‌పేజీకి వెళ్లేది. అలా చాలాకాలం ఈ రెండు సినిమాలు వార్తల్లో నిలిచాయి. ఒకవిధంగా చూస్తే కృష్ణ కంటే ఎన్‌.టి.రామారావుకే ఈ సినిమా చేయడం కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే సినిమాలో మూడు పాత్రలు ధరించడమే కాదు, దర్శకత్వం, నిర్మాణం వంటి బాధ్యతలు ఆయనపై ఉన్నాయి. అయినా ఈ సినిమా షూటింగ్‌ను కేవలం 43 రోజుల్లో పూర్తి చేశారు. ఈ సినిమాకి రూ.10 లక్షలు బడ్జెట్‌ అయింది. 

అందరూ ఈ సినిమాల రిలీజ్‌ కోసం ఎదురుచూశారు. 1977 జనవరి 14న ‘దానవీరశూర కర్ణ’, ‘కురుక్షేత్రం’ చిత్రాలు రిలీజ్‌ అయ్యాయి. పౌరాణిక పాత్రలు పోషించడంలో ఎనీఆర్‌కి ఉన్నంత అనుభవం కురుక్షేత్రం చిత్రంలో నటించిన హీరోలకు లేదు. దీంతో ‘దానవీరశూర కర్ణ’ ముందు ‘కురుక్షేత్రం’ నిలబడలేకపోయింది. ఎన్టీఆర్‌ ధాటిని తట్టుకోవడం కృష్ణ వల్ల కాలేదు. దీంతో ‘కురుక్షేత్రం’ పరాజయం పాలైంది. అయితే ఇదే సినిమాను హిందీలోకి డబ్‌ చేసి రిలీజ్‌ చేస్తే అక్కడ ఘనవిజయం సాధించింది. ఇక ‘దానవీరశూర కర్ణ’ ఘనవిజయం సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. ‘లవకుశ’ తర్వాత కోటి రూపాయలు కలెక్ట్‌ చేసిన చిత్రంగా ‘దానవీరశూర కర్ణ’ రికార్డు సృష్టించింది. 1994లో ఈ సినిమా ఆంధ్రా, సీడెడ్‌ రీరిలీజ్‌ రైట్స్‌ను రూ.65 లక్షలకు అమ్మారు. అప్పుడు కూడా ఈ సినిమా 1 కోటి రూపాయలు కలెక్ట్‌ చేసింది.