English | Telugu

100 సినిమాలు డైరెక్ట్‌ చేస్తానని ఛాలెంజ్‌ చేసి అన్నంత పనీ చేసిన దర్శకుడు!

100 సినిమాలు డైరెక్ట్‌ చేస్తానని ఛాలెంజ్‌ చేసి అన్నంత పనీ చేసిన దర్శకుడు!

(జనవరి 5 దర్శకుడు కె.ఎస్.ఆర్.దాస్ జయంతి సందర్భంగా..)

కె.ఎస్‌.ఆర్‌.దాస్‌.. తెలుగు సినిమాను పౌరాణిక, జానపద, కుటుంబ కథా చిత్రాల నుంచి క్రైమ్‌ అండ్‌ యాక్షన్‌ వైపు పరుగులు తీయించిన దర్శకుడు. తెలుగు సినిమా చరిత్రలో ఈ పంథాలో సినిమాలు తీసి మెప్పించిన దర్శకుడు మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఆరోజుల్లో యాక్షన్‌ సినిమా చెయ్యాలంటే కె.ఎస్‌.ఆర్‌.దాసే చెయ్యాలి. అంతలా ప్రేక్షకుల్నే కాదు, ఇండస్ట్రీలోని ప్రముఖుల్ని కూడా మెస్మరైజ్‌ చేశారు. అల్లూరి సీతారామరాజు వంటి చారిత్రాత్మక చిత్రంలోని పోరాట సన్నివేశాలను చిత్రీకరించే బాధ్యత కె.ఎస్‌.ఆర్‌.దాస్‌కి అప్పగించారంటే యాక్షన్‌ సీక్వెన్స్‌లపై ఆయనకు ఉన్న పట్టు ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇండియాలోనే తొలి కౌబాయ్‌ మూవీ మోసగాళ్ళకు మోసగాడుని తెరకెక్కించిన ఘనత ఆయనది. తెలుగు సినిమాకి ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చిన దాస్‌ సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది, తన కెరీర్‌లో ఆయన ఎలాంటి విజయాలు సాధించారు అనే విషయాలు తెలుసుకుందాం.

1936 జనవరి 5న నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చెంచురామయ్య, శేషమ్మ దంపతులకు జన్మించారు కె.ఎస్‌.ఆర్‌.దాస్‌. ఆయన పూర్తి పేరు కొండా సుబ్బరామదాస్‌. హైస్కూల్‌ చదువు పూర్తయిన తర్వాత గుంటూరులోని కృష్ణ మహల్‌ థియేటర్‌లో బుకింగ్‌ క్లర్క్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. థియేటర్‌లో పనిచేస్తున్న రోజుల్లో ప్రతిరోజూ సినిమాలు చూస్తూ వాటి గురించి విశ్లేషించేవారు. ఒకసారి గేటు పక్కన నిలబడి సినిమా చూస్తూ అందులోని సన్నివేశాల గురించి విమర్శిస్తూ మాట్లాడారు. తనైతే ఇలాంటి సినిమాలు వంద తియ్యగలను అన్నారు. అతని మాటలు పక్కనే ఉన్న ప్రముఖ నిర్మాత ఎస్‌.భావనారాయణ విన్నారు. సినిమాలపై అతనికి ఉన్న ఆసక్తిని గమనించి అతన్ని మద్రాస్‌ రమ్మన్నారు. అక్కడ ఎడిటింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో చేర్పించారు. అలా 20 సినిమాలకు పనిచేశారు. ఆ తర్వాత డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరారు. ఆయన పనిచేసిన తొలి సినిమా ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన బండరాముడు. దాదాపు 10 సంవత్సరాల పాటు భావనారాయణ సంస్థలోనే పనిచేసిన దాస్‌ అదే సంస్థ నిర్మించిన లోగుట్టు పెరుమాళ్ళ కెరుక చిత్రంతో దర్శకుడయ్యారు.

మూడో చిత్రం కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ తెరకెక్కించిన రౌడీరాణి. ఈ సినిమాలో విజయలలిత హీరోయిన్‌. దక్షిణాదిన ఇదే తొలి హీరోయిన్‌ ఓరియంటెడ్‌ మూవీ కావడం విశేషం. ఇది చాలా పెద్ద హిట్‌ కావడంతో దాస్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 100కి పైగా క్రైమ్‌, జేమ్స్‌బాండ్‌, యాక్షన్‌, జానపద, సాంఘిక చిత్రాలను డైరెక్ట్‌ చేశారు. వాటిలో ఎక్కువ శాతం విజయం సాధించాయి. ముఖ్యంగా క్రైమ్‌ అండ్‌ యాక్షన్‌ మూవీస్‌ ఒరవడి పెంచిన ఘనత ఖచ్చితంగా కె.ఎస్‌.ఆర్‌.దాస్‌దే. తను చేసే సినిమాల టైటిల్స్‌ దగ్గర నుంచి హీరో గెటప్స్‌ వరకు అన్నీ ప్రత్యేకంగానే ఉండేవి. సూపర్‌స్టార్‌ కృష్ణ కాంబినేషన్‌లో దాస్‌ చేసిన మొదటి సినిమా టక్కరి దొంగ చక్కని చుక్క. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో వీరి కాంబినేషన్‌కి తిరుగు లేకుండాపోయింది. ఇద్దరూ కలిసి 30 సినిమాలు చేశారంటే.. ఈ కాంబినేషన్‌కి ఎంత ఆదరణ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. జేమ్స్‌బాండ్‌ 777, మోసగాళ్ళకు మోసగాడు, హంతకులు దేవాంతకులు, దొంగలవేట, ఏజెంట్‌ గోపి, దొంగలకు సవాల్‌, అన్నదమ్ముల సవాల్‌, భలేదొంగలు, ఈనాటి బంధం ఏనాటిదో వంటి సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. కుటుంబ కథా చిత్రాల్లో, సెంటిమెంట్‌ సినిమాల్లోనూ తన ప్రత్యేకత చాటుకున్నారు దాస్‌. 

మెగాస్టార్‌ చిరంజీవితో రోషగాడు, బిల్లా రంగా, పులి బెబ్బులి వంటి సినిమాలు రూపొందించారు. శోభన్‌బాబుతో లోగుట్టు పెరుమాళ్ళ కెరుక, గిరిజా కళ్యాణం, చేసిన బాసలు వంటి సినిమాలు చేశారు. ఇంకా కాంతారావు, రామకృష్ణ వంటి హీరోలతో కూడా సినిమాలు చేసిన దాస్‌.. ఎఎన్నార్‌తో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు. 80 సినిమాలకు పైగా డైరెక్ట్‌ చేసిన తర్వాత ఎన్టీఆర్‌తో యుగంధర్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించారు. కన్నడలో 20 సినిమాలు చేసిన దాస్‌.. అందులో 14 సినిమాలు హీరో విష్ణువర్థన్‌తోనే చేయడం విశేషం. ఇక నిర్మాతగా 18 సినిమాలు నిర్మించారు. ఇండియాలోనే తొలి కౌబాయ్‌ సినిమా మోసగాళ్ళకు మోసగాడుని డైరెక్ట్‌ చేసిన ఘనత కె.ఎస్‌.ఆర్‌.దాస్‌కి దక్కుతుంది. ఆయన చేసిన సినిమాలు కమర్షియల్‌ హిట్స్‌ సాధించినా అవి యాక్షన్‌ అండ్‌ క్రైమ్‌ చిత్రాలు కావడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి అవార్డులు రాలేదు. అయితే కన్నడ ప్రభుత్వం పుట్టన్న కణగల్‌ అవార్డుతో కె.ఎస్‌.ఆర్‌. దాస్‌ను సత్కరించింది. థియేటర్‌లో బుకింగ్‌ క్లర్క్‌గా పనిచేసిన దాస్‌.. ఆ సమయంలో ఛాలెంజ్‌ చేసినట్టుగానే ఇండస్ట్రీకి వచ్చి 100కి పైగా సినిమాలను రూపొందించారు. ఆయన చివరి చిత్రం 2000లో వచ్చిన నాగులమ్మ. ఆ తర్వాత వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యల వల్ల సినిమాలకు దూరంగా ఉన్నారు. చివరికి 2012 జూన్‌ 8న చెన్నయ్‌లోని అపోలో ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు కె.ఎస్‌.ఆర్‌.దాస్‌.