English | Telugu
అపర సత్యభామగా పేరు తెచ్చుకున్న అసమాన నటి జమున!
Updated : Aug 30, 2025
(ఆగస్ట్ 30 నటి జమున జయంతి సందర్భంగా..)
1950 నుంచి 1970 వరకు కొనసాగిన పాతతరంలో ఎంతో మంది హీరోయిన్లు తమ అందచందాలతో, నటనతో ప్రేక్షకుల్ని అలరించారు. ఆ రెండు దశాబ్దాల్లో తెరపై కనిపించిన హీరోయిన్లలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి జమున. అందం, అభినయం కలగలిసిన జమునకు ఎంతో పేరు తెచ్చిన పాత్ర సత్యభామ. తెలుగు చిత్ర సీమలో సత్యభామ అంటే గుర్తొచ్చే పేరు జమున. ఆ పాత్రలో అంతగా లీనమై నటించారామె. ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు, జగ్గయ్య, హరనాథ్ వంటి అగ్రతారలతో కలిసి ఎన్నో చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు జమున. దక్షిణాది సినిమాలతోపాటు హిందీ సినిమాల్లో కూడా నటించారు. 36 సంవత్సరాల సినీ కెరీర్‌లో 198 సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. నటిగా, రాజకీయ నాయకురాలిగా మంచి పేరు తెచ్చుకున్న జమున సినీ, రాజకీయ జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం.
1936 ఆగస్ట్ 30న కర్ణాటక రాష్ట్రంలోని హంపిలో నిప్పణి శ్రీనివాసరావు, కౌసల్యాదేవి దంపతులకు జన్మించారు జమున. ఆమె కంటే ముందు ఒక బాబు పుట్టి చనిపోవడంతో పండరీపురం వెళ్లి అక్కడి అమ్మవారిని దర్శించుకోవడంతో జమున జన్మించారు. అందుకే ఆమెకు మొదట జనాబాయి అని పేరు పెట్టారు. నక్షత్రం ప్రకారం ఏదైనా నది పేరు కలిసేలా పేరు పెట్టాలని పండితులు సూచించడంతో యమునలోని ము అక్షరాన్ని ఆమె పేరులో జతచేసి జమున అని నామకరణం చేశారు. జమునకు నాలుగేళ్ళ వయసులో వ్యాపార నిమిత్తం తెనాలి దగ్గరలోని దుగ్గిరాల వచ్చింది వారి కుటుంబం. పుట్టి పెరిగింది హంపిలో కావడంతో జమునకు తెలుగు వచ్చేది కాదు. ఐదో ఏట స్కూల్‌లో చేరిన తర్వాతే తెలుగు నేర్చుకున్నారు. జమున తల్లి కౌసల్యాదేవి ఊరూరూ తిరిగి హరికథలు చెప్పేవారు. కొన్ని హరికథలకు జమునను కూడా తీసుకెళ్ళేవారు. అప్పుడు ఆమె స్టేజ్‌పై పాటలు పాడేవారు. పాటలు బాగా పాడుతుండడంతో ఆమెకు హార్మోనియం నేర్పించారు కౌసల్యాదేవి. జమున గురించి తెలుసుకున్న కొన్ని నాటక సమాజాల వారు ఆమెకు నాటకాల్లో నటించే అవకాశం ఇచ్చారు. అదే సమయంలో దుగ్గిరాలలో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్న కొంగర జగ్గయ్య కూడా నాటకాలు వేసేవారు. పొరుగూరులో ఖిల్జీ పతనం అనే నాటకం వేస్తున్నారని, జమునను పంపించాల్సింది ఆమె తల్లిదండ్రులను కోరారు జగ్గయ్య. వారి అనుమతితో ఆ నాటకంలో ఒక పాటకు జమునతో డాన్స్ చేయించారు. అప్పటికి జమున వయసు పదేళ్ళు. అలా పలు నాటకాల్లో నటించడం వల్ల నటిగా ఆమెకు మంచి పేరు వచ్చింది.
జమున ప్రతిభ గురించి తెలుసుకున్న ప్రముఖ దర్శకనిర్మాత బి.వి.రామానందం దుగ్గిరాల వచ్చి ఆమె తల్లిదండ్రులను కలిసి తను జైవీరభేతాళ అనే సినిమా తీస్తున్నానని, అందులో నటించేందుకు జమునను పంపించాల్సిందిగా కోరి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత జమునను తీసుకొని మద్రాస్ వెళ్ళారు తల్లిదండ్రులు. అక్కడ కొన్ని రోజులు రిహార్సల్స్ చేసిన తర్వాత షూటింగ్ ప్రారంభించారు. ఒక షెడ్యూల్ పూర్తయిన తర్వాత రెండో షెడ్యూల్‌కి ఇంకా టైమ్ వుందనీ, షూటింగ్ మొదలయ్యే ముందు కబురు పంపిస్తామని నటీనటుల్ని పంపించేశారు. అయితే ఆ తర్వాత ఆ సినిమా గురించి ఎలాంటి కబురు రాలేదు. ఈలోగా రంగస్థలంపై విశిష్టమైన పేరు ప్రఖ్యాతులు ఉన్న గరికపాటి రాజారావు ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. జమున గురించి ఆయనకు అంతకుముందే తెలిసి ఉండడంతో తమ సినిమాలో హీరోయిన్‌గా నటించాల్సిందిగా కోరారు. ఆ తర్వాత నెలరోజుల్లో షూటింగ్ మొదలుపెట్టారు. ఆ సినిమా పేరు పుట్టిల్లు. ఈ సినిమా ద్వారానే అల్లు రామలింగయ్య, సంగీత దర్శకుడు టి.చలపతిరావు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. పుట్టిల్లు చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించి నిర్మించారు రాజారావు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే బి.వి.రామానందం చనిపోయారనే వార్త తెలిసి జమున తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు. 1953లో పుట్టిల్లు చిత్రం విడుదలై పరాజయాన్ని చవిచూసింది.
ఆ తర్వాత ప్రముఖ దర్శకనిర్మాత హెచ్.ఎం.రెడ్డి రూపొందిస్తున్న వద్దంటే డబ్బు చిత్రంలో జమునకు ఓ పాత్ర ఇచ్చారు. ఈ సినిమా కూడా విజయవంతం కాలేదు. ఆ తర్వాత నిరుపేదలు చిత్రంలో ఎఎన్నార్ సరసన హీరోయిన్‌గా నటించినా బంగారుపాప, వదినగారి గాజులు, దొంగరాముడు వంటి చిత్రాల్లో సెకండ్ హీరోయిన్‌గా చేశారు. 1956లో వచ్చిన చిరంజీవులు సినిమాలో మళ్లీ హీరోయిన్‌గా నటించారు జమున. ఈ సినిమా తర్వాత తెనాలి రామకృష్ణ, భాగ్యరేఖ, దొంగల్లో దొర, ఇల్లరికం, పెళ్లినాటి ప్రమాణాలు, శ్రీకృష్ణమాయ, గుండమ్మకథ, సిపాయి కూతురు, గులేబకావళి కథ, బొబ్బిలియుద్ధం వంటి సినిమాలతో టాప్ హీరోయిన్ అనిపించుకున్నారు. సత్యభామ పాత్ర పోషణలో జమున విశేషమైన ప్రతిభ కనబరిచేవారు. ఇప్పటివరకు ఆ పాత్రలో జమునను తప్ప మరొకరిని ఎవరూ ఊహించుకోలేరు. తెలుగులోనే కాకుండా తమిళ్‌లో 27, కన్నడలో 8, హిందీలో 8 చిత్రాల్లో నటించారు. మూగమనసులు చిత్రంలోని గౌరి పాత్రలో అత్యద్భుతమైన నటనను ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు జమున. ఇదే సినిమాను హిందీలో మిలన్ పేరుతో రీమేక్ చేశారు. అందులోనూ గౌరి పాత్రను జమునే చేసి మెప్పించారు. ఈ రెండు సినిమాల్లోని నటనకుగాను ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. జమున నటించిన చివరి సినిమా 1989లో వచ్చిన రాజకీయ చదరంగం. ఇక అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే 2021లో అంటే 32 సంవత్సరాల తర్వాత అన్నపూర్ణమ్మగారి మనవడు చిత్రంలో ఓ పాత్రలో కనిపించారు.
జమునకు మూగ జీవాలంటే ప్రాణం. తనకి చిన్నతనం నుంచీ కుక్కలను పెంచడం అలవాటు. 1967లో ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయిన జూలూరి రమణారావును వివాహం చేసుకున్నారు. పెళ్ళయిన తర్వాత కూడా కుక్కలను పెంచడం కొనసాగించారు. ఒకదశలో వారి ఇంట్లో 25 కుక్కలు ఉండేవి. వాటికి అన్ని వసతులు కల్పించడంతోపాటు డెలివరీలు కూడా చేసేవారు. వాటికి అనారోగ్యం కలిగితే తనే చికిత్స చేసేవారు. అంతేకాదు, ఆమె దగ్గర రెండు గుర్రాలు కూడా ఉండేవి. తన పెళ్లి నిశ్చయమైన తర్వాత ఈ విషయంలో ఎంతో ఆందోళన చెందారు జమున. పెళ్లి తర్వాత కుక్కలను పెంచుకోవడానికి తన భర్త ఒప్పుకుంటాడా లేదా అని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పేవారు. జమున, రమణారావు దంపతులకు వంశీ, స్రవంతి సంతానం. ప్రముఖ రచయిత వేటూరి సుందరామ్మూర్తి సోదరుడి కుమార్తెను కోడలుగా చేసుకున్నారు జమున. ఆమె భర్త రమణారావు 2014లో 86 ఏళ్ళ వయసులో అనారోగ్యంతో కన్నుమూశారు.
జమునకు ఇందిరాగాంధీ అంటే ఎంతో అభిమానం. దాంతో 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1989లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోని విభేదాల వల్ల భారతీయ జనతాపార్టీలో చేరి ప్రచారం చేశారు. జమునకు దానగుణం ఎక్కువ. తన జీవిత కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థ నెలకొల్పి పెన్షన్లు అందించారు. 1980లో టి.అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి సహకారంతో కాకినాడ సమీపంలో 150 మందికి నివాసాలు నిర్మించారు. అందుకే ఆ కాలనీకి జమున నగర్ అని పేరు పెట్టారు. ఇక జమున అందుకున్న పురస్కారాల గురించి చెప్పాలంటే.. మూగమనసులు(1964), మిలన్(1967) చిత్రాలకుగాను ఉత్తమ సహాయనటిగా ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. అలాగే 2008లో ఎన్.టి.ఆర్. జాతీయ పురస్కారం లభించింది. చలన చిత్రసీమలో నటిగా తనదంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసిన జమున వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతూ 2023 జనవరి 27న 87 ఏళ్ళ వయసులో తుదిశ్వాస విడిచారు.