English | Telugu

ఆ డైరెక్టర్‌ని చిరంజీవి, బాలకృష్ణ సినిమాల నుంచి ఒకేసారి తప్పించారు.. ఎందుకో తెలుసా?

సినిమా రంగంలో వరస సక్సెస్‌లతో దూసుకెళ్తున్న హీరోలకైనా, డైరెక్టర్లకైనా, నిర్మాతలకైనా ఏదో ఒక సందర్భంలో కెరీర్‌ పరంగా ఒడిదుడుకులు రావడం అనేది సహజం. అలాంటి సందర్భంలో వారు మానసికంగా ఎంతో మనోవేదనకు గురవుతారు. అయితే సినిమాలు సక్సెస్‌ కాకపోవడం వల్ల ఎదురయ్యే బాధ గురించి పక్కన పెడితే.. తను డైరెక్ట్‌ చేయబోయే సినిమాల నుంచి తనని తప్పిస్తే ఎలాంటి బాధ కలుగుతుంది? అలా ఒకేసారి చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోల సినిమాల నుంచి ఆ డైరెక్టర్‌ని తప్పించారు. అతని పేరు తాతినేని ప్రసాద్‌. లెజండరీ డైరెక్టర్‌ తాతినేని ప్రకాశరావు తనయుడు తాతినేని ప్రసాద్‌. తండ్రిలాగే దర్శకుడిగా మారిన ప్రసాద్‌ ఎన్నో విజయవంతమైన సినిమాలు చేశారు. 

అవి చిరంజీవి సక్సెస్‌ఫుల్‌గా హీరోగా పేరు తెచ్చుకొని ఖైదీ చిత్రంతో స్టార్‌ హీరో రేంజ్‌కి ఎదిగిన రోజులు. అదే టైమ్‌లో నందమూరి బాలకృష్ణ సోలో హీరోగా నటించిన తొలి సినిమా సాహసమే జీవితం విడుదలైంది. తనతో ఎన్నో అద్భుతమైన సినిమాలను రూపొందించిన తాతినేని ప్రకాశరావు అంటే ఎన్‌.టి.ఆర్‌కు ఎంతో గౌరవం. ఆయన తనయుడు ప్రసాద్‌ అంటే కూడా ఎంతో అభిమానం. ఆ కారణంగానే బాలకృష్ణతో మూడు సినిమాలు చేసే అవకాశం ఇచ్చారు ఎన్టీఆర్‌. అలా డిస్కోకింగ్‌, ఆత్మబలం, పల్నాటి పులి చిత్రాలను రూపొందించారు తాతినేని ప్రసాద్‌. ఆ తర్వాత ఎఎన్నార్‌, బాలకృష్ణ కాంబినేషన్‌లో ఓ సినిమా చేసే అవకాశం ఇచ్చారు జగపతి సంస్థ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్‌. ఇదిలా ఉంటే.. నాదెండ్ల భాస్కరరావు వల్ల ఎన్‌.టి.రామారావు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 

ఆ సమయంలో నాదెండ్ల భాస్కరరావుకు మద్దతుగా ఉన్నారు తాతినేని ప్రకాశరావు. తమను కాదని నాదెండ్లతో చేరిన ప్రకాశరావు కుమారుడికి బాలకృష్ణను అప్పగించడం, ఆయనతోనే వరసగా సినిమాలు చేయడం ఎన్టీఆర్‌ వర్గీయులకు నచ్చలేదు. తాతినేని ప్రసాద్‌ను బాలకృష్ణ సినిమా నుంచి తప్పించాలని ఎన్టీఆర్‌కు సూచించారు. అయితే ఆయన ఆ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా ఆయన సోదరుడు త్రివిక్రమరావు మాత్రం వి.వి.రాజేంద్రప్రసాద్‌కి ఫోన్‌ చేసి ప్రసాద్‌ని ఆ సినిమా నుంచి తప్పించమని చెప్పారు. నిస్సహాయుడైన రాజేంద్రప్రసాద్‌ అదే విషయాన్ని ప్రసాద్‌కి చెప్పారు. ‘దానికి మీరు మాత్రం ఏం చేస్తారు. ఫర్వాలేదు లెండి’ అన్నారు ప్రసాద్‌. ఆ సినిమా పేరు భార్యాభర్తల బంధం. మరో డైరెక్టర్‌కి అవకాశం ఇవ్వకుండా వి.బి.రాజేంద్రప్రసాదే ఆ సినిమాను డైరెక్ట్‌ చేశారు. 

ఇది జరిగిన కొన్ని రోజులకు చిరంజీవి హీరోగా తాతినేని ప్రసాద్‌ డైరెక్షన్‌లో పులి చిత్రం ప్రారంభం కావాల్సి ఉంది. మైసూర్‌లో మరో సినిమా షూటింగ్‌లో ఉన్న ప్రసాద్‌ అది పూర్తి చేసి వారం రోజుల్లో చిరంజీవి సినిమా స్టార్ట్‌ చెయ్యాల్సి ఉంది. దానికి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా కంప్లీట్‌ అయిపోయింది. ఆ సినిమాకి నిర్మాత ఆనం గోపాలకృష్ణ. బాలకృష్ణ సినిమా నుంచి ప్రసాద్‌ను తొలగించారని తెలిసిన తర్వాత చిరంజీవి సన్నిహితులు ఆయనకు ఈ విషయం చెప్పి అతన్ని ఎంకరేజ్‌ చెయ్యొద్దని సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని నిర్మాత గోపాలకృష్ణకు చెప్పి వేరే డైరెక్టర్‌తో చేద్దాం అన్నారు చిరంజీవి. అయితే ఇది ఆయనకు చివరి క్షణం వరకు తెలీదు. మైసూర్‌ నుంచి చెన్నయ్‌ వచ్చిన తర్వాత పులి చిత్రం నుంచి తనను తొలగించారని తెలిసింది. చిరంజీవి అలాంటి నిర్ణయం తీసుకునే మనిషి కాదని ప్రసాద్‌కి అనిపించి వెంటనే వెళ్ళి ఆయన్ని కలిశారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చిరంజీవి చెప్పడంతో చేసేది లేక వెనుతిరిగారు ప్రసాద్‌. డైరెక్టర్‌గా మంచి పొజిషన్‌లో ఉన్న తాతినేని ప్రసాద్‌కు ఈ రెండు ఘటనలతో సినిమా అవకాశాలు కూడా బాగా తగ్గాయి. అయినా అధైర్యపడలేదు. తన తండ్రి అంతకుముందు తెలుగు సినిమాలతోపాటు హిందీ సినిమాలు కూడా విరివిగా చేశారు. దాంతో బాలీవుడ్‌ వెళ్లిపోయారు. తెలుగులో పాతిక సినిమాలు డైరెక్ట్‌ చేసిన ప్రసాద్‌ బాలీవుడ్‌లో కె.సి.బొకాడియా కంపెనీలో అసోసియేట్‌ డైరెక్టర్‌గా చేరారు. ప్రశాంత్‌తో ఐలవ్‌యు అనే సినిమాతో బాలీవుడ్‌లో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. రెండో సినిమా మిథున్‌ చక్రవర్తితో జన్‌తా కి అదాలత్‌ చేసే అవకాశం ఇచ్చారు కె.సి.బొకాడియా. ఇక అక్కడ మొదలైన ప్రసాద్‌ బాలీవుడ్‌ ప్రయాణం ఆగలేదు. మిథున్‌ చక్రవర్తితో 35 సినిమాలు చేశారు. ఒకే హీరోతో 35 సినిమాలు చేసిన డైరెక్టర్‌గా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు తాతినేని ప్రసాద్‌.