Read more!

English | Telugu

ఆ కథను అందరూ రిజెక్ట్‌ చేశారు. కానీ, పద్మనాభం నిర్మాతగా తొలి విజయం అందుకున్నారు!

కొన్ని సూపర్‌హిట్‌ సినిమాల వెనుక ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు ఉంటాయి. ముఖ్యంగా పాత సినిమాలకు సంబంధించిన విషయాలను ఇప్పుడు వింటూ వుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. అంత మంచి కథ సినిమాగా రావడానికి అన్ని సంవత్సరాలు పట్టిందా? అనిపిస్తుంది. అలాంటి ఒక అద్భుతమైన కథ ‘దేవత’ చిత్రంగా రూపొందింది. ఈ సినిమాకి కథను అందించింది వీటూరి. ఈ కథను ఎంతో మంది దర్శకనిర్మాతలకు వినిపించారాయన. అందరూ కథ బాగుంది అన్నారు. కానీ, సినిమాగా తీసేందుకు ఎవరూ ధైర్యం చెయ్యలేదు. అటు తిరిగి, ఇటు తిరిగి పద్మనాభం దగ్గరికి వచ్చిందా కథ. మరి ఈ కథ సినిమాగా రూపుదిద్దుకోవడం వెనుక ఎలాంటి సంగతులు జరిగాయో తెలుసుకుందాం. 

1945లో నటుడిగా తెరంగేట్రం చేసిన పద్మనాభం ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హాస్యపాత్రలు, సహాయనటుడి పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఐదేళ్ళ వయసులోనే నాటక రంగ ప్రవేశం చేశారు పద్మనాభం. సినిమాల్లో నటిస్తున్నప్పటికీ రేఖ అండ్‌ మురళీ ఆర్ట్స్‌ అనే సంస్థను స్థాపించి నాటకాలు కూడా ప్రదర్శించేవారు. సంగీత దర్శకుడు ఎస్‌.పి.కోదండపాణి ఆ నాటకాలకు సంగీతం అందించేవారు. ఆయన, పద్మనాభం రూమ్‌మేట్స్‌. ఒకసారి వారిని రచయిత వీటూరి కలిసారు. ఆ సందర్భంలో తన దగ్గర ఉన్న కథను వినిపించారాయన. కథ బాగుంది. హీరోయిన్‌ డబుల్‌ రోల్‌. ఇది నాటకానికి పనికి రాదు, పెద్ద తారలను పెట్టి భారీ బడ్జెట్‌తో సినిమాగా తియ్యాలి. పద్మనాభంకి నిర్మాత కావాలని ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ నటుడిగా బాగా బిజీగా ఉండడం వల్ల సినిమా నిర్మాణం జోలికి వెళ్ళలేదు. దానివల్ల సినిమా అవకాశాలు తగ్గుతాయని భావించారాయన. అలాంటి సమయంలో సినిమా నిర్మాణం కరెక్ట్‌ కాదు అనుకున్నారు. ఈ కథను ఇంకా ఎవరికైనా చెప్పండి. ఎవరు చేసినా సంతోషమే అన్నారు పద్మనాభం. 

ఇక ఆ కథ విషయాన్ని అప్పుడే మర్చిపోయాడు పద్మనాభం. రెండు నెలలు గడిచిపోయింది. కానీ, కోదండపాణి మాత్రం మర్చిపోలేదు. ‘మంచి కథ దొరికింది కదా. నువ్వే ధైర్యం చేసి సినిమా తియ్యొచ్చుగా’ అన్నారు. దాంతో ఆలోచనలో పడ్డ పద్మనాభం. ఆ కథతోనే సినిమా నిర్మించాలనుకొని ఎన్టీఆర్‌ హీరో అయితే బాగుంటుంది భావించారు. వీటూరితో కలిసి ఆయన్ని కలిసారు పద్మనాభం. కథ బాగా నచ్చడంతో సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నారు ఎన్టీఆర్‌. తను హీరోగా నటించే సినిమాతో పద్మనాభం నిర్మాతగా మారుతున్నందుకు ఆయన ఎంతో ఆనందించి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఆ తర్వాత సావిత్రిని కలిసారు. ఆమెకు కూడా కథ నచ్చి ఓకే చెప్పారు. ఒకే సినిమా నాకు రెండు మంచి పాత్రలు లభించాయన్నమాట అంటూ సరదాగా అన్నారు సావిత్రి. అప్పటికి ఆమె మూడు నెలల గర్భవతిగా ఉన్నారు. సినిమా షూటింగ్‌ ఆరు నెలలైనా పడుతుంది. అప్పుడు తను షూటింగ్‌లో పాల్గొనడం కష్టం కదా అన్నారామె. దానికి పద్మనాభం.. మూడు నెలల్లోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆమెకు అడ్వాన్స్‌గా కొంత డబ్బు ఇచ్చే సమయంలో పొరపాటున ఒక వంద రూపాయల నోటు జారి కిందపడిపోయింది. దాన్ని సావిత్రి తీసి ఇస్తూ ఇది శుభసూచకం.. మీ సినిమా 100 రోజులు ఆడుతుంది చూడండి అన్నారు. ఆమె నోటి వాక్కు ఫలించి సినిమా ఘనవిజయం సాధించింది. కె.హేమాంబరధరరావు దర్శకుడుగా. ఎస్‌.పి. కోదండపాణి సంగీత దర్శకుడుగా ఎంపిక చేసుకున్నారు. తన ఇంటిని రూ.40 వేలకు తాకట్టు పెట్టి సినిమా నిర్మాణం ప్రారంభించారు పద్మనాభం. 

ఎన్టీఆర్‌ తల్లిదండ్రులుగా నిర్మల, నాగయ్య నటించారు. ఈ సినిమాలో పద్మనాభం సరసన గీతాంజలి నటించారు. మిగతా పాత్రలను రాజబాబు, రాజనాల, నగేష్‌, పేకేటి తదితరులు పోషించారు. తెలుగు చలన చిత్ర చరిత్రలో 22 మంది ప్రముఖ నటీనటులు పాల్గొన్న ప్రప్రథమ చిత్రం అంటూ పబ్లిసిటీ చేశారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే నటుడు నాగయ్యకు పద్మశ్రీ అవార్డు లభించింది. దాన్ని సెట్‌లోనే సెలబ్రేట్‌ చేశారు పద్మనాభం. ఈ చిత్రానికి ఎస్‌.పి.కోదండపాణి అద్భుతమైన పాటలు చేశారు. ఇప్పటికీ ఆదరణ పొందుతున్న పాటల్లో ‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి..’, ‘కన్నుల్లో మిసమిసలు కనిపించనీ..’, ‘బొమ్మను చేసి, ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక’, ‘తొలి వలపే పదే పదే..’ వంటి సూపర్‌హిట్‌ సాంగ్స్‌ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ పాటల రికార్డులు అప్పట్లో రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి. సంగీత కళాకారులు తమ ప్రతి కచ్చేరీలో ఈ పాటలను ఆలపించి జనం చేత చప్పట్లు కొట్టించుకునేవారు. ముఖ్యంగా ‘బొమ్మను చేసి, ప్రాణము పోసి’ పాటకు విపరీతమైన ఆదరణ లభించింది. 1965 జూలై 24న ఈ సినిమా విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సినిమా 50 రోజుల ఫంక్షన్‌ను రాజమండ్రిలోని ఓ థియేటర్‌లో నిర్వహించారు.