Read more!

English | Telugu

53 ఏళ్ళ క్రితమే 80 దేశాల్లో రిలీజ్‌ అయి.. రికార్డు సృష్టించిన సూపర్ స్టార్ కృష్ణ సినిమా!

 

సౌ

 

సౌత్‌ ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ హీరో అనగానే గుర్తొచ్చే పేరు సూపర్‌స్టార్‌ కృష్ణ. కథల ఎంపికలోగానీ, చిత్ర నిర్మాణంలోగానీ, పెర్‌ఫార్మెన్స్‌ పరంగా గానీ ఎక్కడా రాజీ పడకుండా, లాభనష్టాల గురించి ఆqలోచించకుండా ముందుకు దూకే కృష్ణ.. ఆ దూకుడుతోనే భారీ విజయాల్ని అందుకున్నారు. సూపర్‌స్టార్‌ కృష్ణ కెరీర్‌లో అత్యంత సాహసోపేతమైన నిర్ణయం ‘అల్లూరి సీతారామరాజు’ జీవితాన్ని తెరకెక్కించడం. ఆ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఇండియాలోనే మొదటి కౌబాయ్‌ చిత్రాన్ని నిర్మించి మరోసారి సాహసాన్ని ప్రదర్శించారు కృష్ణ. ప్రస్తుత రోజుల్లో ఒక సినిమాను నాలుగైదు భాషల్లో విడుదల చేస్తున్నారంటే దాన్ని పాన్‌ ఇండియా సినిమాగా పిలుస్తున్నారు. కానీ,  53 ఏళ్ళ క్రితమే ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రాన్ని 80 దేశాల్లో సక్సెస్‌ఫుల్‌గా రిలీజ్‌ చేసి సంచలనం సృష్టించారు కృష్ణ. అసలు ఈ సినిమా నిర్మాణానికి ప్రేరణ ఏమిటి, తెలుగులో కౌబాయ్‌ సినిమా చెయ్యాలని కృష్ణ ఎందుకు అనుకున్నారు? అనే విషయాల గురించి తెలుసుకుందాం. 

కౌబాయ్‌ కల్చర్‌కి, ఇండియాకి అసలు సంబంధమే లేదు. మెక్సికో, సదరన్‌ యునైటెడ్‌ స్టేట్స్‌లో ఈ కౌబాయ్‌ కల్చర్‌ అనేది ఉంటుంది. హాలీవుడ్‌లో ఈ తరహా సినిమాలు విపరీతంగా వచ్చేవి. హాలీవుడ్‌ సినిమాల్లో కౌబాయ్‌ అనగానే గుర్తొచ్చే హీరో క్లింట్‌ ఈస్ట్‌వుడ్‌. కౌబాయ్‌ పాత్రకు ప్రాణం పోసిన హీరో అతను. సూపర్‌స్టార్‌ కృష్ణ హాలీవుడ్‌ సినిమాలు ఎక్కువగా చూసేవారు. ఆ క్రమంలో ‘మెకన్నాస్‌ గోల్డ్‌’, ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ అనే కౌబాయ్‌ సినిమాలు చూశారు. అప్పుడే తెలుగులో కౌబాయ్‌ సినిమా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. ఈ విషయం రచయిత ఆరుద్రకు చెప్పి కథ రెడీ చేయమన్నారు. ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ సినిమా కథను బేస్‌ చేసుకొని, 23 కౌబాయ్‌ సినిమాలు, రెండు ఇంగ్లీష్‌ నవలల ఆధారంగా తెలుగు నేటివిటీకి అనుగుణంగా ‘అదృష్ట రేఖ’ అనే కథను సిద్ధం చేశారు ఆరుద్ర. 

ఈ కథతో సినిమా చెయ్యాలంటే బడ్జెట్‌ చాలా ఎక్కువ అవుతుంది.  అంత డబ్బుతో ఎక్స్‌పెరిమెంట్‌ చేస్తే డబ్బు తిరిగి వస్తుందా అనే సందేహం కూడా కృష్ణకు వచ్చింది. ఇలాంటి విషయాల్లో వెనక్కి తగ్గే ఆలోచన చేయని కృష్ణ ముందుకు వెళ్ళడానికే నిర్ణయించుకున్నారు. కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభమైంది. అప్పటివరకు భారీ తెలుగు సినిమాలన్నీ ఎక్కువగా స్టూడియోల్లోనే రూపొందేవి. కానీ, తొలిసారి ఒక సినిమాను ఔట్‌డోర్‌లో షూట్‌ చేసేందుకు రెడీ అయ్యారు కృష్ణ. అంతకుముందు ఏ తెలుగు సినిమాలు షూటింగ్‌ చేయని బికనీర్‌ కోట, శివబాడి టెంపుల్‌, దేవికుంట సాగర్‌, సిమ్లా, రాజస్థాన్‌, టిబెట్‌ సరిహద్దు ప్రాంతాల్లో షూటింగ్‌ చేసిన ఘనత సూపర్‌స్టార్‌ కృష్ణకు దక్కింది. షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే విజయా సంస్థ అధినేత చక్రపాణి ఈ సినిమాకి సంబంధించిన గెటప్స్‌ చూసి ఇలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించడం కష్టం అని చెప్పారు. ఆరోజుల్లో చక్రపాణి జడ్జిమెంట్‌కి ఒక వేల్యూ ఉండేది. అప్పటికే సగం సినిమా పూర్తయి ఉండడంతో అవేవీ పట్టించుకోకుండా ముందడుగు వేశారు కృష్ణ. 

పద్మాలయా స్టూడియోస్‌ బేనర్‌లో కృష్ణ నిర్మించిన తొలి సినిమా ‘అగ్నిపరీక్ష’. ఈ సినిమా అంతగా ఆడలేదు. దీంతో రెండో సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. షూటింగ్‌ జరిగిన తర్వాత కొన్ని సన్నివేశాలు సరిగా రాలేదని సన్నిహితులు చెప్పడంతో వాటిని రీ షూట్‌ చేసారు. అలాగే క్లైమాక్స్‌ కూడా సంతృప్తికరంగా రాకపోవడంతో మళ్ళీ తీశారు. సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకొని ఫస్ట్‌ కాపీ వచ్చిన తర్వాత సన్నిహితులు, శ్రేయోభిలాషుల కోసం ప్రివ్యూ వేశారు కృష్ణ. అక్కడికి వచ్చిన వారిలో చాలా మందికి సినిమా నచ్చలేదు. ఆడియన్స్‌ ఈ తరహా సినిమాలను ఆదరించడం కష్టం అని చెప్పుకున్నారు. అయితే ఎన్‌.టి.రామరావు మాత్రం వారికి భిన్నంగా సినిమా తప్పకుండా పెద్ద హిట్‌ అవుతుందని చెప్పి కృష్ణను అభినందించారు. 1971 ఆగస్ట్‌ 27న ‘మోసగాళ్ళకు మోసగాడు’ విడుదలై కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేసింది. ఇంగ్లీష్‌ చిత్రాల స్ఫూర్తితో తెలుగులో రూపొందిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రాన్ని మళ్ళీ ఇంగ్లీష్‌లోకి డబ్‌ చేసి రిలీజ్‌ చేస్తే అక్కడ కూడా ఈ సినిమాకి మంచి ఆదరణ లభించడం గొప్ప విశేషంగా చెప్పుకోవాలి. తెలుగు వెర్షన్‌ నిడివి 14,000 అడుగులు. దాన్ని ఇంగ్లీష్‌ వెర్షన్‌ కోసం 9,000 అడుగులకు కుదించి ‘ట్రెజర్‌ హంట్‌’ పేరుతో 80 దేశాల్లో రిలీజ్‌ చేశారు. అలాగే తమిళ్‌, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్‌ అయింది. ఆరోజుల్లో కలర్‌లో సినిమా తియ్యాలంటే రూ.12 లక్షల వరకు బడ్జెట్‌ అయ్యేది. అలాంటిది కేవలం రూ.7 లక్షల్లోనే 28 రోజుల్లో ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రాన్ని నిర్మించి సంచలనం సృష్టించారు సూపర్‌స్టార్‌ కృష్ణ. 

ఈ సినిమా తర్వాత కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ దర్శకత్వంలోనే అర్జున్‌ హీరోగా కౌబాయ్‌ నెం.1 అనే సినిమా వచ్చింది. ఈ సినిమా అంతగా ఆడలేదు. ఆ తర్వాత చిరంజీవి హీరోగా రూపొందిన మరో కౌబాయ్‌ మూవీ ‘కొదమసింహం’. ఈ సినిమా ఏవరేజ్‌గా నిలిచింది. ఆ తర్వాత 2002లో కృష్ణ తనయుడు మహేష్‌ హీరోగా జయంత్‌ సి.పరాన్జీ ‘టక్కరిదొంగ’ చిత్రాన్ని రూపొందించారు. ఇది డిజాస్టర్‌ అయింది. ఇక ఆ తర్వాత తెలుగులో కౌబాయ్‌ సినిమాలను నిర్మించే సాహసం ఎవరూ చేయలేదు.