English | Telugu
విజయశాంతితో సినిమా చెయ్యనని చెప్పిన శోభన్‌బాబు.. ఎందుకో తెలుసా?
Updated : Sep 10, 2025
అందాల నటుడు శోభన్‌బాబు నటించిన సినిమాలకు మహిళా ప్రేక్షకుల ఆదరణ విపరీతంగా ఉండేది. దానికి తగ్గట్టుగానే ఫ్యామిలీ సెంటిమెంట్‌తో కూడిన కథలే ఆయన దగ్గరకు వచ్చేవి. ఒక దశలో శోభన్‌బాబు ఇద్దరు హీరోయిన్లతో ఎక్కువ సినిమాలు చేశారు. అలా చేసిన ఓ విభిన్నమైన సినిమా ‘బావా మరదళ్లు’. ఈ సినిమాలో శోభన్‌బాబు సరసన రాధిక, సుహాసిని నటించారు. మొదట సుహాసిని స్థానంలో విజయశాంతిని హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ, ఆమెతో నటించనని శోభన్‌బాబు చెప్పారు. అలాగే ఈ చిత్రాన్ని నిర్మించిన రాశి మూవీస్ నరసింహారావుతో కూడా సినిమా చెయ్యడానికి ఆయన ఇష్టపడలేదు. విజయశాంతితో కలిసి నటించడానికి, నరసింహారావుతో సినిమా చెయ్యడానికి శోభన్‌బాబు ఎందుకు ఒప్పుకోలేదు? దాని వెనుక ఉన్న కారణాలు ఏమిటి? అనే ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం.
1982లో విడుదలైన తమిళ సినిమా ‘ఎంకయో కెట్ట కురల్’ ఘనవిజయం సాధించింది.
రజినీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఎస్.పి.ముత్తురామన్ దర్శకత్వం వహించారు. రాధ, అంబిక హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని చూసిన రాశి మూవీస్ నరసింహారావు దాన్ని తెలుగులో రీమేక్ చెయ్యాలనుకున్నారు. ఈ సినిమా గురించి రచయిత సత్యమూర్తికి, డైరెక్టర్ ఎ.కోదండరామిరెడ్డికి చెప్పారు. వాళ్ళు కూడా సినిమా చూశారు. సత్యమూర్తికి నచ్చింది. కానీ, కోదండరామిరెడ్డికి నచ్చలేదు. అందులో చాలా మార్పులు చెయ్యాలన్నారు. ఈ సినిమాను శోభన్‌బాబుతో చెయ్యాలన్నది నరసింహారావు ఆలోచన. కథ ప్రకారం శోభన్‌బాబు భార్య లేచిపోతుంది. అందగాడైన శోభన్‌బాబు భార్య లేచిపోయింది అని చూపిస్తే ఆడియన్స్ కన్విన్స్ అవ్వరు అని కోదండరామిరెడ్డి వాదించారు. అంతకుముందు వచ్చిన ఇల్లాలు కూడా ఇలాంటి సబ్జెక్ట్‌తోనే చేశారు. మళ్ళీ ఈ సినిమా ఎందుకు అని అడిగారు. కానీ, నరసింహారావు మాత్రం సినిమా చెయ్యాలని ఫిక్స్ అయ్యారు.
తమ సినిమాలో నటించాల్సిందిగా శోభన్‌బాబుని అడిగారు నరసింహారావు. తను సినిమా చెయ్యడానికి చాలా టైమ్ పడుతుందని, రెండు సంవత్సరాలు పట్టినా పట్టొచ్చని చెప్పారు శోభన్‌బాబు. వాస్తవానికి నరసింహారావు సినిమా చెయ్యడానికి ఇష్టం లేకనే ఆయన అలా చెప్పారు. అంతేకాదు, తన రెమ్యునరేషన్‌ని అప్పుడు తను తీసుకుంటున్న దానికి నాలుగైదు లక్షలు పెంచి చెప్పారు. అలా అయితేనే చేస్తానన్నారు. నరసింహారావు దానికి కూడా ఒప్పుకున్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా చేసేందుకు ఓకే చెప్పారు శోభన్‌బాబు. ఇద్దరు హీరోయిన్లలో ఒక హీరోయిన్‌గా మొదట జయసుధను అనుకున్నారు. అయితే తనకు ఉన్న కమిట్‌మెంట్స్ వల్ల ఆమె చేయలేనని చెప్పారు. అప్పుడు రాధికను ఓకే చేసుకున్నారు. మరో హీరోయిన్‌గా విజయశాంతిని ఫిక్స్ చేశారు. శోభన్‌బాబు పక్కన హీరోయిన్ అనగానే ఆమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
శోభన్‌బాబు అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్ధపడిన నరసింహారావు అడ్వాన్స్ ఇచ్చేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. అడ్వాన్స్ కూడా ఎక్కువే ఇచ్చారు. ఆ సమయంలో హీరోయిన్ల ఎవరని అడిగారు శోభన్‌బాబు. రాధిక, విజయశాంతి పేర్లు చెప్పారు. అయితే విజయశాంతితో చెయ్యనని అన్నారు. కారణం ఏమిటని నరసింహారావు అడిగారు. ‘కొత్తగా ఇండస్ట్రీకి వచ్చింది. చిన్నపిల్ల. నా కూతురిగా, చెల్లెలుగా చేసింది. నా పక్కన ఆమె హీరోయిన్‌గా సెట్ అవ్వదు’ అన్నారు శోభన్‌బాబు. ఆ కారణంగా విజయశాంతిని తప్పించి సుహాసినిని తీసుకున్నారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో కొన్ని మార్పులు చేసి సినిమాను ప్రారంభించారు. 1984లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. చాలా సెంటర్స్‌లో శతదినోత్సవం జరుపుకుంది. సినిమా రిలీజ్‌కి ముందే శోభన్‌బాబుకి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ రెమ్యునరేషన్ తీసుకొని ఆయన ఇంటికి వెళ్లారు నరసింహారావు. కానీ, పెంచి చెప్పిన అమౌంట్ తీసుకునేందుకు శోభన్‌బాబు ఒప్పుకోలేదు. సినిమా చెయ్యకుండా తప్పించుకోవడానికే అలా రెమ్యునరేషన్ పెంచి చెప్పానని, కాబట్టి తను ఎంత తీసుకుంటున్నానో అంతే ఇవ్వమని అన్నారు శోభన్‌బాబు. ఆ తర్వాత బావామరదళ్లు హండ్రెడ్ డేస్ ఫంక్షన్‌లో సినిమా ప్రారంభానికి ముందు జరిగిన ఈ విషయాలన్నీ ప్రస్తావించారు శోభన్‌బాబు.