English | Telugu

ఎఎన్నార్‌, కృష్ణ, కృష్ణంరాజులను దాటుకొని శోభన్‌బాబుకు వచ్చిన సినిమా శతదినోత్సవం జరుపుకుంది!

ఎఎన్నార్‌, కృష్ణ, కృష్ణంరాజులను దాటుకొని శోభన్‌బాబుకు వచ్చిన సినిమా శతదినోత్సవం జరుపుకుంది!

సినిమా రంగంలో ఒకరు చెయ్యాల్సిన సినిమా మరొకరికి వెళ్ళడం, ఒకరు రిజెక్ట్‌ చేసిన కథతో మరొకరు సినమా చేసి సూపర్‌హిట్‌ కొట్టడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. తనకి ఎలాంటి క్యారెక్టర్స్‌ సూట్‌ అవుతాయి అనే విషయంలో హీరో కృష్ణ ఎంతో క్లారిటీతో ఉండేవారు. తనతో సినిమా చెయ్యాలని వచ్చిన ఎంతోమంది దర్శకనిర్మాతలకు ఆ క్యారెక్టర్‌ ఫలానా హీరో చేస్తే బాగుంటుందని వచ్చిన సినిమాలను కాదనుకున్న సందర్భాలు కృష్ణ కెరీర్‌లో కోకొల్లలు. అలాంటి ఓ అద్భుతమైన సినిమా హీరో శోభన్‌బాబుకి రావడం వెనుక కృష్ణ జడ్జిమెంట్‌ బాగా పనిచేసింది. ఆ క్యారెక్టర్‌ తను చేస్తే పండదని, శోభన్‌బాబుకి కరెక్ట్‌గా సరిపోతుందని చెప్పారు కృష్ణ. ఆ సినిమా పేరు ‘బలిపీఠం’. 

అప్పటివరకు సొంత కథలతోనే సినిమాలు రూపొందిస్తూ వచ్చిన దర్శకరత్న దాసరి నారాయణరావు ‘బలిపీఠం’ నవల ఆధారంగా సినిమాను రూపొందించారు. రంగనాయకమ్మ రచించిన బలిపీఠం హక్కులను నిర్మాత సునీల్‌ చౌదరి 1973లోనే కొనుగోలు చేశారు. చిత్ర సమర్పకుడు ముప్పలనేని శేషగిరిరావు ఈ కథను అక్కినేని నాగేశ్వరరావుతో సినిమాగా నిర్మించాలనుకున్నారు. కానీ, ఆ సమయంలో ఎఎన్నార్‌ హార్ట్‌ ఆపరేషన్‌ కోసం అమెరికా వెళుతున్నారు. ఆయనతో చేయడం సాధ్యం కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ గురించి కృష్ణకు చెప్పారు. దాసరి నారాయణరావు డైరెక్షన్‌లో సినిమా అనగానే ఆయన ఓకే చెప్పారు. ఆ వెంటనే కృష్ణ హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘బలిపీఠం’ చిత్రాన్ని ప్రారంభించబోతున్నట్టు పేపర్‌లో ప్రకటన కూడా ఇచ్చారు. షూటింగ్‌ కోసం నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో కృష్ణ ఈ సినిమా విషయంలో తన మనసు మార్చుకున్నారు. ఇలాంటి కథ తన కంటే శోభన్‌బాబుకైతే బాగుంటుందని, మీకు వేరే సినిమా చేస్తానని నిర్మాతకు చెప్పారు. 

అప్పుడు శోభన్‌బాబును సంప్రదించారు నిర్మాతలు. తనకు రెండు సంవత్సరాల వరకు ఖాళీ లేదని, అప్పటివరకు ఆగితే తప్పకుండా చేస్తానని శోభన్‌బాబు చెప్పారు. అంతకాలం ఆగే పరిస్థితి లేకపోవడంతో కృష్ణంరాజుతో వెళ్దామని డిసైడ్‌ అయ్యారు. అప్పటికి కృష్ణంరాజు సొంత సినిమా ‘కృష్ణవేణి’ షూటింగ్‌ కోసం అహోబిళం వెళ్లి వున్నారు. ఏ హీరోతో సినిమా చేద్దామనుకున్నా ఏదో ఒక అడ్డంకి వస్తుండడంతో ఏం చేద్దామా అని నిర్మాతలు ఆలోచిస్తుండగా, శోభన్‌బాబు నుంచి ఓ కబురు వచ్చింది. తను చేస్తున్న రెండు సినిమాలు క్యాన్సిల్‌ అయ్యే అవకాశం ఉందని, కాబట్టి మీరు సినిమా చేసుకుంటానంటే సంవత్సరం లోపు డేట్స్‌ ఇస్తానని చెప్పడంతో ‘బలిపీఠం’ చిత్రానికి ఓ దారి దొరికింది. 

హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలి అనే విషయంలో ఎన్నో తర్జన భర్జనలు పడ్డారు దర్శకనిర్మాతలు. అప్పటికి టాప్‌ హీరోయిన్‌గా ఉన్న వాణిశ్రీ అయితే బాగుంటుందని పంపిణీదారులు చెప్పారు. మరోపక్క జమున అయితే బాగుంటుందని నిర్మాత అన్నారు. కానీ, సినిమాలోని అరుణ పాత్ర స్వభావం పూర్తిగా తెలిసిన దాసరి నారాయణరావు ఆ ప్రపోజల్‌కి ఒప్పుకోలేదు. అరుణ పాత్రలో ఎన్నో షేడ్స్‌ ఉన్నాయని, ఆ తరహా పాత్ర శారద అయితే బాగా చెయ్యగలదని భావించారు. ఎందుకంటే అలాంటి పాత్రలు పలు సినిమాల్లో చేసి మంచి పేరు తెచ్చుకున్నారు శారద. దాంతో ఆమెనే ఫిక్స్‌ చేసుకున్నారు. అప్పటివరకు దాసరి నారాయణరావు బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాలే చేశారు. ఇది ఆయనకు తొలి కలర్‌ మూవీ. 1974లో షూటింగ్‌ను ప్రారంభించి 1975లో సినిమాను విడుదల చేశారు. ఆంధ్రప్రభ వార పత్రికలో ఈ కథ సీరియల్‌గా కొన్ని నెలలపాటు రావడంతో ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఆసక్తి కనబరిచారు. అప్పటివరకు ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ సినిమాలను మాత్రమే రెండేసి థియేటర్లలో రిలీజ్‌ చేసేవారు. ‘బలిపీఠం’ చిత్రాన్ని మాత్రం ప్రత్యేకంగా మహిళల కోసం మూడో థియేటర్‌లో వారం రోజులపాటు ప్రదర్శించారు. ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన లభించింది. శోభన్‌బాబు, శారద తమ పాత్రల్లో జీవించారు. ఈ సినిమా క్లైమాక్స్‌లో కంటతడి పెట్టని ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాలో శోభన్‌బాబు అద్భుతమైన నటనకు మద్రాస్‌ ఫిలిం ఫ్యాన్స్‌ అవార్డును లభించింది. నాలుగు కేంద్రాల్లో వందరోజులు ప్రదర్శింపబడిన ఈ చిత్రం శతదినోత్సవాన్ని విజయవాడలోని వినోదా టాకీస్‌లో నిర్వహించారు.