English | Telugu
బయోగ్రఫీ: రంగనాథ్ జీవితం.. ఓ విషాదాంత సినిమా!
Updated : Jul 17, 2023
కొందరి జీవితాలు సినిమాల్లా ఉంటాయి. కొన్ని సినిమాలు జీవితాలను పోలి ఉంటాయి. ప్రముఖ నటుడు రంగనాథ్ విషయానికొస్తే.. తన జీవితం కూడా ఓ సినిమాలానే ఉంటుంది. కాకపోతే.. పలు మలుపులతో సాగిన విషాదాంత సినిమాలా. అవును.. అందమైన వృత్తి, అంతకుమించి అర్థం చేసుకునే భార్య ఇలా సాగిపోతున్న రంగనాథ్ జీవితంలో ఓ అనూహ్య ఘటన.. అతని జీవితాన్నే మార్చివేసింది. విషాదాంత సినిమాలాంటి రంగనాథ్ జీవితం.. బయోగ్రఫీ రూపంలో మీ కోసం..
రంగనాథ్ పూర్తిపేరు.. తిరుమల సుందర శ్రీ రంగనాథ్. 1949 జూలై 17న టీఆర్ సుందర రాజు, టీఆర్ జానకి దేవి దంపతులకు జన్మించిన రంగనాథ్.. అమ్మమ్మ, తాతయ్యల వద్ద పెరిగారు. ఆ ఆహ్లాదకర, ఆరోగ్యకరమైన వాతావరణం ప్రభావంతో ఎదుగుతూ.. తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీలో బీఏ డిగ్రీ పట్టా పొందారు. ఆ అర్హతతోనే భారత రైల్వేస్ లో టికెట్ కలెక్టర్ గా ఉద్యోగం పొందిన రంగనాథ్ ని.. రంగుల ప్రపంచం ఎంతగానో ఆకర్షించింది.
ఈ క్రమంలోనే.. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుతో దిగ్గజ దర్శకుడు బాపు రూపొందించిన 'బుద్ధిమంతుడు' సినిమాలో రంగనాథ్ కి చిన్న వేషం దక్కింది. 1969లో రిలీజైన ఈ సినిమా తరువాత వెంటనే అవకాశాలు రాకపోయినా.. 1974లో రూపొందిన 'చందన'లో ఏకంగా కథానాయకుడి పాత్ర దక్కింది. దాన్ని సద్వినియోగం చేసుకున్న రంగనాథ్.. ఆపై 'జమీందారు గారి అమ్మాయి', 'పల్లె సీమ', 'పంతులమ్మ', 'రామచిలుక', 'అమెరికా అమ్మాయి', 'అందమే ఆనందం', 'మా ఊరి దేవత', 'దేవతలారా దీవించండి', 'ఇంటింటి రామాయణం', 'ప్రియబాంధవి', 'మేనత్త కూతురు', 'రామయ తండ్రి', 'లవ్ ఇన్ సింగపూర్', 'మదన మంజరి' తదితర చిత్రాల్లో హీరోగా చేశారు. మరోవైపు అగ్ర కథానాయకుల చిత్రాల్లో సహాయక వేషాల్లోనూ కనిపిస్తూ వచ్చారు.
నవలా కథానాయకులను తలపించేలా మంచి ఒడ్డూపొడవు రూపంతో మెరిసిపోయే రంగనాథ్.. మంచి గాత్రం, దేహధారుడ్యం, ప్రతిభ ఉన్నప్పటికీ సరైన సినీ నేపథ్యం, ప్రోత్సాహకులు లేకపోవడంతో తన అర్హతకు తగ్గ స్థాయికి వెళ్ళలేకపోయారు. అలాగే.. కుటుంబ పరిస్థితులు కూడా అతన్ని కెరీర్ లో ఆశించిన స్థాయికి తీసుకెళ్ళలేకపోయాయి. అయినప్పటికీ నిరాశపడక తనను వరించిన అవకాశాలతో ముందుకు సాగారు. 'ఎర్రమల్లెలు', 'ఈ చరిత్ర ఏ సిరాతో', 'ఈ చదువులు మాకొద్దు', 'ఇది కాదు ముగింపు' వంటి ఆలోచనాత్మక చిత్రాల్లో ఆకట్టుకున్న రంగనాథ్.. 'ఖైదీ', 'పల్నాటి సింహం', 'అడవి దొంగ', 'కలియుగ కృష్ణుడు', 'దొంగ మొగుడు', 'అంతిమ తీర్పు', 'స్టేట్ రౌడీ', 'ముత్యమంత ముద్దు', 'కొండవీటి దొంగ', 'కొదమ సింహం', 'బృందావనం', 'ప్రేమంటే ఇదేరా', 'స్నేహితులు', 'ప్రేమకు వేళాయెరా', 'కలిసుందాం.. రా', 'మన్మథుడు', 'రాధాగోపాళం', 'శ్రీ రామదాసు', 'లక్ష్మి', 'ఎవడైతే నాకేంటి', 'సామాన్యుడు', 'అహ నా పెళ్ళంట', 'సోలో' తదితర విజయవంతమైన సినిమాల్లో ముఖ్య పాత్రల్లో తనదైన ముద్రవేశారు. అంతేకాదు.. 'మొగుడ్స్ పెళ్ళామ్స్' పేరుతో తన దర్శకత్వంలో ఓ సినిమాని సైతం రూపొందించారు.
అలాగే బాపు దర్శకత్వంలో తెరకెక్కిన 'భాగవతం'తో బుల్లితెరపై తొలిసారిగా మెరిసిన రంగనాథ్.. ఆపై దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన టీవీ సీరియల్ 'శాంతి నివాసం'తో సందడి చేశారు. ఆనక 'మై నేమ్ ఈజ్ మంగతాయారు', 'ఇద్దరు అమ్మాయిలు', 'అత్తో అత్తమ్మ కూతురో', 'మొగలిరేకులు' వంటి ధారావాహికల్లో రంజింపజేశారు. మొత్తంగా.. నాలుగు దశాబ్దాలకి పైగా సినీ జీవితంలో 300కి పైగా చలనచిత్రాల్లో కథానాయకుడిగా, సహాయకనటుడిగా, ప్రతినాయకుడిగా, గుణచిత్ర నటుడిగా పలు వేషాల్లో మురిపించారు రంగనాథ్.
వెండితెర జీవితంలో తన అభినయంతో వెలుగులు పంచిన రంగనాథ్.. నిజజీవితంలోనూ భర్తగా, తండ్రిగా బాధ్యాతయుతంగా ముందుకు సాగారు. తన శ్రీమతి తిరుమల చైతన్య ఓ ప్రమాదం కారణంగా వీల్ ఛైర్ కే పరిమితమైన సమయంలో.. నాలుగేళ్ళ పాటు భర్తగా పలు సపర్యలు చేశారు రంగనాథ్. అయితే 2009లో శ్రీమతి తిరుమల చైతన్య తనువు చాలించాక.. రంగనాథ్ ఆలోచనాధోరణి మారిపోయింది. భార్యావియోగంతో ఒంటరి జీవితాన్ని గడపలేక సతమతమైన ఆయన.. 2015 డిసెంబర్ 19న తన ఆలోచన శైలికి భిన్నంగా ఆత్మహత్య చేసుకున్నారు. అలా.. ఓ విషాదాంత సినిమాలా ఆయన జీవితం ముగిసింది.