English | Telugu
డైరెక్టర్ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న రమ్యకృష్ణ.. అసలేం జరిగింది?
Updated : Oct 14, 2025
1990వ దశకంలో ఎక్కువ శాతం యాక్షన్ సినిమాలు రిలీజ్ అయ్యేవి. మధ్య మధ్య కొన్ని ప్రేమకథా చిత్రాలు, కామెడీ సినిమాలు కూడా వచ్చేవి. ఆరోజుల్లో హీరోయిన్లను ఎంతో గ్లామరస్‌గా చూపించేందుకు డైరెక్టర్లు తాపత్రయపడేవారు. హీరో చేసే యాక్షన్ సీన్స్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారో, హీరోయిన్ల ఎక్స్‌పోజింగ్‌కి కూడా అంతే ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. కానీ, ఎస్.వి.కృష్ణారెడ్డి మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఉండేవారు. 1991లో విడుదలైన కొబ్బరిబొండాం చిత్రం ద్వారా రచయితగా, సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు ఎస్.వి.కృష్ణారెడ్డి. ఆ తర్వాత రెండేళ్ళకు రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రంతో దర్శకుడిగా మారారు. అప్పటి నుంచి 2023లో వచ్చిన ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు చిత్రం వరకు దాదాపు 40 సినిమాలకు దర్శకత్వం వహించారు.
కృష్ణారెడ్డి ఇండస్ట్రీకి వచ్చే నాటికి యాక్షన్ సినిమాలు రాజ్యమేలుతున్నాయి. ఆ సినిమాల మధ్య ఫ్యామిలీ, సెంటిమెంట్, హాస్యాన్ని మిక్స్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన బాణీని ఏర్పరుచుకున్నారు. తన ప్రతి సినిమాలోనూ ఇవన్నీ ఉండేలా జాగ్రత్తలు తీసుకునేవారు. అప్పుడు లైమ్‌లైట్‌లో ఉన్న దర్శకుల మాదిరిగా కాకుండా హీరోయిన్లను ఎంతో గౌరవప్రదంగా చూపించేవారు. తన సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులు, అశ్లీలతకు తావిచ్చేవారు కాదు. అంతేకాదు, తన సినిమాల్లోని హీరోయిన్లపాత్రలకు ఎంతో ప్రాధాన్యమిచ్చేవారు. దాదాపు ప్రతి సినిమాలోనూ కథ వారి చుట్టూనే తిరుగుతుంది. దాంతో కృష్ణారెడ్డి సినిమాలకు మహిళా ప్రేక్షకుల ఆదరణ విపరీతంగా ఉండేది. ఆయన డైరెక్ట్ చేసిన సినిమా రిలీజ్ అవుతోందంటే కుటుంబ సమేతంగా థియేటర్లకు తరలి వెళ్లేవారు. ఆ క్రమంలోనే 1997లో శ్రీకాంత్, రమ్యకృష్ణ జంటగా రూపొందించిన ‘ఆహ్వానం’ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన సంఘటనను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు కృష్ణారెడ్డి.
వివాహానికే కాదు, విడాకులకు కూడా ఆహ్వాన పత్రిక ఉండాలంటూ రూపొందించిన సినిమా ‘ఆహ్వానం’. కొత్త కాన్సెప్ట్‌తో కృష్ణారెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. మహిళా ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ చేసిన పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తయిన తర్వాత యూనిట్ నుంచి సెలవు తీసుకొని వెళ్లిపోవడానికి సిద్ధమైన రమ్యకృష్ణను ఆపి పట్టు బట్టలు, 10వేల రూపాయలు ఉన్న వెండి పళ్లాన్ని అందించి బొట్టు పెట్టి సంప్రదాయ పద్ధతిలో ఆమెను సాగనంపారు కృష్ణారెడ్డి. దాంతో ఒక్కసారిగా రమ్యకృష్ణ ఎమోషనల్ అయిపోయి కన్నీటి పర్యంతమైంది. యూనిట్‌లోని మిగతా సభ్యులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. తన కుటుంబ సభ్యురాలికి తను ఇచ్చిన గౌరవంగా భావించానని, అది తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటనగా కృష్ణారెడ్డి చెబుతారు. హీరోయిన్లంటే కేవలం గ్లామర్‌కి, పాటలకు మాత్రమే పరిమితం అనుకుంటారు. కానీ, వారికి ఎంతో ప్రాధాన్యమిచ్చి గౌరవించడం అనేది ఎస్.వి.కృష్ణారెడ్డికి మాత్రమే సాధ్యమైంది.