English | Telugu
కృష్ణంరాజుకి భార్యగా, కూతురిగా రాధ.. 35 ఏళ్ళ క్రితం వచ్చిన ఆ సినిమా ఏంటో తెలుసా
Updated : Sep 1, 2023
తెలుగువారిని విశేషంగా అలరించిన కథానాయికల్లో రాధ ఒకరు. ఒకవైపు గ్లామర్ రోల్స్ లో నటిస్తూనే.. అడపాదడపా అభినయానికి ఆస్కారమున్న పాత్రల్లోనూ ఆకట్టుకున్నారు. కొన్ని చిత్రాల్లో ద్విపాత్రాభినయంతోనూ మురిపించారు. అలా.. రాధ తల్లీకూతుళ్ళుగా ఓ సినిమాలో నటించి మెప్పించారు. ఆ చిత్రమే.. కృష్ణంరాజు కథానాయకుడిగా నటించిన ప్రాణ స్నేహితులు.
హిందీ సినిమా ఖుద్ గర్జ్ (జితేంద్ర, శత్రుఘ్న సిన్హా) ఆధారంగా రూపొందిన ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు వి. మధుసూదన రావు తెరకెక్కించగా.. టైటిల్ రోల్స్ లో కృష్ణంరాజు, శరత్ బాబు కనిపించారు. ప్రాణస్నేహితులైన ఇద్దరు మిత్రులు కొన్ని కారణాల వల్ల శత్రువులుగా మారడం, తిరిగి ఒకటవడం అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమానే.. తరువాతి రోజుల్లో కొండపల్లి రాజా (వెంకటేశ్, సుమన్, నగ్మా)గా తెరకెక్కడం విశేషం. ఇక ఈ సినిమాలో కృష్ణంరాజుకి భార్యగా, కూతురిగా రెండు విభిన్న పాత్రల్లో తన అభినయంతో ఆకట్టుకున్నారు రాధ.
రాజ్ కోటి సంగీతమందించిన ఈ చిత్రంలో స్నేహానికన్న మిన్నా అంటూ సాగే పాట విశేషాదరణ పొందింది. 1988 సెప్టెంబర్ 2న విడుదలై విజయం సాధించిన ప్రాణ స్నేహితులు.. శనివారంతో 35 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.