Read more!

English | Telugu

డిసెంబ‌ర్ మంత్‌.. ఆడియెన్స్ ముందుకొస్తున్న 4 క్రేజీ మూవీస్‌!

 

కొవిడ్ సెకండ్ వేవ్ అనంత‌రం తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్లు తెరుచుకున్నాక ఇంత‌దాకా భారీ చిత్రాలేవీ ప్రేక్ష‌కుల ముందుకు రాలేదు. ఉన్నంత‌లో నాగ‌చైత‌న్య 'ల‌వ్ స్టోరి', అఖిల్ అక్కినేని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' మూవీస్ థియేట‌ర్ల‌లో విడుద‌లై, విజ‌యం సాధించాయి. అయితే మాస్ స్టార్స్ మాత్రం ఇంత‌దాకా ఆడియెన్స్‌ను ప‌ల‌క‌రించ‌లేదు. అయితే వారి నిరీక్ష‌ణ ఫ‌లించ‌బోతోంది. డిసెంబ‌ర్ మొద‌ట్లోనే నట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ 'అఖండ'గా ఆడియెన్స్ ముందుకు వ‌స్తున్నారు. నిన్న విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌తో పాటు డిసెంబ‌ర్ 2న మూవీ విడుద‌ల‌వుతోంద‌ని నిర్మాత‌లు అనౌన్స్ చేశారు. బాల‌య్య‌-బోయ‌పాటి కాంబినేష‌న్ మూవీ కావ‌డంతో 'అఖండ‌'పై అంచ‌నాలు అసాధార‌ణ రీతిలో ఉన్నాయి. పైగా టైటిల్ రోల్‌లో బాల‌య్య క‌నిపించిన విధానం, ఆయ‌న చెప్పిన ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ కార‌ణంగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ‌వుతుందా అని వేయిక‌ళ్ల‌తో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

ఒక ఈ ఏడాది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా అల్లు అర్జున్ టైటిల్ రోల్ చేసిన 'పుష్ప' పార్ట్ 1 డిసెంబ‌ర్ 17న పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ స‌హా ఐదు భాష‌ల్లో రిలీజ‌వుతోంది. ఇప్ప‌టికే ఈ సినిమాలో బ‌న్నీ మేన‌రిజం డైలాగ్ "త‌గ్గేదే లే" ఏ రేంజ్‌లో జ‌నాల్లోకి వెళ్లిందో తెలిసిందే. డిగ్లామ‌ర‌స్ రోల్ పుష్ప‌రాజ్‌గా అల్లు అర్జున్ చెల‌రేగి న‌టించాడ‌ని ఇంత‌దాకా రిలీజ్ చేసిన టీజ‌ర్స్ తెలియ‌జేశాయి. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌రికొత్త రికార్డులు న‌మోదు చేసే స‌త్తా ఉన్న సినిమాగా 'పుష్ప‌: ద రైజ్'పై అంచ‌నాలు అంబ‌రాన్ని చుంబిస్తున్నాయి.

'పుష్ప‌', 'అఖండ' సినిమాలు కాకుండా డిసెంబ‌ర్‌లో మ‌రో రెండు సినిమాలు రిలీజ‌వుతున్నాయి. అవి మాస్ స్టార్స్ మూవీ కాక‌పోయినా, ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ ఉన్న సినిమాలే. వాటిలో ఒక‌టి నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ రూపొందిస్తోన్న 'శ్యామ్ సింగ రాయ్' కాగా, రెండోది - వ‌రుణ్ తేజ్ టైటిల్ రోల్‌లో నూత‌న ద‌ర్శ‌కుడు కిర‌ణ్ కొర్ర‌పాటి రూపొందిస్తోన్న 'గ‌ని'. ఈ రెండూ క్రిస్మ‌స్ సెల‌వుల‌ను టార్గెట్‌గా చేసుకొని డిసెంబ‌ర్ 24న రిలీజ‌వుతున్నాయి. 'శ్యామ్ సింగ రాయ్‌'లో నాని స‌ర‌స‌న సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ నాయిక‌లుగా న‌టిస్తుండ‌గా, 'గ‌ని' సినిమాలో వ‌రుణ్ జోడీగా బాలీవుడ్ తార సాయీ మంజ్రేక‌ర్ చేస్తోంది. 

ఇలా మంచి క్రేజ్ ఉన్న నాలుగు సినిమాలు వ‌స్తుండ‌టంతో డిసెంబ‌ర్ మాసం ఆడియెన్స్‌కు ట్రీట్‌గా మార‌నుంది.