Read more!

English | Telugu

ఆ ఇద్దరికీ ఇచ్చిన మాట కోసం.. 5 లక్షలు నష్టపోయిన రామానాయుడు!

సినిమా రంగంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే నిర్మాత అయినా, డైరెక్టర్‌ అయినా వారు ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఎంతోమంది ఎన్నో రకాల సాయాలు కోరతారు. కొందరికి నటించాలన్న కోరిక ఉంటుంది, కొందరికి డైరెక్షన్‌ చెయ్యాలన్న ఆశ ఉంటుంది. అలాంటి వారు అడిగినపుడు కాదనలేక ఛాన్స్‌ ఇస్తానని చెప్తారు. కానీ, అన్నీ అనుకూలించకపోవడం వల్ల వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేరు. ఇక కొందరు ఉంటారు.. చేస్తానని మాట ఇచ్చారంటే తప్పకుండా చేసి తీరతారు. అలాంటి వారిలో మూవీమొఘల్‌ డా.డి.రామానాయుడు ఒకరు. ఒకసారి అలా ఇద్దరికి మాట ఇవ్వడం వల్ల వారికి ఉపయోగం జరగకపోగా..  రామానాయుడికి రూ.5 లక్షలు నష్టం వచ్చింది.

‘సెక్రటరీ’ వంద రోజుల వేడుకలో నటుడు కైకాల సత్యనారాయణ అదే వేదికపై ఉన్న నిర్మాత రామానాయుడిని ప్రస్తావిస్తూ ‘రామానాయుడుగారి బేనర్‌లో నాలాంటి నటుడు హీరోగా నటించినా అది సూపర్‌హిట్‌ అవుతుంది’ అన్నారు. ఫంక్షన్‌ ముగిసిన తర్వాత ‘మీకు హీరోగా నటించాలని ఉంటే చెప్పండి సినిమా తీసాను’ అని కైకాలతో మాట వరసకి అన్నారు. ఆ తర్వాత ఆ విషయాన్ని ఆయన మరచిపోయారు. సత్యనారాయణ మాత్రం దాన్ని మర్చిపోలేదు. పైగా పాత్రికేయులతో తాను సురేష్‌ ప్రొడక్షన్స్‌లో హీరోగా నటిస్తున్నానని చెప్పారు. 

కొన్ని రోజుల తర్వాత రామానాయుడు ‘సావాసగాళ్ళు’ అనే సినిమాను నిర్మించారు. ఆ సినిమా ద్వారా బోయిన సుబ్బారావు దర్శకుడుగా పరిచయమయ్యారు. తమిళ హాస్య నటుడు నగేష్‌ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించారు. బోయిన సుబ్బారావు డైరెక్షన్‌కి కొత్త కావడంతో అతనికి సలహాలు ఇవ్వడాన్ని గమనించిన రామానాయుడు.. ‘ఆయనకిది మొదటి సినిమా. కంగారు పెట్టకండి.. మీకు అంతగా ఇంట్రెస్ట్‌ ఉంటే చెప్పండి.. మీకు డైరెక్టర్‌గా అవకాశం ఇస్తాను’ అని ఇక్కడ కూడా మాటవరసకే అన్నారు. దాన్ని సీరియస్‌గా తీసుకున్న నగేష్‌ రామానాయుడికి ఒక కథ వినిపించి దర్శకుడుగా అవకాశం ఇవ్వమని అడిగారు.  

నటుడు సత్యనారాయణకు హీరోగా అవకాశం ఇస్తానని, నగేష్‌కి డైరెక్టర్‌గా ఛాన్స్‌ ఇస్తానని మాట ఇచ్చినందుకు దానికి కట్టుబడి వారితో సినిమా చెయ్యాలని డిసైడ్‌ అయ్యారు రామానాయుడు. ‘మొరటోడు’ పేరుతో సత్యనారాయణ హీరోగా, జయసుధ హీరోయిన్‌గా, నగేష్‌ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టారు. 1977 డిసెంబర్‌లో ఈ సినిమా విడుదలైంది. కానీ, విజయం సాధించలేదు. ఆ తర్వాత ‘ఆ ఇద్దరికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి నేను 5 లక్షలు నష్టపోవాల్సి వచ్చింది’ అని ఓ సందర్భంలో సరదాగా అన్నారు రామానాయుడు.