English | Telugu
మొదట నవ్వులపాలై 'మాయాబజార్'తో మాయచేసిన తారకరాముని శ్రీకృష్ణావతారం!
Updated : May 28, 2021
జగద్విఖ్యాత నటుడు నందమూరి తారకరామారావు తన కెరీర్‌లో 40 పౌరాణిక చిత్రాలు చేస్తే, వాటిలో శ్రీకృష్ణుని పాత్ర పోషించిన చిత్రాలు 18. సాంఘిక చిత్రాల్లో వచ్చే అంతర్నాటకాలతో కలిపి 33 సార్లు కృష్ణునిగా కనిపించారు. ప్రపంచంలోని మరే నటుడూ ఒకే పాత్రను వెండితెరపై ఇన్నిసార్లు పోషించిన దాఖలా లేదు. శ్రీకృష్ణుడంటే మనకు ఆ వేషంలోని ఎన్టీఆరే కళ్లముందు మెదులుతారు.
నిజానికి ఆయన కృష్ణ పాత్రను మొదటిసారి 'సొంతవూరు' అనే సాంఘిక చిత్రంలో చేసి నవ్వుల పాలయ్యారు. ఆ విషయాన్ని ఆయనే ఓ సందర్భంగా చెప్పారు. "నా మొట్టమొదటి కృష్ణుని వేషం చూసి నాకే నవ్వు వచ్చింది. కొన్ని నాటకాల్లో లాగా డబ్బా కృష్ణుడి వేషం అనిపించింది. ఆ కిరీటం, దుస్తులు నాకసలు నచ్చలేదు. నా ముఖమే నాకు భయంకరంగా అనిపించింది. ఇలా మాత్రం ఇంకెప్పుడూ చేయకూడదని నిర్ణయించుకున్నాను." అని తెలిపారు ఎన్టీఆర్.
అయితే ఏ పాత్రకు తను సరిపోనని అనుకున్నారో ఆ పాత్రతోనే చలనచిత్ర జగత్తులో ఒక కొత్త ఒరవడి సృష్టించారు. సాక్షాత్తూ ఆయన శ్రీకృష్ణుడనే నమ్మకంతో ఆ వేషంలోని ఆయన ఫొటోలను పల్లెపట్టుల్లోని తెలుగువారు తమ ఇళ్లల్లో పెట్టుకొని పూజలు చేశారు. 1957లో విడుదలైన 'మాయాబజార్' డైరెక్టర్ కె.వి. రెడ్డి.. ఆ చిత్రంలోని శ్రీకృష్ణుని పాత్రకు ఎన్టీఆర్ పేరును ప్రతిపాదించినప్పుడు నిర్మాతలు సహా అందరూ వ్యతిరేకించారు. ఆ పాత్రకు ఉండాల్సిన లక్షణాలు ఆయనకు లేవని వారు వాదించారు.
ఆ రోజుల్లో కృష్ణుని పాత్రకు ఈలపాట రఘురామయ్య పెట్టింది పేరు. ఇటు రంగస్థలం మీద కానీ, అటు వెండితెర మీద కానీ అప్పటిదాకా కృష్ణుడంటే ఆయనే. అందుకని మాయాబజార్‌లోనూ ఆ పాత్రకు రఘురామయ్యను తీసుకొమ్మని కె.వి. రెడ్డిని ఒత్తిడి చేశారు. కానీ ఆ వాదనను కె.వి. రెడ్డి తోసిపుచ్చారు. శ్రీకృష్ణ పాత్రకు రామారావు బాగా నప్పుతారని గట్టిగా చెప్పి అందర్నీ ఒప్పించారు.
'మాయాబజార్' విడుదలయ్యాక ఆయన నమ్మకం వంద శాతం నిజమైంది. ఎంతో అందమైన శ్రీకృష్ణుడిని మొదటిసారిగా ప్రేక్షకులు సినిమాతెరపై చూశారు. హాస్యనటులు పద్మనాభం ఓ ఇంటర్వ్యూలో.. "రామారావుగారు 'మాయాబజార్' చిత్రంలో శ్రీకృష్ణడిగా వేశారు. ఆ చిత్రానికే కాదు, వారిక్కూడా బ్రహ్మాండమైన పేరు వచ్చింది. శ్రీకృష్ణుడంటే రవివర్మ చిత్రాల్లో ఊహించుకుంటాం. కాని అన్నగారు ఆ వేషంలో ముఖ్యంగా ద్వాపరయుగంలోని శ్రీకృష్ణుడిలాగానే ఉన్నారు." అని చెప్పారు.
ఆ తర్వాత వినాయక చవితి, సతీ అనసూయ, దీపావళి, శ్రీ కృష్ణార్జున యుద్ధం, వీరాభిమన్యు, శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణావతారం, శ్రీకృష్ణ విజయం, శ్రీకృష్ణ సత్య, శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం, దానవీరశూర కర్ణ, శ్రీ మద్విరాట పర్వం తదితర చిత్రాల్లో ఆయన శ్రీకృష్ణునిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.