English | Telugu
44 ఏళ్ల క్రితం కలెక్షన్ పరంగా కొత్త రికార్డులు సృష్టించిన నటరత్న ఎన్టీఆర్ ‘కొండవీటి సింహం’!
Updated : Oct 7, 2025
(అక్టోబర్ 7తో 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా..)
జానపద, పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాలతో నటుడిగా లెక్కకు మించిన సినిమాలు చేసి పురాణ పురుషుడిగా ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు నటరత్న ఎన్.టి.రామారావు. 1970వ దశకం వచ్చేసరికి సాంఘిక చిత్రాల్లో తన వైభవాన్ని కొనసాగించారు. 1977 సంవత్సరం ఎన్టీఆర్ కెరీర్‌లో అతి కీలకమైన సంవత్సరంగా చెప్పాలి. ఆ ఏడాది దానవీరశూర కర్ణ, అడవిరాముడు, యమగోల వంటి సిల్వర్ జూబ్లీ సినిమాలతో ఆయన కెరీర్ పీక్స్‌కి వెళ్లిపోయింది. ఆ క్రమంలోనే 1979లో వచ్చిన డ్రైవర్ రాముడు, వేటగాడు చిత్రాలు ఎన్టీఆర్‌ను తిరుగులేని హీరోగా నిలబెట్టాయి. ఆ సమయంలో ఎన్టీఆర్ దరిదాపుల్లో మరో హీరో లేరంటే అతిశయోక్తి కాదు. ఆ వరసలోనే వచ్చిన మరో సిల్వర్ జూబ్లీ సినిమా ‘కొండవీటి సింహం’. తమిళ్‌లో శివాజీ గణేశన్ హీరోగా రూపొందిన ‘తంగ పతకం’ చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు కె.రాఘవేంద్రరావు. 1981 అక్టోబర్ 7న విడుదలైన ‘కొండవీటి సింహం’ సంచలన విజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపించింది. రోజా మూవీస్ పతాకంపై ఎం.అర్జునరాజు, కె.శివరామరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో ఎస్.పి. రంజిత్‌కుమార్ పాత్రలో తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శించారు. రాము పాత్రలో శ్రీదేవితో కలిసి ఆయన వేసిన స్టెప్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు చక్రవర్తి సారథ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. ‘ఈ మధుమాసంలో.. ఈ దరహాసంలో’, ‘మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే..’ పాటలు ప్రేక్షకుల మనసుల్ని సెంటిమెంట్‌తో తట్టి లేపగా, ‘అత్తమడుగు వాగులోన అత్త కొడకో..’, ‘పిల్ల వుంది..పిల్ల మీద కోరికుంది.. ’, ‘బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది..’, ‘వానొచ్చే వరదొచ్చే వలపల్లే వయసొచ్చే..’ వంటి పాటలు ప్రేక్షకుల చేత చిందులు వేయించాయి. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, ఆయనకు అన్ని సందర్భాల్లోనూ సపోర్ట్‌గా నిలిచే యంగ్ క్యారెక్టర్‌లోనూ ఎన్టీఆర్ నటన అద్భుతం అని చెప్పాలి. సెంటిమెంట్, యాక్షన్, గ్లామర్, కామెడీ.. ఇలా అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాకి బాగా కుదిరాయి. దాంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. విడుదలైన అన్ని సెంటర్స్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిసింది.
1980 దశకం ప్రారంభంలో కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించిన చిత్రంగా ‘కొండవీటి సింహం’ నిలిచింది. కలెక్షన్స్ పరంగా, రన్ పరంగా అప్పటివరకు ఉన్న రికార్డులను ఈ చిత్రం అధిగమించింది. ఈ చిత్రాన్ని దిగ్విజయంగా 300 రోజులకు పైగా ప్రదర్శించారు. విడుదలైన అన్ని కేంద్రాలలో 50 రోజులు, లేట్ రన్‌తో కలిపి మొత్తం 52 కేంద్రాలలో (37+15) - 100 రోజులు, 16 కేంద్రాల్లో (15+1) - 175 రోజులు (సిల్వర్ జుబ్లీ), 5 కేంద్రాలలో - 200 రోజులు, ఒక కేంద్రం(విశాఖపట్నం)లో 300 రోజులకు పైగా ఆడింది.మొదటి వారం రూ.34,35,908 వసూలు చేసి అల్ టైం రికార్డు సృష్టించింది.విడుదలైన 43 కేంద్రాలలో 50 రోజులకు(ఒక కోటి ఇరవై ఒక్క లక్షలు)1,21,47,837 రూపాయలు వసూలు చేసి చలనచిత్ర చరిత్రను తిరగరాసింది.
మొత్తం 5 కేంద్రాలలో 200 రోజులు ఆడింది.
1) గుంటూరు.. కృష్ణా పిక్చర్ ప్యాలెస్ (200 రోజులు)డైరెక్ట్
2) విశాఖపట్టణం.. శరత్ (205 రోజులు) డైరెక్ట్
3) శ్రీకాకుళం.. సూర్య మహల్ (221 రోజులు) డైరెక్ట్
4) హైదరాబాద్.. సెలెక్ట్ - షిఫ్టు మీద (262 రోజులు)
5) విజయవాడలో షిఫ్ట్ మీద 200 రోజులు ఆడింది.
గుంటూరు, విశాఖపట్టణం, శ్రీకాకుళం కేంద్రాలలో డైరెక్ట్‌గా 200 రోజులు ఈ చిత్రం ప్రదర్శింపబడింది. ఒక కేంద్రంలో 300 రోజులు ఆడింది. విశాఖపట్నం.. శరత్ (205 రోజులు) + షిఫ్ట్‌తో మొత్తం 315 రోజులు ప్రదర్శింపబడింది.