Read more!

English | Telugu

‘మనదేశం’ కంటే ముందే సినిమా ఛాన్స్‌ వచ్చినా ఎన్టీఆర్‌ చెయ్యలేదు.. ఎందుకో తెలుసా?

సినిమాలు అంతగా అందుబాటులోకి రాని రోజుల్లో నాటకాలే ప్రేక్షకులకు వినోదాన్ని అందించేవి. అందులో రాణించడమే గొప్ప అచీవ్‌మెంట్‌గా అప్పటి కళాకారులు భావించేవారు. పాత తరం నటీనటులందరూ నాటకరంగం నుంచి వచ్చిన వారే. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా పేరు తెచ్చుకున్న నందమూరి తారక రామారావు కూడా నాటక రంగం నుంచి వచ్చిన వారే. ఆయన చదువుకునే రోజుల్లో లెక్కకు మించిన నాటకాల్లో తన ప్రతిభను ప్రదర్శించి అందరిచేతా శభాష్‌ అనిపించుకున్నారు. ఆ తర్వాత ‘మనదేశం’ చిత్రంతో నటుడిగా సినిమా రంగ ప్రవేశం చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమా కంటే ముందే ఎన్టీఆర్‌ సినిమాల్లోకి రావాల్సింది. కానీ, తను తీసుకున్న ఓ నిర్ణయం వల్ల ‘మనదేశం’ ఆయన తొలి సినిమా అయింది.

‘మనదేశం’ కంటే ముందే ఎన్టీఆర్‌కి సినిమాలో ఛాన్స్‌ వచ్చిందని చాలామందికి తెలీదు. సి.పుల్లయ్య దర్శకత్వంలో రూపొందిన ‘వింధ్యరాణి’ చిత్రంతోనే ఎన్టీఆర్‌ సినీ రంగ ప్రవేశం చెయ్యాల్సి ఉంది. తను డైరెక్ట్‌ చేస్తున్న సినిమాలో నటించాల్సిందిగా దర్శకుడు పుల్లయ్య.. ఎన్టీఆర్‌ను కోరారు. ఇంకా చదువుకుంటున్న కారణంగా దాన్ని ఎన్టీఆర్‌ సున్నితంగా తిరస్కరించారు. అప్పటికి ఆయన డిగ్రీ చదువుతున్నారు. బి.ఎ. డిగ్రీ చేతిలో ఉంటే తప్ప సినిమాల కోసం ప్రయత్నాలు చెయ్యకూడదని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. ఎందుకంటే సినిమా రంగం అనేది స్థిరమైంది కాదనే అభిప్రాయం ఆయనకు ఉండేది. డిగ్రీ పూర్తయిన తర్వాత సినిమా ప్రయత్నాలు చేసి అందులో సక్సెస్‌ అవ్వకపోతే ఉద్యోగం చేసుకోవచ్చని ముందు జాగ్రత్తగా ఆలోచించారు ఎన్టీఆర్‌. అందుకే ‘వింధ్యరాణి’ సినిమాలో నటించడానికి అంగీకరించలేదు. ఆ తర్వాత సి.పుల్లయ్య మరోసారి తన సినిమా విషయాన్ని ప్రస్తావిస్తూ ఎన్టీఆర్‌కు ఉత్తరం రాశారు. ఒక స్థిరమైన నిర్ణయంతో ఉన్న ఎన్టీఆర్‌ ఆ ఉత్తరానికి బదులు కూడా ఇవ్వలేదు. సినిమా రంగం అంటే ఎంతో వ్యామోహంతో చదువు పూర్తి కాకుండానే ఇంట్లో వారికి కూడా చెప్పకుండా మద్రాస్‌ రైలెక్కినవారు చాలా మంది ఉన్నారు. అయితే ఈ విషయంలో కూడా ఎన్టీఆర్‌ ఎంతో మందికి ఆదర్శప్రాయమైన నిర్ణయం తీసుకున్నారు.