English | Telugu
బాలకృష్ణ వర్సెస్ బాలకృష్ణ.. 30 ఏళ్ళ క్రితం నటసింహం రేర్ రికార్డ్..
Updated : Sep 3, 2023
ఒక అగ్ర కథానాయకుడు నటించిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజవడమే అరుదైన సంగతి. అలాంటిది ఆ రెండు చిత్రాలు కూడా శతదినోత్సవం జరుపుకోవడమంటే మాములు విషయం కాదు. ఇలాంటి రేర్ రికార్డ్ ని తన సొంతం చేసుకున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ.
ఆ వివరాల్లోకి వెళితే.. ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలయ్య నటించిన యాక్షన్ డ్రామా నిప్పురవ్వ. చాలా కాలం పాటు నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా.. 1993 సెప్టెంబర్ 3న జనం ముందు నిలిచింది. ఇక అదే రోజు.. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో బాలయ్య నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ బంగారు బుల్లోడు కూడా అనూహ్య పరిస్థితుల్లో థియేటర్స్ బాట పట్టింది. విశేషమేమిటంటే.. ఈ రెండు సినిమాలు కూడా మ్యూజికల్ గా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. హిట్ టాక్ తో బంగారు బుల్లోడు పలు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంటే.. యావరేజ్ టాక్ తెచ్చుకున్న నిప్పురవ్వ కూడా వంద రోజులు ఆడిన చిత్రంగా నిలిచింది.
ఇక నిప్పురవ్వ తనకు హిట్ పెయిర్ గా నిలిచిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కాంబినేషన్ లో బాలయ్యకి చివరి చిత్రం కాగా.. బంగారు బుల్లోడు ఏమో రమ్యకృష్ణ, రవీనా టాండన్ కాంబోలో తొలి సినిమా. బంగారు బుల్లోడుకి రాజ్ కోటి సంగీతమందిస్తే.. నిప్పురవ్వకి బప్పీలహరి, రాజ్ కోటి (రండి కదలిరండి పాట), ఎ.ఆర్. రెహమాన్ (నేపథ్య సంగీతం) మ్యూజిక్ డైరెక్టర్స్ గా పనిచేశారు. అలాగే నిప్పురవ్వని యువరత్న ఆర్ట్స్ పతాకంపై ఎం.వి. శ్రీనివాస ప్రసాద్ నిర్మిస్తే.. బంగారు బుల్లోడుని జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై వీబీ రాజేంద్ర ప్రసాద్ నిర్మించారు. ఏదేమైనా.. సరిగ్గా 30 ఏళ్ళ కిందట బాలకృష్ణ క్రియేట్ చేసిన ఈ రేర్ రికార్డుని తరువాతి కాలంలో మరే తెలుగు హీరో శతదినోత్సవం కోణంలో బీట్ చేయకపోవడం విశేషం.